Mahila Shakti Canteens: గ్రామీణ మహిళలను కోటీశ్వరులుగా చేస్తాం

గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Published : 22 Jun 2024 04:37 IST

వచ్చే రెండేళ్లలో 151 మహిళాశక్తి క్యాంటీన్లు: మంత్రి సీతక్క

మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించి వంటకాలను కొనుగోలు చేస్తున్న మంత్రి సీతక్క,
ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న, సీఎస్‌ శాంతికుమారి.. చిత్రంలో అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 151 మహిళా శక్తి క్యాంట్లీను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. శుక్రవారం సీఎస్‌ శాంతికుమారితో కలిసి మంత్రి.. అంబేడ్కర్‌ సచివాలయంలో కార్పొరేట్‌ తరహాలో ఏర్పాటుచేసిన రెండు మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రారంభించనున్న మహిళాశక్తి క్యాంటీన్లు ఒక బ్రాండుగా ఎదిగి దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. రానున్న 20 రోజుల్లో అన్ని జిల్లా ఆసుపత్రుల్లో మహిళాశక్తి క్యాంటీన్లు ప్రారంభించే పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ‘‘అమ్మచేతి వంటలా మహిళాశక్తి క్యాంటీన్లు నాణ్యతకు మారుపేరుగా నిలవాలి. పల్లెరుచులు, ఇప్పపువ్వు లడ్డూలు, నన్నారి వంటి గ్రామీణ సంప్రదాయ ఆహార పదార్థాలను పట్టణాలకు పరిచయం చేయాలి. క్యాంటీన్లు, ఆధార్, మీసేవ కేంద్రాలు, పౌల్ట్రీ, డెయిరీ ఫారాల ఏర్పాటు, సోలార్‌ ఉత్పత్తి, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, ఫొటోగ్రఫీ, డెకరేషన్, స్టార్టప్‌లను ప్రోత్సహించడంతోపాటు వివిధ వ్యాపారాల కోసం మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇస్తాం’’ అని వివరించారు. క్యాంటీన్లను ప్రారంభించిన అనంతరం మంత్రి, సీఎస్‌ శాంతికుమారి, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న, ఇతర అధికారులు అందులోని పలు వంటకాలు కొనుగోలు చేసి రుచిచూశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, సీఎం కార్యదర్శులు మానిక్‌రాజ్, చంద్రశేఖర్‌రెడ్డి, సెర్ప్‌ డైరెక్టర్‌ గోపాలరావు, సెర్ప్‌ అధికారులు నరసింహారెడ్డి, సునీతరెడ్డి, రజిత తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు