Supreme Court: విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భరణానికి అర్హులే

 సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 125ను విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు వర్తింపజేయకపోతే అది రాజ్యాంగంలోని అధికరణం 15(1) ఉల్లంఘన కిందికే వస్తుంది.

Published : 11 Jul 2024 03:35 IST

సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 125 వీరికి వర్తిస్తుంది
ఇది లౌకిక నిబంధన.. దీనికి మతంతో సంబంధం లేదు
1986 నాటి ముస్లిం మహిళల చట్టం ఇందుకు అడ్డురాదు
భరణాన్ని దానంగా చూడకూడదు.. అది స్త్రీల హక్కు
సుప్రీంకోర్టు కీలక తీర్పు 

 సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 125ను విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు వర్తింపజేయకపోతే అది రాజ్యాంగంలోని అధికరణం 15(1) ఉల్లంఘన కిందికే వస్తుంది. కులం, మతం, లింగం, ప్రాంతం, పుట్టిన ప్రాంతం ఆధారంగా ఏ పౌరుడిపైనా వివక్ష చూపకూడదని ఆ అధికరణం చెబుతోంది. ముస్లిం మహిళలు తక్షణ ట్రిపుల్‌ తలాక్‌ లాంటి అక్రమ పద్ధతుల్లో విడాకులు తీసుకున్నా సెక్షన్‌ 125 కింద భరణం కోరే హక్కు ఉంటుంది.

 తీర్పులో సుప్రీం ధర్మాసనం


ఈనాడు, దిల్లీ: విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ నేర శిక్షాస్మృతి(సీఆర్‌పీసీ)లోని సెక్షన్‌ 125 ప్రకారం భర్త నుంచి భరణం కోరొచ్చని సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ఇందుకు 1986 నాటి ముస్లిం మహిళల (విడాకులపై హక్కుల రక్షణ) చట్టం అడ్డురాదని స్పష్టంచేసింది. వివాహమైన మహిళలందరికీ సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 125 వర్తిస్తుందని, ఇది లౌకిక నిబంధన అని తేల్చిచెప్పింది. ముస్లిం మహిళలు ఇందుకు మినహాయింపు కాదని పేర్కొంది. అంతేకాదు.. భరణాన్ని దానంగా చూడకూడదని.. అది మహిళల హక్కు అని తెలిపింది. తన భార్యకు భరణం చెల్లించాలంటూ కుటుంబ కోర్టు జారీచేసిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ.. మహమ్మద్‌ అబ్దుల్‌ సమద్‌ వేసిన పిటిషిన్‌ను కొట్టివేస్తూ న్యాయమూర్తులు జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌ ధర్మాసనం బుధవారం 99 పేజీల తీర్పును వెలువరించింది. ‘‘ముస్లిం చట్టం కింద వివాహం చేసుకున్న లేదా విడాకులు తీసుకున్న మహిళకు సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 125, ముస్లిం మహిళల చట్టం-1986 వర్తిస్తాయి. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ ఈ రెండు చట్టాల ద్వారా, లేదా ఏదో ఒక చట్టం ద్వారానైనా ఉపశమనం పొందొచ్చు. ఎందుకంటే 1986 చట్టం.. సెక్షన్‌ 125ని అడ్డుకొనేది కాదు’’ అని ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. భరణాన్ని దానంగా చూడకూడదని, అది లింగ సమానత్వానికి దోహదం చేసే అంశమని పేర్కొంది. ఈ కేసుపై జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌ వేర్వేరుగా తీర్పులు రాశారు. అయితే ఒకే అభిప్రాయాన్ని వెల్లడించారు.

మహిళలకు ఆర్థిక సాధికారతనివ్వాలి

భారతీయ మహిళలకు ఆర్థిక సాధికారతనివ్వాల్సిన అవసరం గురించి తీర్పులో జస్టిస్‌ బి.వి.నాగరత్న చెప్పారు. ‘‘స్వతంత్ర ఆర్థిక వనరులు లేని భార్య మానసికంగానే కాకుండా ఆర్థికంగానూ తమపై ఆధారపడుతుందన్న వాస్తవాన్ని కొందరు భర్తలు గ్రహించరు. ఓ గృహిణిగా మహిళ.. ప్రేమ, ఆప్యాయత తప్ప మరే ప్రతిఫలాన్ని ఆశించకుండా కుటుంబం కోసం పనిచేస్తుంది. భర్త, అతని కుటుంబం నుంచి కాస్త గౌరవాన్ని, భరోసాను మాత్రమే కోరుకుంటుంది. ఆ మాత్రం కూడా చాలా కుటుంబాల్లో మహిళలకు లభించడం లేదు. భార్యకు ఆర్థిక సాధికారత కల్పించాలి. ఇంటి ఖర్చులకే కాదు.. వ్యక్తిగత ఖర్చులకూ ఆర్థిక వనరులు అందించాలి. కనీసం ఉమ్మడి బ్యాంక్‌ ఖాతా లేదా ఏటీఏం కార్డును ఆమెకూ అందుబాటులో ఉంచాలి’’ అని పేర్కొన్నారు.

రాజ్యాంగానికి ముప్పు తొలగిపోయింది: భాజపా

సుప్రీంకోర్టు తీర్పును భాజపా స్వాగతించింది. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళకు భర్త నుంచి భరణం కోరే హక్కు ఉందని న్యాయస్థానం పేర్కొనడం ద్వారా గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రాజ్యాంగానికి తెచ్చిన ముప్పును తొలగించిందని పేర్కొంది. ‘‘షా బానో కేసులో ముస్లిం మహిళకు భర్త భరణం చెల్లించాలని సుప్రీంకోర్టు (1985) తీర్పు ఇచ్చింది. అయితే అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ తీర్పును అధిగమించడానికి పార్లమెంటులో చట్టం తెచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు.. ముస్లిం మహిళలకు భారీ ఉరటనిచ్చింది’’ అని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సుధాంశు త్రివేది పేర్కొన్నారు.

షాబానో కేసును గుర్తుకు తెచ్చిన తీర్పు

సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 125 కింద ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం కోరొచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. మళ్లీ 1985 నాటి షా బానో బేగం కేసును గుర్తుకు తెచ్చింది. ముస్లిం మహిళకు భరణం చెల్లించాల్సిందేనని 1985లో రాజ్యాంగ ధర్మాసనం.. మహమ్మద్‌ ఖాన్‌ వర్సెస్‌ షా బానో బేగం కేసులో ఏకగ్రీవంగా తీర్పిచ్చింది. ఇద్దత్‌ గడువు (విడాకులు తీసుకున్న తర్వాత మూడు నెలల) దాటిన తర్వాత కూడా ముస్లిం భర్త.. భరణం చెల్లించాలన్న ఈ తీర్పు భారీ వివాదమే రేపింది. రాజకీయంగానూ దుమారం రేగింది. ఈ అంశంపై తమ విధానం స్పష్టం చేయడానికి రాజీవ్‌గాంధీ నేతృత్వంలోని నాటి కేంద్ర ప్రభుత్వం ముస్లిం మహిళల (విడాకుల హక్కు రక్షణ) చట్టం-1986ను తెచ్చింది. విడాకులు తీసుకొనే సమయంలో ముస్లిం మహిళలు వేటికి అర్హులో ఇందులో పొందుపరిచారు. రాజ్యంగపరంగానూ 1986 చట్టం చెల్లుబాటును డానియల్‌ లతీఫీ కేసులో సుప్రీంకోర్టు సమర్థించింది. ఉమ్మడి పౌరస్మృతి, లింగ సమానత్వం అంశాలనూ షా బానో కేసులో రాజ్యాంగ ధర్మాసనం చర్చించింది. ముస్లిం మహిళలకు వివాహం, విడాకుల అంశాల్లో సమానహక్కులు ఉండాలన్న అంశాన్ని ఈ తీర్పే తెరపైకి తీసుకొచ్చింది. విడాకులిచ్చిన తన భర్త నుంచి భరణం కోసం కోర్టును షా బానో ఆశ్రయించారు. జిల్లా కోర్టునుంచి ప్రారంభమైన ఈ కేసు.. రాజ్యాంగ ధర్మాసనం వరకు వెళ్లింది. బుధవారం వెలువరించిన తీర్పులోనూ జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహా ధర్మాసనం.. షాబానో తీర్పును ఉటంకించింది. విడాకులు తీసుకున్న మహిళ, తీసుకుంటున్న మహిళ విషయంలో ముస్లిం భర్త బాధ్యతను షాబానో కేసు వివరంగా పేర్కొందని.. సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 125 ప్రకారం.. భరణం కోరే హక్కు అందుబాటులో ఉంటుందన్న విషయాన్ని ఆనాటి రాజ్యాంగ ధర్మాసనం ప్రస్తావించిన అంశాన్ని న్యాయమూర్తులు గుర్తు చేశారు.


కేసు నేపథ్యమిదీ..

తనకు విడాకులు ఇచ్చిన మాజీ భర్త అబ్దుల్‌ సమద్‌ నుంచి సీఆర్‌పీసీ సెక్షన్‌ 125 కింద భరణం ఇప్పించాలని కోరుతూ తెలంగాణకు చెందిన ముస్లిం మహిళ ఒకరు కోర్టును ఆశ్రయించారు. ఆమెకు నెలకు రూ.20వేలు చెల్లించాలని కుటుంబ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 1986 చట్టం ప్రకారం 2017లో విడాకులు తీసుకున్న తనకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 125 కింద భరణం చెల్లించాలని ఆదేశించడం చట్టవిరుద్ధమంటూ సమద్‌ ఆ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టులో సవాల్‌చేశారు. ఇందులో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. అయితే భరణం మొత్తాన్ని రూ.10వేలకు తగ్గించింది. కేసు విచారణను ఆరునెలల్లోపు పూర్తిచేయాలని కుటుంబ కోర్టును ఆదేశిస్తూ 2023 డిసెంబర్‌ 13న ఉత్తర్వులను వెలువరించింది. వీటిని సవాల్‌చేస్తూ సమద్‌ దాఖలుచేసిన అప్పీల్‌ను ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని