Rythu Bharosa: అన్ని వర్గాల సూచనల మేరకే ‘రైతు భరోసా’ విధివిధానాలు

అన్నివర్గాల సూచనలు, సలహాలు స్వీకరించి ‘రైతు భరోసా’ పథకం విధివిధానాలు రూపొందిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.

Published : 11 Jul 2024 02:44 IST

శాసనసభలో చర్చించి అమలు చేస్తాం
కార్యశాలలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క
పదెకరాల వరకు అమలు చేయాలని పలువురి నుంచి వినతులు..

ఖమ్మం కలెక్టరేట్‌లో రైతుభరోసాపై నిర్వహించిన కార్యశాలలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క.

చిత్రంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి 

ఈటీవీ, ఖమ్మం: అన్నివర్గాల సూచనలు, సలహాలు స్వీకరించి ‘రైతు భరోసా’ పథకం విధివిధానాలు రూపొందిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలవారీగా కార్యశాలలు ఏర్పాటు చేసి అభిప్రాయాలు సేకరించి శాసనసభలో చర్చించాకే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఖమ్మం కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన కార్యశాలకు మంత్రివర్గ ఉపసంఘం ఛైర్మన్‌ హోదాలో ఆయన, సభ్యులైన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ప్రజల నుంచి పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు వచ్చే ప్రతి పైసాకూ జవాబుదారీగా ఉంటామన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక పెట్టుబడి సాయాన్ని అన్నదాతల ఖాతాల్లో జమ చేసిందని తెలిపారు. ఈ నెలలో జరిగే శాసనసభ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్నామని.. ఈ లోగానే ‘రైతు భరోసా’ విధివిధానాల ఖరారుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైందని వివరించారు.

హాజరైన రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు

భరోసా కల్పించడమే లక్ష్యం: తుమ్మల

వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పంట పండించే ప్రతి రైతుకూ భరోసా కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. గతంలో జరిగిన లోపాలు, ఆర్థిక నష్టం ప్రజల కళ్ల ముందు కనిపిస్తున్నాయని చెప్పారు. అలా కాకుండా.. కష్టపడి పంటలు సాగు చేసే చిన్న, సన్నకారు రైతులకు చేయూతనిచ్చేలా కాంగ్రెస్‌ సర్కారు నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. గత సీజన్‌లో కొంత కష్టమైనా రూ.7,500 కోట్లను రైతులకు పెట్టుబడి సాయంగా అందించామని గుర్తుచేశారు. 

గతంలో 4 గోడల మధ్యే నిర్ణయాలు: పొంగులేటి

రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రజల భాగస్వామ్యం లేకుండానే పథకాలు ప్రవేశపెట్టారని విమర్శించారు. కేవలం నాలుగు గోడల మధ్య నిర్ణయాలు తీసుకుని ప్రజలపై రుద్దారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అలాంటి చర్యలకు తావివ్వదని చెప్పారు.  ‘రైతు భరోసా’పై ఉమ్మడి జిల్లాల్లో అభిప్రాయాలు సేకరించిన తర్వాత శాసనసభలో చర్చిస్తామన్నారు.  

చిన్న రైతులకు సాయం అందించాలి..

సన్న, చిన్నకారు రైతులకు పెట్టుబడి సాయమందించాలని కార్యశాలలో పలువురు అన్నదాతలు కోరారు. కొండలు, గుట్టలు, సాగుకు యోగ్యంకాని, రియల్‌ ఎస్టేట్‌ భూములకు ‘రైతు భరోసా’ అమలు చేయొద్దని.. పంటలు పండించే వారికే పథకం వర్తింపజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరికొంతమంది రైతులు మాట్లాడుతూ.. పదెకరాల వరకు పెట్టుబడి సాయమందేలా చూడాలన్నారు. అనర్హులకు సైతం గత ప్రభుత్వం ‘రైతుబంధు’ అమలుచేసి ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచిందని పలువురు రైతు సంఘాల నేతలు ఆరోపించారు. తమనూ ఆదుకోవాలని కొందరు కౌలు రైతులు ప్రభుత్వానికి విన్నవించారు. కార్యశాలలో ఖమ్మం, మహబూబాబాద్‌ ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాం నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని