Seethakka: మహిళాశక్తి క్యాంటీన్లు బ్రాండ్‌గా మారాలి

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల విద్యార్థులకు ఆగస్టు 15న నాటికి రెండో జత ఏకరూప దుస్తులను పంపిణీ చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు.

Published : 21 Jun 2024 06:12 IST

నాణ్యతకు మారుపేరుగా నిలవాలి  
ఆగస్టు 15 నాటికి పాఠశాల విద్యార్థులకు రెండో జత దుస్తులు 
సమీక్షలో మంత్రి సీతక్క 

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సీతక్క. పక్కన సెర్ప్‌ సీఈవో కాత్యాయని, పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి సందీప్‌ సుల్తానియా 

ఈనాడు,హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల విద్యార్థులకు ఆగస్టు 15న నాటికి రెండో జత ఏకరూప దుస్తులను పంపిణీ చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. మహిళా సంఘాలు ఆ దుస్తులను సిద్ధం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో మహిళా స్వయంసహాయక సంఘాలతో ఏర్పాటుచేస్తున్న మహిళాశక్తి క్యాంటీన్లు ఒక బ్రాండ్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. మహిళాశక్తిపై ఆమె జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, అదనపు డీఆర్డీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ‘‘ప్రజాపాలనలో మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తున్నాం. ప్రజల అవసరాలు, వనరుల లభ్యతకు తగ్గట్టుగా ‘మహిళా శక్తి’ బిజినెస్‌ మోడల్‌ ఉండాలి  స్థానికంగా లభ్యమయ్యే వస్తువుల ఆధారంగా వ్యాపారం చేస్తే అద్భుతాలు సాధించగలం. ఆధార్‌ కేంద్రాలు, మీ-సేవ సెంటర్లు, పౌల్ట్రీ, డెయిరీ వ్యాపారాలు, క్యాంటీన్లు, స్టార్టప్‌ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు మహిళా సంఘాలకు రుణ సౌకర్యం కల్పిస్తున్నాం  పర్యాటక కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, జాతీయ రహదారుల వెంట మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభిస్తాం. ఇవి నాణ్యతకు మారుపేరుగా నిలవాలి. పల్లె రుచులు, ఇప్ప పువ్వు లడ్డులు, నన్నారి వంటి సంప్రదాయ ఆహార పానీయాలను పట్టణాలకు పరిచయం చేయాలి. క్యాంటీన్లకు భూకేటాయింపులు, రాయితీలు ఇస్తాం. హైదరాబాద్‌ నలుమూలల శిల్పారామాలు ఏర్పాటు చేసి డ్వాక్రా బజార్లను ప్రారంభించాలి. వచ్చే అయిదేళ్లలో మహిళా సంఘాలకు రూ. లక్ష కోట్ల బ్యాంకు రుణాలు అందిస్తాం’’ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. 


రానున్న రెండేళ్లలో 151 మహిళాశక్తి క్యాంటీన్లు   

రాష్ట్ర సర్కారు నిర్ణయం

రెండేళ్లలో రాష్ట్రంలో 151 మహిళాశక్తి క్యాంటీన్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బిహార్‌లోని దీదీకి రసోయి తరహాలో వీటిని నిర్వహించాలని ఆదేశించింది. శుక్రవారం సచివాలయంలో రెండు క్యాంటీన్లు ప్రారంభమవుతుండగా, ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్లు, ఆసుపత్రులు, దేవాలయాలు, ఆర్టీసీ బస్టాండ్‌లు, పర్యాటక ప్రాంతాలు, పారిశ్రామిక పార్కులలో వాటిని ప్రారంభిస్తారు. ప్రతీ జిల్లాకు అయిదు చొప్పున వీటిని స్థాపించాలని ప్రభుత్వం నిర్దేశించింది. క్యాంటీన్ల నిర్వహణ కోసం మహిళా సంఘాలకు జాతీయ పర్యాటక ఆతిథ్య సంస్థ (నిథమ్‌)లో శిక్షణ ఇస్తారు. దీని కోసం మహిళా సంఘాలు ఆయా సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటాయి. రెండు నమూనాలో క్యాంటీన్లు ఉంటాయి. మొదటి నమూనాకు రూ.15 లక్షలు, రెండో నమూనాకు రూ.25 లక్షలు వెచ్చిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు