sheep Distribution scam: గొర్రెల పంపిణీపై వివరాలు ఇవ్వండి

గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద విచారణ చేపట్టిన కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ నిర్ణయించింది.

Published : 15 Jun 2024 06:10 IST

కలెక్టర్లకు సమాఖ్య లేఖ
ఈడీ కోరిన సమాచారం ఇచ్చేందుకు అనుమతిచ్చిన ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద విచారణ చేపట్టిన కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈడీ కోరిన సమాచారం వెంటనే పంపించాలని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య అన్ని జిల్లాల కలెక్టర్లకు శుక్రవారం లేఖ రాసింది. పశుసంవర్ధక శాఖ ముఖ్యకార్యదర్శి, ఇన్‌ఛార్జి సంచాలకుడు సబ్యసాచిఘోష్‌ను సచివాలయంలో శుక్రవారం సమాఖ్య ఇన్‌ఛార్జి ఎండీ సుబ్బరాయుడు కలిశారు. ఈడీ కోరిన వివరాలు రాష్ట్ర కార్యాలయంలో అందుబాటులో లేవని, జిల్లా కలెక్టర్ల వద్ద ఉన్నాయని ముఖ్యకార్యదర్శికి ఎండీ తెలిపారు. దీంతో అక్కడి నుంచి సమాచారం సేకరించి ఈడీకి ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ముఖ్యకార్యదర్శి ఆదేశాల మేరకు సుబ్బరాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు. 2017 నుంచి 2024 వరకు పథకానికి సంబంధించిన సమస్త సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ పథకంలో జరిగిన అవినీతిపై అంతర్గత నివేదికలతో కూడిన సమాచారం కూడా పంపించాలని సూచించారు. జిల్లాల నుంచి సమాచారం వచ్చాక సమాఖ్య ఎండీ కార్యాలయంలో వాటిని క్రోడీకరించి.. రాష్ట్ర ప్రభుత్వానికి, ఈడీకి సమగ్ర నివేదిక పంపించనున్నారు. శుక్రవారం ఈడీ అధికారులు విచారణ కోసం ఎండీ కార్యాలయానికి వస్తారన్న ప్రచారంతో అక్కడ హడావిడి ఏర్పడింది. మీడియా ప్రతినిధులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. కానీ ఈడీ అధికారులెవరూ ఆ కార్యాలయానికి రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని