TG News: దండిగా పన్నుల ఆదాయం

రాష్ట్రంలో పన్నుల ఆదాయంలో పెరుగుదల నమోదైంది. గతేడాది ఏప్రిల్, మే నెలల్లో పన్నుల ద్వారా రూ.20,097.73 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది అదే సమయంలో రూ.22,419.13 కోట్లు వచ్చినట్లు ‘కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌’ (కాగ్‌) వెల్లడించింది.

Published : 07 Jul 2024 03:14 IST

ఏప్రిల్, మే నెలల్లో రూ.2,321 కోట్ల పెరుగుదల 
ఎన్నికలతో రిజిస్ట్రేషన్లు లేక తగ్గిన ఆదాయం
గతేడాదికన్నా తక్కువ రుణాలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
మే నెల కాగ్‌ నివేదిక వెల్లడి
ఈనాడు, హైదరాబాద్‌

రాష్ట్రంలో పన్నుల ఆదాయంలో పెరుగుదల నమోదైంది. గతేడాది ఏప్రిల్, మే నెలల్లో పన్నుల ద్వారా రూ.20,097.73 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది అదే సమయంలో రూ.22,419.13 కోట్లు వచ్చినట్లు ‘కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌’ (కాగ్‌) వెల్లడించింది. అంటే గతేడాదితో పోలిస్తే ఈ ఆదాయం రూ.2,321 కోట్లు పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన ఆడిట్‌ నివేదికలో కాగ్‌ పలు అంశాలను ప్రస్తావించింది. ఆ వివరాలివీ..  

లోక్‌సభ ఎన్నికల కారణంగా రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు లేక ఈ పద్దులో రూ.169 కోట్ల ఆదాయం తగ్గినట్లు నివేదిక తెలిపింది. కేంద్రం నుంచి గతేడాది ఆ రెండు నెలల్లో రూ.1438 కోట్ల గ్రాంట్లు రాగా.. ఈ ఏడాది ఎన్నికల కారణంగా కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని వెల్లడించింది. 


మద్యం, జీఎస్టీలతో ఆదాయంలో పెరుగుదల

రిజిస్ట్రేషన్లపై ఆదాయం తగ్గినా, కేంద్రం నుంచి గ్రాంట్లు రాకున్నా మొత్తమ్మీద పన్నులపై ఆదాయం రూ.2,321 కోట్లు పెరగడానికి మద్యం, జీఎస్టీలే ప్రధాన కారణం. జీఎస్టీ చెల్లింపుల్లో వ్యాపారుల మోసాలను అరికట్టేందుకు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ కార్యాలయం కఠిన చర్యలు తీసుకోవడం, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ వెనక్కి అడుగుతున్న వ్యాపారులపై నిఘా ఉంచడంతో ఆదాయం గణనీయంగా పెరిగింది. ఎన్నికల కారణంగా మద్యం అమ్మకాలు భారీగా పెరగడంతో పాటు, మద్యంపై  సుంకం, అమ్మకపు పన్ను ఎగవేతలపై ప్రభుత్వం నిఘా పెంచడంతో రూ.1295 కోట్ల ఆదాయం పెరిగింది. 

ప్రభుత్వ అవసరాల కోసం రిజర్వు బ్యాంకు ద్వారా బాండ్లను వేలం వేసి బహిరంగ రుణాలను సేకరించి వీటిని రాష్ట్ర ఆదాయంలో చూపుతారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ద్రవ్యలోటు రూ.7,380 కోట్లుండటంతో దానిని పూడ్చటానికి ఆ రెండు నెలల్లో అంతే సొమ్మును బాండ్ల విక్రయం ద్వారా రుణాలుగా ప్రభుత్వం సేకరించింది.


గతేడాది ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే.. ఈసారి మార్పులు ఇలా..

  • ఏప్రిల్, మే నెలల్లో రూ.28,493.77 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసింది. గతేడాది ఇవే నెలలతో పోలిస్తే వ్యయం రూ.322.52 కోట్లు పెరిగింది. 
  • ఎన్నికల కారణంగా ఈ రెండు నెలల్లో సంక్షేమ రంగంపై వ్యయం రూ.10,516 కోట్ల నుంచి రూ.8,963 కోట్లకు తగ్గింది. 
  • ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులు గతేడాది రూ.6,784.32 కోట్లు ఉండగా.. అదే సమయంలో ఈ ఏడాది రూ.7,572.81 కోట్లకు పెరిగాయి. ఉద్యోగుల పింఛన్ల చెల్లింపులు రూ.2,779.38 కోట్ల నుంచి రూ.2,627.79 కోట్లకు తగ్గాయి. పింఛన్ల చెల్లింపులకు సొమ్ము విడుదల తగ్గినట్లు కాగ్‌ తెలిపింది. 
  • వివిధ సంక్షేమ పథకాలకు రాయితీ పద్దు కింద చెల్లింపులు రూ.1923.86 కోట్ల నుంచి రూ.2,081 కోట్లకు పెరిగాయి.
  • ప్రభుత్వ రుణాలపై వడ్డీ చెల్లింపులు గతేడాది రూ.3,205.45 కోట్లుంటే ఈ ఏడాది రూ.3,729.19 కోట్లకు పెరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని