Ts news: శస్త్ర చికిత్స తారుమారు

ప్రసవం కోసం శస్త్రచికిత్స చేయాల్సింది ఒక మహిళకయితే పొట్టకోసింది మరో మహిళకు... ఆమె అప్రమత్తమై అరవడంతో నాలుక్కరుచుకున్న వైద్యులు కుట్లు వేసి పంపించారు. కరీంనగర్‌ మాతాశిశు సంరక్షణ కేంద్రంలో  ఈ ఘటన చోటు చేసుకుంది.

Updated : 22 Jun 2021 14:45 IST

ఒకరికి బదులు మరొకరి పొట్ట కోసిన వైనం
మహిళ అరవడంతో నాలుక్కరుచుకున్న వైద్యులు

కరీంనగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రసవం కోసం శస్త్రచికిత్స చేయాల్సింది ఒక మహిళకయితే పొట్టకోసింది మరో మహిళకు... ఆమె అప్రమత్తమై అరవడంతో నాలుక్కరుచుకున్న వైద్యులు కుట్లు వేసి పంపించారు. కరీంనగర్‌ మాతాశిశు సంరక్షణ కేంద్రంలో  ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి భర్త నరోత్తమరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్‌కు చెందిన మాలతి, నరోత్తమరెడ్డి దంపతులు. మాలతి ఏడు నెలల గర్భవతి. నీరసంగా ఉండటం, కడుపునొప్పి రావడంతో గురువారం కరీంనగర్‌లోని మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి వచ్చారు. శుక్రవారం స్కానింగ్‌ చేశారు. గర్భంలో ఇద్దరు శిశువులు ఉన్నారని గుర్తించారు. అందులో ఒక శిశువు బతికే అవకాశం లేదని, ఇంకొక శిశువును కాపాడేందుకు సోమవారం గర్భసంచికి కుట్లు వేస్తామని వైద్యులు తెలిపారు. సోమవారం ఉదయం మాలతిని ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకువెళ్లారు. అక్కడున్న డాక్టర్‌ వేరొకరి కేస్‌షీట్‌ చదివి మాలతి పొట్ట కోశారు. మాలతి గట్టిగా అరిచి వివరాలు చెప్పడంతో చీరిన పొట్టకు కుట్లు వేసి పంపించారు. మాలతి అప్రమత్తంగా లేకపోతే తల్లీబిడ్డలకు ప్రమాదం జరిగేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని మాలతి భర్త నరోత్తమరెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు వచ్చిందని, విచారణ చేస్తామని ఆర్‌ఎంఓ శౌరయ్య తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని