Sub Inspectors: ఎస్సైలుగానే పుష్కరకాలం!

పోలీసుశాఖలో పదోన్నతుల ప్రక్రియ తరచూ చర్చనీయాంశమవుతోంది. నిన్నమొన్నటి వరకు పాత జోన్ల మధ్య వివాదాలు తలెత్తగా... ఇప్పుడు కొత్తగా మల్టీజోన్లు ఏర్పాటైనా వీటికి పరిష్కారం కనిపించడంలేదు.

Published : 17 Jun 2024 04:36 IST

317 జీవో ప్రభావంతో పదోన్నతులకు నిరీక్షణ
2012 బ్యాచ్‌ పూర్వ వరంగల్‌ జోన్‌ ఎస్సైలది విచిత్ర పరిస్థితి

ఈనాడు, హైదరాబాద్‌: పోలీసుశాఖలో పదోన్నతుల ప్రక్రియ తరచూ చర్చనీయాంశమవుతోంది. నిన్నమొన్నటి వరకు పాత జోన్ల మధ్య వివాదాలు తలెత్తగా... ఇప్పుడు కొత్తగా మల్టీజోన్లు ఏర్పాటైనా వీటికి పరిష్కారం కనిపించడంలేదు. ప్రస్తుతం మల్టీజోన్‌-1లో 2012 బ్యాచ్‌ ఎస్సైల్లో అత్యధికులు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తమ బ్యాచ్‌కే చెందిన కొందరికి ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి లభించినా మిగిలినవారు మాత్రం అలాగే ఉన్నారు. ఈ నిరీక్షణ ఏకంగా పుష్కరకాలానికి చేరడం విస్తుగొలిపే అంశంగా మారింది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఇంత సుదీర్ఘకాలం ఎస్సైలుగానే పనిచేసిన బ్యాచ్‌ ఇదే కావడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు పలు కారణాలున్నా.. గత ప్రభుత్వం నాటి 317 జీవో ప్రధానంగా కనిపిస్తోంది. 

మల్టీజోన్‌-1లో పోస్టులు పెరిగినా..

తెలంగాణలో మల్టీజోనల్‌ వ్యవస్థ తెర పైకి రాకముందు హైదరాబాద్, వరంగల్‌ జోన్లు మాత్రమే ఉండేవి. అప్పట్లో హైదరాబాద్‌ జోన్‌లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌లు ఉండడంతో ఎక్కువ పోస్టులుండేవి. దీంతో ఆ జోన్‌లో ఎస్సైలకు త్వరత్వరగా పదోన్నతులు దక్కేవి. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు తెలంగాణలో కొంతకాలం క్రితం మల్టీజోనల్‌ వ్యవస్థ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే పూర్వ వరంగల్‌ జోన్‌ను మల్టీజోన్‌-1గా..పూర్వ హైదరాబాద్‌ను మల్టీజోన్‌-2గా గుర్తించారు. మరోవైపు మల్టీజోన్‌-1లో వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండంలాంటి యూనిట్లు కమిషనరేట్లుగా మారడంతో తొలిసారిగా ఈ జోన్‌లో పోస్టుల సంఖ్య పెరిగింది. కానీ మల్టీజోన్‌-2 (పూర్వ హైదరాబాద్‌ జోన్‌)లోనుంచి సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలు మల్టీజోన్‌-1 (పూర్వ వరంగల్‌ జోన్‌) పరిధిలోకి మారిపోవడంతో పాటు గత ప్రభుత్వం 317 జీవో జారీ చేయడం ఎస్సైల పదోన్నతుల ప్రక్రియలో ఇబ్బందులకు కారణమైంది.


సీనియారిటీ జాబితాలో వెనకబడి..

317 జీవో ఆధారంగా 2023 మేలో స్థానికతను పక్కనపెట్టి సీనియారిటీని పరిగణనలోకి తీసుకొని ఎస్సైల జాబితాను రూపొందించారు. మరోవైపు ఇదే సీనియారిటీ ప్రాతిపదికన మల్టీజోన్‌-2 నుంచి ఏకంగా 66మంది ఎస్సైలు మల్టీజోన్‌-1లోకి మారారు. దీంతో అప్పటికే మల్టీజోన్‌-1లో ఉన్న పలువురు ఎస్సైలు సీనియారిటీ జాబితాలో వెనకబడిపోయారు. ఈ నేపథ్యంలో 2023 జూన్‌లో 30 మంది.. జులైలో మరో 24 మంది ఎస్సైలకు ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతులు దక్కాయి. ఇది పూర్వ వరంగల్‌ జోన్‌కు చెందిన పలువురు ఎస్సైలకు అశనిపాతంలా మారింది. పూర్వ వరంగల్‌ జోన్‌కు చెందిన మొత్తం 146 మంది ఎస్సైల్లో 2021-22 సంవత్సరానికి సంబంధించి పదోన్నతుల ప్యానెల్‌లో 42 మంది సీఐలైపోయారు. తదుపరి ప్యానెల్‌లో పదోన్నతులు దక్కాల్సిన పాత వరంగల్‌ జోన్‌ ఎస్సైలు మాత్రం 317 జీవో కారణంగా సీనియారిటీ జాబితాలో వెనకబడిపోయి ఇప్పటికీ పదోన్నతుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే 317 జీవో కారణంగా అన్యాయానికి గురైన తమకు న్యాయం చేయాలంటూ మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకొని తమ సమస్యను పరిష్కరించాలని విన్నవించుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు