Telangana Budget 2022: ఆరోగ్యమస్తు!

వైద్య ఆరోగ్యశాఖకు తాజా బడ్జెట్‌(2022-23)లో ప్రభుత్వం పెద్దపీట వేసింది. రూ. 11,237.33 కోట్లు కేటాయించింది. ప్రగతి పద్దును పరిశీలిస్తే.. గతేడాది కంటే మూడింతలు అధికంగా నిధులు పెరగడం విశేషం. ప్రగతి పద్దులో 2021-22లో ఆరోగ్యశాఖకు రూ.1,933.30 కోట్లు కేటాయించగా.

Updated : 08 Mar 2022 05:27 IST

వైద్యఆరోగ్యశాఖకు రెట్టింపు నిధులు

కొత్త కళాశాలలకు రూ.1000 కోట్లు

కేసీఆర్‌ కిట్‌కు రూ.443 కోట్లు..

ఈనాడు - హైదరాబాద్‌

వైద్య ఆరోగ్యశాఖకు తాజా బడ్జెట్‌(2022-23)లో ప్రభుత్వం పెద్దపీట వేసింది. రూ. 11,237.33 కోట్లు కేటాయించింది. ప్రగతి పద్దును పరిశీలిస్తే.. గతేడాది కంటే మూడింతలు అధికంగా నిధులు పెరగడం విశేషం. ప్రగతి పద్దులో 2021-22లో ఆరోగ్యశాఖకు రూ.1,933.30 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది ఏకంగా రూ.5,743.02 కోట్లకు పెంచింది. మొత్తం బడ్జెట్‌ కేటాయింపుల్లో పరిశీలిస్తే.. గత బడ్జెట్‌లో వైద్యశాఖకు 3.3 శాతం నిధులుండగా.. ఈ ఏడాది ఒక శాతం పెరిగి 4.3 శాతానికి చేరడం ఆహ్వానించదగిన పరిణామమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ప్రభుత్వ వైద్యంలో మౌలిక సదుపాయాల కల్పనకు సర్కార్‌ ప్రాధాన్యమిచ్చింది. రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పనున్న వైద్యకళాశాలల కోసం రూ.1000 కోట్లను కేటాయించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు బలవర్థకమైన ఆహారాన్ని అందించేందుకు ప్రస్తుతమిస్తున్న ఛార్జీలను ఏకంగా రెట్టింపు స్థాయిలో పెంచింది. కేసీఆర్‌ కిట్‌కు రూ.443 కోట్లు, ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, పింఛనుదారుల ఆరోగ్య పథకాలకు రూ.1,343 కోట్ల చొప్పున అవసరాలకు తగ్గట్లుగా కేటాయింపులు జరిపింది.

* హైదరాబాద్‌కు నలువైపులా గచ్చిబౌలి, ఎల్బీనగర్‌, అల్వాల్‌, ఎర్రగడ్డల్లో ఏర్పాటు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల కోసం రూ.1000 కోట్లు.

* నిమ్స్‌లో అదనంగా మరో 2వేల పడకలను ఏర్పాటు చేయనుంది. దీంతో ఇక్కడ మొత్తం పడకల సంఖ్య 3,489కి పెరుగుతాయి.

* వరంగల్‌లో 24 అంతస్తులతో నెలకొల్పనున్న 2వేల పడకల ఆసుపత్రిలో 35 సూపర్‌ స్పెషాలిటీ, స్పెషాలిటీ విభాగాలు అందుబాటులోకి వస్తాయి.

* ఈ సంవత్సరం ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, వికారాబాద్‌, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో ప్రభుత్వ వైద్యకళాశాలలను మంజూరు చేయనుండగా.. 2023లో మెదక్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, ములుగు, వరంగల్‌, నారాయణపేట, గద్వాల, యాదాద్రి భువనగిరి జిల్లాలకు మంజూరుచేయనుంది.

* జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న 256 బస్తీ దవాఖానాల సంఖ్య 350కి పెంపు. రాష్ట్రవ్యాప్తంగా పురపాలికల్లోనూ మరో 60 బస్తీ దవాఖానాల ఏర్పాటు.

2021-22 రూ. 5,816.52 కోట్లు

2022-23 రూ. 11,237.33 కోట్లు


ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షలకు పెంపు

ఆరోగ్యశ్రీ చికిత్సలో భాగంగా ప్రస్తుతం ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల వరకూ గరిష్ఠ పరిమితి ఉంది. దీన్ని రూ.5 లక్షలకు పెంచింది. గుండె, కాలేయం, బోన్‌ మ్యార్‌ తదితర అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకూ చెల్లిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 22 మాతాశిశు సంరక్షణ కేంద్రాలను రూ.407 కోట్లతో నెలకొల్పింది. రాష్ట్రంలో 300 అమ్మఒడి వాహనాల ద్వారా గర్భిణులకు సేవలందిస్తోంది.


ఆహార ఛార్జీల పెంపు

* ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్షయ, క్యాన్సర్‌ తదితర రోగులకు బలవర్థక ఆహారం అందించేందుకు ఆహార ఛార్జీలను ఒక్కో పడకకు రూ.56 నుంచి రూ.112కు పెంచింది.

* సాధారణ రోగులకు ఒక్కో పడకకు రూ.40 నుంచి రూ.80కి పెంపు.

* ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య ప్రమాణాల మెరుగు, కార్మికులకు వేతనాలు పెంపునకు ఒక్కో పడకకు రూ.5వేల నుంచి రూ.7500కు పెంపు. ఇందుకు రూ.338 కోట్లను ఖర్చుచేస్తుంది.

* 61 శవాగారాల ఆధునికీకరణకు రూ.32.50 కోట్లు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని