Malaysia Airlines: మృత్యు భయంతో.. మూడు గంటలు

విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా కౌలాలంపూర్‌ వెళ్లే ప్రయాణికులు భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నారు. గంటలకొద్దీ గాల్లోనే చక్కర్లు కొడుతున్న విమానంలో ఏ క్షణం... ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని హాహాకారాలు చేశారు.

Published : 21 Jun 2024 06:13 IST

మలేసియా ఎయిర్‌లైన్స్‌ విమానంలో   సాంకేతిక లోపం
గాల్లోకి లేచిన 15 నిమిషాలకు గుర్తించిన పైలట్‌
వెనక్కి వచ్చినా అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతివ్వని ఏటీసీ
గాల్లోనే 3గంటలపాటు చక్కర్లు కొట్టడంతో ప్రయాణికుల హాహాకారాలు

అత్యవసరంగా దిగిన మలేసియా ఎయిర్‌లైన్స్‌ విమానం

శంషాబాద్, న్యూస్‌టుడే: విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా కౌలాలంపూర్‌ వెళ్లే ప్రయాణికులు భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నారు. గంటలకొద్దీ గాల్లోనే చక్కర్లు కొడుతున్న విమానంలో ఏ క్షణం... ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని హాహాకారాలు చేశారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో గురువారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. విమానాశ్రయ అధికారుల కథనం ప్రకారం.. మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్‌-99 విమాన సర్వీసు బుధవారం అర్ధరాత్రి 12.45 గంటలకు 130 మంది ప్రయాణికులతో కౌలాలంపూర్‌కు బయల్దేరింది. టేకాఫ్‌ అయిన 15 నిమిషాలకు విమానం కుడివైపు ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్టు గుర్తించిన పైలట్‌ శంషాబాద్‌ ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. వారి సూచనతో విమానాన్ని తిరిగి శంషాబాద్‌ విమానాశ్రయం వైపు మళ్లించారు.

ల్యాండింగ్‌ సమయంలో విమానం ఇంజిన్‌ నుంచి ఎగిసిపడుతున్న నిప్పురవ్వలు

విమానం ట్యాంకులో ఇంధనం నిండుగా ఉండటంతో.. వెంటనే కింది దిగితే ప్రమాదం జరుగుతుందని భావించిన ఏటీసీ అధికారులు అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతించలేదు. ఫలితంగా విమానం మూడు గంటలకుపైగా గాలిలోనే చక్కర్లు కొడుతూ ఉండిపోయింది. చివరికి తెల్లవారుజామున 3.58 గంటలకు సురక్షితంగా దిగడంతో ప్రయాణికులు, విమానాశ్రయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ల్యాండింగ్‌ సమయంలో ఇంజిన్‌ నుంచి నిప్పురవ్వలు ఎగిసిపడుతున్న దృశ్యాలను ఓ ప్రయాణికుడు తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరలయ్యాయి. ఈ పరిణామాలతో ఆందోళనకు గురైన విమానంలోని ప్రయాణికుల్లో చాలామంది తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. మిగిలిన వారిని ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులు మరో విమానంలో కౌలాలంపూర్‌కు పంపించినట్లు అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని