Mission Bhagiratha: మిషన్‌ భగీరథ సర్వేలో ‘మాస్టర్‌’ సమస్యలు

రాష్ట్రంలో మిషన్‌ భగీరథ పథకానికి కేంద్ర నిధుల సాధన కోసం నిర్వహిస్తున్న సర్వేలో గందరగోళం నెలకొంది. మాస్టర్‌ డేటా సరిగా లేకపోవడంతో పాటు పలు సాంకేతిక అంశాల కారణంగా సమస్యలు తలెత్తుతున్నాయి. సరైన సమాచారం నమోదు కావడం లేదని తెలిసింది.

Published : 23 Jun 2024 05:21 IST

యాప్‌లో నమోదుకు ఇబ్బందులు
సమాచార సేకరణలో జాప్యం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మిషన్‌ భగీరథ పథకానికి కేంద్ర నిధుల సాధన కోసం నిర్వహిస్తున్న సర్వేలో గందరగోళం నెలకొంది. మాస్టర్‌ డేటా సరిగా లేకపోవడంతో పాటు పలు సాంకేతిక అంశాల కారణంగా సమస్యలు తలెత్తుతున్నాయి. సరైన సమాచారం నమోదు కావడం లేదని తెలిసింది. మిషన్‌ భగీరథను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా నిర్వహిస్తుండటంతో ఆర్థికంగా భారం పడుతోంది. దీంతో ఈ పథకానికి కేంద్ర జల్‌శక్తి శాఖ నుంచి రూ.14 వేల కోట్లను సమీకరించేందుకు.. దాని వాస్తవ పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరించి కేంద్రానికి నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఈ నెల 10, 11 తేదీల్లో జిల్లాల్లో సర్వే ప్రారంభమయింది. శిక్షణ పొందిన పంచాయతీ కార్యదర్శులు, సాంకేతిక సహాయకులు, క్షేత్ర సహాయకులు, బహుళవిధ సహాయకులతో సర్వే చేపట్టారు. ప్రతి ఉద్యోగి రోజుకు 20 నుంచి 25 ఇళ్లలో సర్వే నిర్వహించాలి. ఇంటింటికీ వెళ్లి వారికి మిషన్‌ భగీరథ నీరు వస్తుందా.. నల్లా కనెక్షన్‌ ఉందా.. ఎన్ని రోజులకోసారి నీళ్లు వస్తున్నాయి.. లబ్ధిదారుల పేరు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు, మొబైల్‌ నంబరు, ఆధార్‌ సంఖ్య, ఇంటి నంబరు నమోదు చేయాలి. లబ్ధిదారుతో కలిపి ఇంటి ఫొటోను, నల్లా చిత్రాన్ని జతపరచాలి.

రాష్ట్రంలో 2018-19లో మిషన్‌ భగీరథ సిబ్బంది ద్వారా నిర్వహించిన సర్వే సమాచారంతో కూడిన మాస్టర్‌ డేటా ఆధారంగా తాజా సర్వేను చేపట్టారు. దీనికోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. సర్వే ప్రారంభించిన వెంటనే మాస్టర్‌ డేటా సరిగా లేదని ఉద్యోగులు గుర్తించారు. ఆ సమాచారం ఆరేళ్ల కిందటిది కావడంతో అప్పటి, ప్రస్తుత వివరాల్లో తేడాలున్నట్లు ఉద్యోగులు గుర్తించారు. మాస్టర్‌ డేటాలో ఉమ్మడి పంచాయతీలు ఉండగా.. తర్వాత పంచాయతీల విభజన జరిగి కొత్త గ్రామాలు ఏర్పడ్డాయి. వాటి పూర్తి వివరాలు డేటాలో లేవు. సిబ్బంది గ్రామాలకు, తండాలకు వెళ్లినప్పుడు ఉమ్మడి గ్రామాల పరిధిలోని పేర్లు అందులో వచ్చాయి. ఒక ఉద్యోగి 100 మందిపై సర్వే నిర్వహిస్తే అందులో 20 మంది మరో గ్రామంలో ఉన్నారని తేలింది. మొబైల్‌ యాప్‌లో ప్రింట్, డిలీట్, ఎడిట్‌ ఆప్షన్‌ లేకపోవడం వల్ల గ్రామంలో లేనివారిని, వలస వెళ్లినవారిని తొలగించే అవకాశం ఉండటం లేదు. ఒక ఇంటిలో నలుగురు సభ్యులుంటే ఒకరికి బదులు నలుగురికి నల్లా కనెక్షన్‌ ఉన్నట్లు చూపిస్తోంది. ఓటీపీ ద్వారా సమాచారం నమోదవుతుండగా..  సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని