Rythu Bandhu: 28 నుంచి రైతు బంధు పంపిణీ

రైతుబంధు నగదును ఈ నెల 28 నుంచి  పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. అప్పటినుంచి పది రోజుల్లోగా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామన్నారు. దళితబంధును ప్రభుత్వం యథాతథంగా అమలు చేస్తుందని,

Updated : 19 Dec 2021 10:13 IST

యథాతథంగా దళిత బంధు
నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల బదలాయింపులు పూర్తి
యాసంగిలో కిలో ధాన్యం కూడా కొనం
ప్రత్యామ్నాయ పంటల దిశగా రైతుల్ని చైతన్యపరచాలి
కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడి

ప్రగతిభవన్‌లో శనివారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌. పక్కన మోత్కుపల్లి నర్సింహులు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రైతుబంధు నగదును ఈ నెల 28 నుంచి  పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. అప్పటినుంచి పది రోజుల్లోగా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామన్నారు. దళితబంధును ప్రభుత్వం యథాతథంగా అమలు చేస్తుందని, ఇప్పటికే ప్రకటించిన విధంగా హుజూరాబాద్‌ నియోజకవర్గం, రాష్ట్రంలోని మరో 4 మండలాల పరిధిలో లబ్ధిదారుల కోసం పూర్తిస్థాయిలో త్వరలో నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల సూచనల మేరకు 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు కార్యాచరణ చేపట్టాలన్నారు. రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యం కొనలేమంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసినందున... రాష్ట్రప్రభుత్వం ఆ సీజన్‌లో కిలో వడ్లు కూడా కొనుగోలు చేయదని, కొత్తగా కొనుగోలు కేంద్రాలూ నెలకొల్పబోమని స్పష్టం చేశారు. కొత్త జోనల్‌ విధానంలో ఉద్యోగుల బదలాయింపులను నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి.. జిల్లా కలెక్టర్లతో సమావేశమయ్యారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎర్రబెల్లి, ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌అలీ, గంగుల, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, సబిత, సత్యవతి, పువ్వాడ, తలసాని, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, విప్‌ సుమన్‌, మాజీ మంత్రి మోత్కుపల్లి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం ప్రసంగంలో ముఖ్యాంశాలు...

రైతులను కాపాడుకుందాం

‘‘రైతుబంధు పథకంతో పంట పెట్టుబడి సాయాన్ని, బీమాతో అన్నదాతలకు భరోసాను కల్పిస్తున్నాం. ఎన్ని కష్టాలొచ్చినా వాటిని కొనసాగిస్తాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్ఠం చేసే దిశగా రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న దార్శనిక వ్యవసాయ విధానాలు దేశంలో ఎక్కడా లేవు. సాగునీటి ప్రాజెక్టులు కట్టి నీటివనరులను మెరుగు పరచుకున్నాం. 24 గంటలపాటు రైతులకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నాం. వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేలా కేంద్రం అనుసరిస్తున్న విధానాల నుంచి రైతుల్ని కాపాడుకునే బాధ్యత కలెక్టర్లకు, అధికారులకు ఉంది. మీరంతా క్షేత్రస్థాయిలోకి వెళ్లి, ధాన్యం కొనబోమనే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలి. భారత ఆహార సంస్థ నిర్లక్ష్యం వల్ల గోదాముల్లో మగ్గిపోతున్న బియ్యం నిల్వలు పేరుకుపోతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇందుకు సంబంధించి కేంద్రానికి లేఖలు రాయాలని చెప్పాలి. వానాకాలం పంటల సాగుపై ముందస్తు ప్రణాళిక ఉండాలి. పత్తి, కంది వంటి ప్రత్యామ్నాయ లాభసాటి పంటల సాగుపై దృష్టి సారించాలి.

స్థానికులకు నష్టం కలగొద్దు

కొత్త జోనల్‌ విధానంలో ఉద్యోగుల బదలాయింపులను నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలి. స్థానికులకు నష్టం జరగకుండా కేటాయింపులు జరగాలి. వెనకబడిన, మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేయగలిగితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. భార్యాభర్తలైన (స్పౌస్‌) ఉద్యోగులు ఒకచోట అయితేనే ప్రశాంతంగా పనిచేయగలుగుతారు. స్థానిక యువత ఉద్యోగాలకు విఘాతం కలగకుండా మానవీయ కోణంలో భార్యాభర్తల కేటాయింపు అంశాలను పరిష్కరించాలి. కొత్త జోనల్‌ వ్యవస్థతో ప్రభుత్వ పాలన క్షేత్రస్థాయిలోకి అందుబాటులోకి వస్తుంది. స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

దళిత బంధుకు త్వరలోనే నిధులు

తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ‘దళిత బంధు’ లక్ష్యం. దీనిద్వారా నూరుశాతం రాయితీ కింద అందించే రూ.10 లక్షలు, దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే కాకుండా.. సామాజిక పెట్టుబడిగా మారి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతంగా పటిష్ఠం చేయడంలో దోహదపడుతుంది. మీరు ఇప్పటివరకు చేసిన ఏ పనిలోనూ లేని సంతృప్తి దళిత బంధును అమలు చేయడంలో దొరుకుతుంది. దళిత కుటుంబాల ఆర్థికస్థితిని మెరుగుపరిచేందుకు ఉన్న అన్ని అవకాశాలను, వ్యాపార, ఉపాధి మార్గాలను శోధించాలి. అందుకు దళిత మేధావులు, విశ్రాంత ఉద్యోగుల సలహాలు, సూచనలు స్వీకరించాలి.

ఒమిక్రాన్‌పై ఆందోళన వద్దు

ఒమిక్రాన్‌పై ఆందోళన వద్దు. దాని నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. వైద్యఆరోగ్యశాఖను అప్రమత్తం చేశాం. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి’’ అని కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. అధికారులు మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉందంటూ.. అప్పటివరకు చేపట్టిన చర్యలను సీఎంకు వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని