Solar power plants: పొలాల్లో, బీడు భూముల్లో సౌర విద్యుత్‌ ప్లాంట్లు

పొలాల్లో, బీడు భూముల్లో, ప్రభుత్వ భూముల్లో సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 08 Jul 2024 09:26 IST

రాష్ట్రంలో 4 వేల మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాలకు కేంద్రం అనుమతి

గుజరాత్‌ రాష్ట్రంలోని దుండి గ్రామంలో వ్యవసాయ బోరుకు రైతు ఏర్పాటు చేసుకున్న సౌర విద్యుత్‌

ఈనాడు, హైదరాబాద్‌: పొలాల్లో, బీడు భూముల్లో, ప్రభుత్వ భూముల్లో సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా 4 వేల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్లను నెలకొల్పేందుకు అనుమతి కోరుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయగా కేంద్రం అంగీకరించింది. వ్యవసాయానికి అవసరమైన కరెంటును సౌర విద్యుత్కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేసేందుకు ‘ప్రధాన మంత్రి కిసాన్‌ ఊర్జా సురక్షా ఎవం ఉత్థాన్‌ మహాభియాన్‌’(పీఎం కుసుమ్‌) పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. ఈ పథకాన్ని పలు రాష్ట్రాలు ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తున్నాయి.

ప్రోత్సాహకంగా డిస్కంలకు యూనిట్‌కు 40 పైసలు

పీఎం కుసుమ్‌ పథకం కింద కేంద్రం మూడు రకాలుగా సౌర విద్యుత్‌ ఏర్పాటుకు ప్రోత్సాహకాలను ఇస్తోంది. 

కాంపొనెంట్‌ - ఎ విభాగం కింద: బీడు భూముల్లో లేదా సాగు చేసే పొలాల్లో ఒక్కో రైతు లేదా రైతు సంఘం 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న సౌర విద్యుత్‌ ప్లాంటు పెట్టుకోవచ్చు. సబ్‌స్టేషన్‌కు 5 కిలో మీటర్ల పరిధిలో ఉండాలి. సాగు భూముల్లో ఫలకాలను ఏర్పాటు చేసి వాటి కింద పంటలను కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఉత్పత్తి చేసే కరెంటును విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు యూనిట్‌కు రూ.3.13 చొప్పున చెల్లించి కొనాలని గతంలోనే రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) ఆదేశాలిచ్చింది. ఈ కరెంటును కొన్నందుకు డిస్కంకు 40 పైసలు లేదా మెగావాట్‌కు ఏడాదికి రూ.6.60 లక్షల చొప్పున ప్రోత్సాహక రాయితీ పద్దు కింద కేంద్రం చెల్లిస్తుంది. ఈ 40 పైసలు వెనక్కి వస్తున్నందున రైతుల నుంచి కొన్న కరెంటుకు యూనిట్‌కు రూ.3.13లో నికరంగా డిస్కం రూ.2.73 మాత్రమే చెల్లించినట్లు అవుతుంది. ఇంత తక్కువ ధరకు కరెంటు వస్తుంది కాబట్టి ఈ ప్లాంట్ల నుంచి డిస్కంలు కరెంటు కొనాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు తెలియజేసింది. పైగా ఈ కరెంటు ఉత్పత్తికి డిస్కం ముందుగా పైసా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికే గుజరాత్, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో రైతులు ఈ పథకం కింద ఆదాయం పొందుతున్నారు. కాంపొనెంట్‌-ఎ విభాగం కింద దేశవ్యాప్తంగా 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్లకు ఈ ప్రోత్సాహకాలను ఇస్తామని కేంద్రం తెలిపింది.

కాంపొనెంట్‌-బి విభాగం కింద: దేశవ్యాప్తంగా 17.50 లక్షల వ్యవసాయ బోర్లకు సౌర విద్యుత్‌ ఏర్పాటు చేయాలన్నది ఈ పథకం లక్ష్యం. తెలంగాణలో 24 గంటలూ వ్యవసాయ బోర్లకు ఉచితంగా  సాధారణ కరెంటు ఇస్తున్నందున దీనిని ఉపయోగించుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కొండ ప్రాంతాలు, మారుమూల అటవీ ప్రాంతాల్లో సాధారణ కరెంటు లేని చోట 400 బోర్లకు దీనిని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించాలని రాష్ట్ర ఇంధన శాఖ కేంద్రాన్ని కోరగా అనుమతించింది.

కాంపొనెంట్-సి విభాగం కింద: సాధారణంగా వ్యవసాయ బోర్లకు సౌర విద్యుత్‌ ఏర్పాటు చేసుకుని ఉపయోగించుకోగా మిగిలిన కరెంటును విద్యుత్‌ లైన్లకు అనుసంధానం చేస్తారు. ఈ విభాగం కింద ప్రతి బోరుకు విడివిడిగా సౌరవిద్యుత్‌ పెట్టడానికి రైతులు రాష్ట్రంలో ముందుకు రారని, 5 నుంచి 10 బోర్లకు ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఫలకాలు ఏర్పాటు చేసి అక్కడ ఉత్పత్తయ్యే కరెంటును విద్యుత్‌ లైన్లకు అనుసంధానిస్తే రాష్ట్రానికి ఉపకరిస్తుంది. ఈ విభాగం కింద 600 మెగావాట్ల సామర్థ్యమున్న ప్లాంట్లకు అనుమతించాలని రాష్ట్రం కోరగా కేంద్రం అనుమతించింది.

కాంపొనెంట్-బి, సి విభాగాల్లో... ఫలకాల ఏర్పాటుకయ్యే వ్యయంలో 30 శాతం సొమ్మును రాయితీగా కేంద్రం ఇస్తుంది. మరో 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. మిగిలిన 40 శాతాన్ని రైతు లేదా రైతు సంఘాలు భరించాలి. రైతులు పెట్టుకోకపోతే ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌ పరిధిలోని వ్యవసాయ బోర్ల యజమానులను రైతు సంఘంగా ఏర్పాటుచేసి ఆ సొమ్మును బ్యాంకు నుంచి రుణంగా ఇప్పించాలనేది ప్రణాళిక. దీనివల్ల రైతులు సొంతంగా భరించే సొమ్ము ఏమీ ఉండదు. అక్కడ ఉత్పత్తయ్యే కరెంటును కొన్న డిస్కం చెల్లించే సొమ్ము నుంచి బ్యాంకు బకాయి తీర్చేస్తారు. దీనివల్ల వ్యవసాయానికి ఉచితంగా కరెంటుతో పాటు, రైతులు వాడుకోగా మిగిలే యూనిట్లకు వారికి అదనంగా నెలనెలా ఆదాయం కూడా వస్తుంది. గుజరాత్‌లో రైతులు సంఘాలుగా ఏర్పడి ఈ విధానంతో ఆదాయం పొందుతున్నట్లు టాటా ట్రస్ట్‌ ప్రతినిధులు తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి వివరించారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేయడానికి సహకరిస్తామని టాటా ట్రస్ట్‌ పేర్కొంది. ప్రభుత్వం దీనిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని