Singareni: నైనీ కరెంటు కొంటారా?

దేశంలోని సుదూర ప్రాంతాల్లో ఉన్న థర్మల్‌ విద్యుత్కేంద్రాలకు బొగ్గు రవాణా కన్నా కరెంటు సరఫరా వ్యయం తక్కువ అవుతుందని తాజాగా కేంద్ర విద్యుత్‌శాఖ రాష్ట్రాలకు సూచించింది. బొగ్గు గనులున్న ప్రాంతాల్లోనే థర్మల్‌ విద్యుత్కేంద్రాలను నిర్మిస్తే కరెంటు చౌకగా లభిస్తుంది.

Published : 07 Jul 2024 04:59 IST

ట్రాన్స్‌కోకు లేఖ రాసిన సింగరేణి
1,600 మె.వా. విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణానికి ప్రణాళిక

మంచిర్యాల జిల్లా జైపూర్‌లో ఉన్న థర్మల్‌ కేంద్రం... దీని పక్కనే మరో 800 మెగావాట్ల ప్లాంటు నిర్మించనున్నారు

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోని సుదూర ప్రాంతాల్లో ఉన్న థర్మల్‌ విద్యుత్కేంద్రాలకు బొగ్గు రవాణా కన్నా కరెంటు సరఫరా వ్యయం తక్కువ అవుతుందని తాజాగా కేంద్ర విద్యుత్‌శాఖ రాష్ట్రాలకు సూచించింది. బొగ్గు గనులున్న ప్రాంతాల్లోనే థర్మల్‌ విద్యుత్కేంద్రాలను నిర్మిస్తే కరెంటు చౌకగా లభిస్తుంది. దేశంలో బొగ్గు రవాణాకు గూడ్సు వ్యాగన్ల కొరత తీవ్రంగా ఉందని, అనేక రకాలుగా పర్యావరణ, రవాణా సమస్యలు వస్తున్నాయని కేంద్ర పర్యావరణ శాఖ అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ ఒడిశా రాష్ట్రంలోని నైనీ ప్రాంతంలో కొత్తగా తవ్వబోతున్న బొగ్గును రోజూ గూడ్స్‌ రైళ్లలో తెలంగాణకు తరలించడం వల్ల ఆర్థికభారం పడుతుందని, అక్కడే 1,600 (800్ల2) మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో థర్మల్‌ విద్యుత్కేంద్రాల నిర్మాణానికి సింగరేణి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఆ ప్లాంటు నిర్మాణానికి 800 ఎకరాల భూములను కేటాయించాలని ఆ సంస్థ ఇటీవల ఒడిశా ప్రభుత్వానికి విన్నవించింది. అక్కడ ఉత్పత్తయ్యే కరెంటును కొంటారో లేదో తెలపాలని తెలంగాణ ట్రాన్స్‌కోకు తాజాగా లేఖ కూడా రాసింది. ఒకవేళ తెలంగాణకు అవసరం లేదని చెబితే దాన్ని ఇతర రాష్ట్రాలకు అమ్ముకోవాలనేది సింగరేణి ఆలోచన. వచ్చే మార్చికల్లా నల్గొండ జిల్లా దామరచర్లలో యాదాద్రి విద్యుత్కేంద్రం నిర్మాణం పూర్తయి 4 వేల మెగావాట్ల కరెంటు తెలంగాణకు కొత్తగా సరఫరా ప్రారంభం కానుందని అంచనా. అలాంటప్పుడు నైనీ నుంచి కరెంటు తీసుకోవాలా వద్దా అనే అంశంపై డిస్కంలతో ట్రాన్స్‌కో చర్చిస్తోంది. మంచిర్యాల జిల్లా జైపూర్‌లో ఉన్న 1,200 మెగావాట్ల పాత థర్మల్‌ కేంద్రం పక్కనే మరో 800 మెగావాట్ల ప్లాంటు నిర్మాణానికి సింగరేణి ఇప్పటికే టెండర్లు పిలిచింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో మూసివేసిన జెన్‌కో పాత థర్మల్‌ కేంద్రం స్థలాన్ని తమకు అప్పగిస్తే కొత్తగా 800 మెగావాట్ల సామర్థ్యంతో థర్మల్‌ ప్లాంటు నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి తెలిపింది. కానీ ఆ స్థలంలో జెన్‌కో ఆధ్వర్యంలోనే కొత్త ప్లాంటు నిర్మించాలని రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల ఐకాస ఇటీవల ప్రభుత్వానికి విన్నవించింది. 

రామగుండంలో ఉత్పత్తయ్యే కరెంటు తీసుకుంటే...

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణ కోసం ప్రత్యేకంగా 2,400 మెగావాట్ల థర్మల్‌ కేంద్రాన్ని రామగుండంలోనే నిర్మిస్తామని, కరెంటు కొంటారో లేదో ఈ నెలాఖరులోగా చెప్పాలని కేంద్ర విద్యుత్‌శాఖ ఇటీవల తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఎన్టీపీసీ కరెంటు తీసుకోవాల్సిన అవసరం లేదని, దాన్ని వదిలేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ రామగుండం కరెంటు తీసుకుంటే సరఫరా వ్యయం తక్కువగా ఉంటుంది. దాన్ని కాదని.. నైనీ వద్ద సింగరేణి నిర్మించే 1,600 మెగావాట్ల ప్లాంట్ల నుంచి విద్యుత్‌ తెచ్చుకుంటే సరఫరా వ్యయం అధికమవుతుందని అంచనా. 


నైనీ బ్లాక్‌ ద్వారా సింగరేణికి ఏటా రూ.3 వేల కోట్ల ఆదాయం

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి

ఈనాడు, దిల్లీ: ఒడిశాలోని అంగుల్‌ జిల్లాలో కేటాయించిన నైనీ బొగ్గు గని నుంచి ఉత్పత్తి ప్రారంభమైతే సింగరేణి సంస్థకు ఏటా రూ.3 వేల కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తద్వారా రూ.50 కోట్ల లాభం వస్తుందన్నారు. ‘‘ఈ బ్లాక్‌లో ఉత్పత్తి ప్రారంభించేందుకు ఒడిశా ప్రభుత్వం అటవీ అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడి నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగనుంది. వచ్చే మూడేళ్లలో పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యం కోటి టన్నులకు చేరుతుంది. ఇక్కడి బొగ్గును తొలుత సమీపంలో కేటాయించిన స్థలానికి సరఫరా చేస్తారు. తర్వాత తమిళనాడు జనరేషన్, డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్, నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌కు తరలిస్తారు. తెలంగాణ అవసరాలు తీర్చేందుకు అంతే మొత్తం బొగ్గును సమీప ప్రాంతాల నుంచి కోల్‌ లింకేజ్‌ స్వాపింగ్‌ పథకం కింద అందించే వీలుంది. దీని కోసం సింగరేణి కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖకు దరఖాస్తు చేసుకోనుంది. ఈ నైనీ గనిలో మొత్తం 34 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలున్నట్లు అంచనా. ఇక్కడి నుంచి వచ్చే 35-40 ఏళ్లపాటు ఉత్పత్తి జరుగుతుంది. ఈ గనికి 40-50 కిలోమీటర్ల పరిధిలో 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండు థర్మల్‌ విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా భూసేకరణ ప్రయత్నం జరుగుతోంది. సింగరేణి ఆధ్వర్యంలోనే రాష్ట్రంలో మరో 800 మె.వా. సామర్థ్యం ఉన్న ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల తెలంగాణ విద్యుత్తు అవసరాలకు మరింత భద్రత ఏర్పడుతుంది. నైనీ నుంచి బొగ్గు ఉత్పత్తి కోసం కేంద్ర పర్యావరణ, అటవీశాఖ 2022 అక్టోబరులోనే అనుమతులు ఇచ్చినా, వన్యప్రాణుల నిర్వహణ ప్రణాళిక సిద్ధం కాకపోవడంతో ఒడిశా ప్రభుత్వం ఇంతవరకూ అనుమతులు ఇవ్వలేదు. దీంతో బొగ్గుశాఖ తరఫున కార్యదర్శే వ్యక్తిగతంగా ఒడిశాకు వెళ్లి ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. మరోవైపు నేను ఒడిశా ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడి సమస్య త్వరగా పరిష్కారమయ్యేలా చొరవ తీసుకున్నాను’’ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని