Telangana AP CMs meeting: ఆస్తుల విభజన.. బకాయిల ఖరారు

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన జరిగి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా.. ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న ఆస్తుల విభజన, బకాయిల చెల్లింపు అంశాలపై చర్చించడానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారి భేటీ కానున్నారు.

Published : 06 Jul 2024 04:43 IST

9వ షెడ్యూల్‌లో 23, 10వ షెడ్యూల్‌లో 30 సంస్థలపై ఇంతకాలంగా కుదరని ఏకాభిప్రాయం
విద్యుత్తు సంస్థలకు చెల్లించాల్సిన నిధులపైనా వివాదం
ఈ అంశాలపై చర్చించనున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్, చంద్రబాబు
నేడు ప్రజాభవన్‌లో కీలక సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన జరిగి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా.. ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న ఆస్తుల విభజన, బకాయిల చెల్లింపు అంశాలపై చర్చించడానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారి భేటీ కానున్నారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో శనివారం సాయంత్రం 6 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తిచేసింది. ప్రధానంగా షెడ్యూలు-9, షెడ్యూలు-10లలో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశముంది. షెడ్యూలు-9లోని మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలా భిడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై ఇరురాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పదో షెడ్యూలులోని 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేడ్కర్‌ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. విద్యుత్తు సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశముంది. ఏపీ ప్రభుత్వం దాదాపు రూ.24 వేల కోట్లు తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. కానీ రూ.7 వేల కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ చెబుతోంది. తాను బాధ్యతలు చేపట్టాక విభజనకు సంబంధించిన పెండింగ్‌ అంశాలపై సీఎం ఎ.రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అపరిష్కృతంగా ఉన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మార్చిలో సీఎం చొరవతో దిల్లీలో ఏపీభవన్‌కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవల మైనింగ్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన నిధుల పంపిణీ చిక్కుముడి వీడింది. ఇప్పటివరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. విభజన అంశాలపై చర్చిద్దామంటూ.. తెలంగాణ ముఖ్యమంత్రికి ఏపీ సీఎం లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రేవంత్‌.. జ్యోతిరావు ఫులే ప్రజాభవన్‌లో నిర్వహించే చర్చల్లో పాల్గొనాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆర్థికశాఖ కార్యదర్శులు పాల్గొనే అవకాశం ఉంది. జలవనరుల పంపిణీ, ఉద్యోగుల విభజన అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. 

ఇప్పటికే కొలిక్కి వచ్చినవి..

దిల్లీలోని ఏపీభవన్, పటోడి హౌస్, నర్సింగ్‌ హాస్టల్‌కు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య విభజన చేస్తూ ఈ ఏడాది మార్చి 15న కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకొంది. దీనికి ఇరురాష్ట్రాలూ అంగీకరించాయి. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించిన హైదరాబాద్‌లో సెక్రటేరియట్, అసెంబ్లీతో సహా పలు భవనాలు రెండు రాష్ట్రాలు వినియోగించుకొనేలా విభజన జరిగింది. ఇందులో సెక్రటేరియట్, బి.ఆర్‌.కె.ఆర్‌ భవన్, ఎర్రమంజిల్‌లోని నీటిపారుదల, రోడ్లు-భవనాలు, గ్రామీణ నీటిసరఫరా విభాగం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ కార్యాలయాలు, అరణ్యభవన్, అసెంబ్లీ, కౌన్సిల్‌ భవనాలు, ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించి ఖాళీగా ఉన్న మంత్రుల గృహాలను 2019లోనే ఆ ప్రభుత్వం తెలంగాణకు అప్పగించింది. ఏపీకి కేటాయించిన మిగిలిన భవనాల్లో మూడు మినహా అన్నీ అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గతంలోనే తెలంగాణ సీఎస్‌కు లేఖ రాశారు. లేక్‌వ్యూ అతిథిగృహం, హెరిటేజ్‌ కార్యాలయం, సీఐడీ హెడ్‌ క్వార్టర్స్‌ మినహా మిగిలినవి అప్పగించాలని ఆయా విభాగాల శాఖాధిపతులకు ఈ ఏడాది జనవరిలో ఆదేశాలు జారీ చేశారు. 

వీటిపై చర్చే కీలకం 

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని షెడ్యూలు-9లోని మొత్తం ఆస్తుల విలువలో రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరిన సంస్థల వాటా కేవలం 0.7 శాతం మాత్రమేనని, మిగిలిన సంస్థలే కీలకమని, అన్నింటినీ కలిపి జనాభా నిష్పత్తిలో పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ కోరుతోంది. దీనికి తెలంగాణ అంగీకరించడం లేదు. ఎక్కడున్న సంస్థలు వారివే అని.. ఇలా కాకుంటే చట్టానికి మార్పు చేయాల్సి ఉంటుందని పేర్కొంటోంది. మొదట అంగీకారం కుదిరిన సంస్థల పంపిణీపై తేల్చి.. మిగిలిన వాటిపైన మళ్లీ చర్చిస్తే సరిపోతుందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ సూచించినట్లు తెలిసింది. షెడ్యూలు-10లో 142 సంస్థలుండగా, ఇందులో ఎక్కువ భాగం శిక్షణకు సంబంధించినవి. వీటి విలువను రూ.38 వేల కోట్లుగా అంచనా వేసినట్లు సమాచారం. ఏపీ ఉన్నత విద్యా మండలి ఆస్తుల పంపిణీ అంశం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా అమలు కాలేదు. షీలా భిడే కమిటీ అన్ని సంస్థలకూ ఒకే పద్ధతిని అనుసరించలేదని తెలంగాణ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. షెడ్యూలు-9, షెడ్యూలు-10లో పేర్కొనని సుమారు రూ.1,759 కోట్ల విలువైన మరో 12 సంస్థలు ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. ఇందులో హైదరాబాద్‌ అగ్రికల్చరల్‌ కో ఆపరేటివ్‌ ఫెడరేషన్‌(హాకా), హౌస్‌ఫెడ్, వైద్య విధాన పరిషత్, లేబర్‌ వెల్ఫేర్‌ బోర్డు, ఏవియేషన్‌ అకాడమీ, డైరెక్టర్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ తదితరాలున్నాయి. మొత్తమ్మీద పదేళ్లయినా పునర్విభజన చట్టంలోని షెడ్యూలు-9, 10లలో ఉన్న సంస్థల విభజన అంశం ఇప్పటివరకూ (కొలిక్కి రాలేదు. శనివారం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్న నేపథ్యంలో.. వీటిపై ఎలాంటి పురోగతి ఉంటుందో వేచిచూడాలి.


తెలంగాణ లేవనెత్తే అంశాలు 

1. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణలో చేర్చాలి. 

2. ఆంధ్రప్రదేశ్‌కు 1000 కి.మీ. మేర విస్తారమైన తీరప్రాంతం(కోస్టల్‌ కారిడార్‌) ఉంది. తెలంగాణకు ఈ తీరప్రాంతంలో భాగం కావాలి. 

3. తెలుగు ప్రజల ఆరాధ్యదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి. తెలంగాణకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)లో భాగం ఇవ్వాలి. 

4. కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్‌మెంట్‌ ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలి. అదేవిధంగా తెలంగాణకు 558 టీఎంసీల నీటిని కేటాయించాలి. 

5. తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు, ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ సంస్థలు రూ.24 వేల కోట్ల బకాయిలను సత్వరమే చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించాల్సినవి ఉంటే.. వాటిని చెల్లిస్తాం. 

6. తెలంగాణకు ఓడరేవులు లేవు. విభజనలో భాగంగా ఏపీలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో భాగం కావాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని