Singareni: వేలమా.. నేరుగానా?

బొగ్గు గనుల వేలం రాజకీయంగా దుమారం రేపుతోంది. గనుల పదో విడత వేలానికి కేంద్రం టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయగా.. అందులో తెలంగాణకు చెందిన గని కూడా ఉంది. సింగరేణికి కొత్త గనులను నేరుగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.

Updated : 23 Jun 2024 06:53 IST

బొగ్గు గనులపై సింగరేణి దారెటు?
కనీసం 4 శాతం రాయల్టీని నిర్ణయించిన కేంద్ర బొగ్గుశాఖ
గతంలో కోయగూడెం గని 7 శాతం, సత్తుపల్లి 5 శాతానికి ప్రైవేటుపరం
ప్రస్తుత జాబితాలోని ‘శ్రావణపల్లి’లో 11 కోట్ల టన్నుల నిల్వలు

ఈనాడు, హైదరాబాద్‌: బొగ్గు గనుల వేలం రాజకీయంగా దుమారం రేపుతోంది. గనుల పదో విడత వేలానికి కేంద్రం టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయగా.. అందులో తెలంగాణకు చెందిన గని కూడా ఉంది. సింగరేణికి కొత్త గనులను నేరుగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఇదే విషయమై గతంలో భారాస ప్రభుత్వం కూడా కేంద్రానికి లేఖలు రాసినా.. వేలం కొనసాగింది. రాష్ట్రంలోని రెండు గనుల్ని టెండరు ద్వారా ప్రైవేటు కంపెనీలు దక్కించుకున్నాయి. కేంద్రం తలపెట్టిన గనుల వేలానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం సహకరిస్తోందని భారాస ఆరోపిస్తుండగా.. గతంలో రెండు గనులను వేలం వేసినప్పుడు నాటి భారాస ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేదని కాంగ్రెస్‌ ప్రశ్నిస్తోంది. బొగ్గు గనుల వేలాన్ని రాజకీయం చేయొద్దని.. తాము చట్టప్రకారమే వ్యవహరిస్తున్నామని కేంద్ర బొగ్గు శాఖ ప్రతినిధులు చెబుతున్నారు. భారాస ప్రభుత్వం ఉన్నప్పుడే.. సింగరేణి సంస్థకు ఒడిశాలోని నైనీ గనిని కేటాయించామని భాజపా వాదిస్తోంది. ఈ నేపథ్యంలో గనుల వేలం పూర్వాపరాలు, లాభనష్టాలు తదితర అంశాలపై విశ్లేషణ ఇది.. 

చట్టానికి సవరణలు..

దేశంలో సహజ వనరులను తవ్వి తీసి అమ్మడానికి ‘గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ (ఎంఎండీఆర్‌) చట్టం’-1957 ప్రకారం కేంద్రం గతంలో అనుమతులిచ్చేది. కానీ బొగ్గు గనుల్లో పోటీతత్వం పెంచి ప్రైవేటు పెట్టుబడులు రాబట్టాలని 2015లో ఈ చట్టానికి సవరణలు చేస్తూ పార్లమెంటు ఆమోదించింది. దీని ప్రకారం 2020 జూన్‌లో బొగ్గు గనులను వాణిజ్య పద్ధతిలో వేలం వేయడాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. కేంద్ర బొగ్గు శాఖ 2020 జూన్‌ నుంచి 2023 డిసెంబరు వరకు తొమ్మిది విడతల్లో వేలం పాటలు నిర్వహించి 107 గనులను విక్రయించింది. వీటిలో 11 గనుల్లోనే బొగ్గు ఉత్పత్తి ప్రారంభమై గత ఏడాది 17.5 మిలియన్‌ టన్నులు (మి.ట.) తవ్వారు. తవ్వకాలు పూర్తిస్థాయిలో ప్రారంభమైతే ఏటా 256 మి.ట. బొగ్గు ఉత్పత్తవుతుందని కేంద్రం అంచనా.

4 శాతం రాయల్టీ.. మూలధర

టెండరు ప్రక్రియలో భాగంగా.. 4 శాతం సొమ్మును రాయల్టీ ‘బేస్‌ప్రైస్‌’ (మూలధర)గా కేంద్ర బొగ్గుశాఖ నిర్ణయించింది. దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఇంతకంటే ఎక్కువ ధరను కోట్‌ చేయాలి. అత్యధిక రాయల్టీ ధరను కోట్‌ చేసిన కంపెనీకి గని దక్కుతుంది. ఇలా కోట్‌ చేసిన శాతం మేరకు సొమ్మును ఆ కంపెనీ బొగ్గు తవ్వకాలపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలి. 

0.5శాతం అదనపు రాయల్టీ ప్రతిపాదన

కోయగూడెం-3 గనికి 7 శాతం, సత్తుపల్లి-3 గనికి 5 శాతం రాయల్టీని కోట్‌ చేసి ఆయా కంపెనీలు గతంలో టెండరు పొందాయి. కానీ అవి ఇప్పటివరకు బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించలేదు. అవి కోట్‌ చేసిన రేట్లకన్నా అదనంగా 0.5 శాతం రాయల్టీని సింగరేణి సంస్థే చెల్లిస్తుందని, వాటిని ఆ సంస్థకే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కేంద్ర బొగ్గుశాఖ మంత్రి కిషన్‌రెడ్డికి రాసిన లేఖలో కోరింది.

నామినేషన్‌పై ఇస్తే 14 శాతం చెల్లించాలి 

ప్రస్తుతం సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసే బొగ్గుపై 10 శాతం సొమ్మును పన్ను రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తోంది. సింగరేణికి నామినేషన్‌పై నేరుగా గనులు కేటాయిస్తే 10 నుంచి 14 శాతం రాయల్టీని తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని, వేలంలో అంతకన్నా తక్కువకే కొనే అవకాశాలున్నాయని కేంద్ర బొగ్గుశాఖ చెబుతోంది. అంతకన్నా తక్కువ రేట్లకే కోయగూడెం, సత్తుపల్లి గనులు ప్రైవేటు కంపెనీలకు దక్కాయని గుర్తుచేస్తోంది.

రాష్ట్రానికి అదనపు ఆదాయం

గనుల వేలం వల్ల రాష్ట్రాలకు అదనపు ఆదాయం వస్తుందని కేంద్రం చెబుతోంది. ఉదాహరణకు గత డిసెంబరులో నిర్వహించిన తొమ్మిదో విడత వేలంలో ఛత్తీస్‌గఢ్‌లోని బైసీ బొగ్గు గనిని 52 శాతం, ఝార్ఖండ్‌లోని దుమ్రి గనిని 41 శాతం రాయల్టీకి ప్రైవేటు కంపెనీలు దక్కించుకున్నాయి. డిమాండ్‌ను బట్టి ప్రైవేటు కంపెనీలు ఇలా భారీ మొత్తం రాయల్టీని కోట్‌ చేస్తుంటాయి.

బొగ్గు ధర పెరుగుతుందా?

ప్రభుత్వానికి చెల్లించే రాయల్టీ శాతం పెరిగే కొద్దీ.. కంపెనీలు బొగ్గు విక్రయ ధరలను కూడా పెంచుతాయి. సింగరేణి 10 శాతానికి మించి రాయల్టీ ధరను కోట్‌ చేసి కొత్త గనులు దక్కించుకుంటే.. ఆ సంస్థ విక్రయించే బొగ్గు ధరలు పెంచాల్సి వస్తుంది. ఇది అంతిమంగా కరెంటు, సిమెంటు ధరలపై ప్రభావం చూపుతుంది. తెలంగాణలో బొగ్గు గనులకు ఇంతవరకు ప్రైవేటు కంపెనీలు పెద్దగా టెండర్లు వేయడం లేదని, సింగరేణి 10 శాతం వరకు రాయల్టీని కోట్‌ చేసి గనులను దక్కించుకున్నా ఆ సంస్థకు అదనపు ఆర్థికభారం ఉండదని కేంద్ర బొగ్గుశాఖ అధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు.

పెట్టుబడి సింగరేణిది.. గని ప్రైవేటుకు..

సత్తుపల్లిలో ప్రస్తుతమున్న పాత గనుల నుంచి బొగ్గు రవాణాకు ప్రత్యేకంగా రైల్వేలైన్‌ నిర్మించడానికి రూ.వెయ్యి కోట్లు వెచ్చించారు. ఇందులో కొంత వాటాను సింగరేణి సంస్థ రైల్వేశాఖకు చెల్లించింది. ఏడాది కిందట రైల్వేలైన్‌ నిర్మాణం పూర్తయ్యేసరికి.. అక్కడున్న సత్తుపల్లి-3 గనిని వేలంలో ప్రైవేటు కంపెనీ దక్కించుకుంది. ఈ గనిని సింగరేణికి నేరుగా కేటాయిస్తే బొగ్గు తవ్వకం, రవాణా సులభమయ్యేది.

అనుభవం, భారీ యంత్ర పరికరాలుండడంతో గనులను తవ్వడం సింగరేణికి చాలా సులభం. ప్రైవేటు కంపెనీలైతే కొత్తగా యంత్రాలు, ఇతర సామగ్రి సమకూర్చుకోవాల్సి వస్తుంది. దీంతో భారం పెరిగి.. అవి బొగ్గు ధరలను పెంచే అవకాశం లేకపోలేదు. 


సింగరేణికి దక్కేనా?

పదో విడత వేలంలో భాగంగా.. దేశవ్యాప్తంగా 60 బొగ్గు గనులకు టెండర్ల దాఖలు ప్రక్రియ ఆన్‌లైన్‌లో శనివారం ప్రారంభమైంది. ఆగస్టు 27 వరకు గడువు ఉంది. గతంలో తెలంగాణలోని కోయగూడెం-3, సత్తుపల్లి బ్లాక్‌-3, కళ్యాణఖని-6, పెనగడప గనులను కేంద్ర బొగ్గుశాఖ వేలంలో పెట్టింది. అప్పట్లో కోయగూడెం-3, సత్తుపల్లి బ్లాక్‌-3 గనులను ‘అరబిందో రియాల్టీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ (ఆరో), అవంతిక కంపెనీలు దక్కించుకున్నాయి. మిగిలిన వాటికి టెండర్లు రాలేదు. వీటిలో శ్రావణపల్లి గనిని ఇప్పుడు మరోసారి వేలంలో పెట్టారు. కొత్త గనుల్ని నేరుగా ఇవ్వకపోతే సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి ప్రస్తుతమున్న 70 మిలియన్‌ టన్నుల నుంచి 2047 నాటికి 35 మిలియన్‌ టన్నులకు తగ్గిపోయి.. సంస్థ మూతపడే ప్రమాదముందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖలో తెలిపింది. ఈ విజ్ఞప్తికి కేంద్రం అంగీకరించకపోతే.. సింగరేణి కూడా వేలంలో టెండరు వేయాలి. లేకుంటే శ్రావణపల్లి గని ప్రైవేటు కంపెనీలకు దక్కే అవకాశం ఉంది. ఆ గనిలో 11 కోట్ల టన్నులకు పైగా బొగ్గు నిల్వలున్నాయని అంచనా. ఏటా 100 మి.ట.ల బొగ్గు కావాలని సింగరేణిని ప్రైవేటు కంపెనీలు అడుగుతున్నాయి. కానీ గత ఐదేళ్లుగా కొత్త గనుల కేటాయింపుల్లేక ఉత్పత్తిని పెద్దగా పెంచలేకపోతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని