TG News: ఆత్మీయ గురువుకు అరుదైన గౌరవం!

హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్‌ మసీద్‌బండలోని జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పల్లె అనంత్‌రెడ్డి తన బడినే గుడిగా చేసుకుని బతికారు.

Updated : 10 Jul 2024 09:13 IST

వాహనంపై ఊరేగించి, బుల్లెట్‌ బండి బహుమతి


ఉపాధ్యాయులు పల్లె అనంత్‌రెడ్డి, యాదగిరిని సన్మానిస్తున్న విద్యార్థులు

మాదాపూర్, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్‌ మసీద్‌బండలోని జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పల్లె అనంత్‌రెడ్డి తన బడినే గుడిగా చేసుకుని బతికారు. చేతికొచ్చే జీతంపై కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంపైనే ధ్యాస చూపారు. అలాంటి గురువు బదిలీపై వెళుతుంటే విద్యార్థులంతా భారమైన హృదయాలతో ఘనమైన వీడ్కోలు పలికారు. అనంత్‌రెడ్డి అక్కడ 14 ఏళ్లపాటు విద్యార్థులకు గణితం బోధించడంతోపాటు ప్రధానోపాధ్యాయుడిగా సేవలందించారు. ఆయన షాబాద్‌ మండలం హైతాబాద్‌ పాఠశాలకు బదిలీ అయ్యారు. ఇదే పాఠశాలలో 11 ఏళ్లు పనిచేసిన ఎస్జీటీ యాదగిరికి సైతం స్థానచలనమైంది. విద్యార్థులు మంగళవారం ఇద్దర్నీ మసీద్‌బండలోని ఆంజనేయస్వామి ఆలయం నుంచి పాఠశాల వరకు జీప్‌ మీద ఊరేగిస్తూ పూలుచల్లుతూ, బాణసంచా పేల్చారు.

పూర్వ విద్యార్థులు బహూకరించిన బుల్లెట్‌ను నడుపుతున్న అనంత్‌రెడ్డి

సగం జీతం పాఠశాల ప్రగతికే ఖర్చు 

సొంతిల్లు కూడా లేని అనంత్‌రెడ్డి... తన వేతనంలో సగానికిపైగా విద్యార్థులు, పాఠశాల అభివృద్ధికి ఖర్చు చేశారు. దాతల సహకారంతో రూ.2కోట్లతో పాఠశాల అదనపు గదులను నిర్మింపజేశారు. పదో తరగతి విద్యార్థులకు ఏటా సొంత ఖర్చులతో సాయంత్రం అల్పాహారం, రాత్రి భోజనం అందించి ప్రత్యేక తరగతులు నిర్వహించారు. వారంతా ఉతీర్ణులయ్యేలా శిక్షణ అందించారు. ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చారు. తమకు అత్యంత ఇష్టమైన ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్తున్నారని తెలిసి హైదరాబాద్‌తోపాటు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, బెంగళూరు తదితర నగరాల్లో స్థిరపడిన 200 మంది వరకు పూర్వవిద్యార్థులు మంగళవారం మసీద్‌బండకు విచ్చేశారు. తమ ఆత్మీయ గురువుకు రూ.3లక్షల విలువైన బుల్లెట్‌ను అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని