Telangana Budget 2022: బడ్జెట్‌లో ప్రధాన రంగాలకు కేటాయింపులు ఇలా..

ఇంధనశాఖకు మొత్తం బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.12,198 కోట్లు కేటాయించింది. ఇందులో వ్యవసాయానికి, ఇతర వర్గాలకు ఉచితంగా లేదా తక్కువ ఛార్జీలకు కరెంటు సరఫరా కోసం రాయితీ కింద ‘విద్యుత్‌ పంపిణీ సంస్థ’(డిస్కం)లకు రూ.10,500 కోట్లను ఇవ్వనుంది.

Updated : 08 Mar 2022 05:26 IST

కరెంటు రాయితీకి రూ.10,500 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంధనశాఖకు మొత్తం బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.12,198 కోట్లు కేటాయించింది. ఇందులో వ్యవసాయానికి, ఇతర వర్గాలకు ఉచితంగా లేదా తక్కువ ఛార్జీలకు కరెంటు సరఫరా కోసం రాయితీ కింద ‘విద్యుత్‌ పంపిణీ సంస్థ’(డిస్కం)లకు రూ.10,500 కోట్లను ఇవ్వనుంది. 2021-22లో రాయితీ కింద రూ.10,625 కోట్లు ఇవ్వగా.. వచ్చే ఆర్థిక సంవత్సరం(2022-23)లో రూ.125 కోట్లు తగ్గించింది. విద్యుత్‌ కేంద్రాలు, పంపిణీ, సరఫరా వ్యవస్థల నిర్మాణాలకు గతంలో జాతీయ విద్యుత్‌ ఆర్థిక సంస్థ(పీఎఫ్‌సీ), గ్రామీణ విద్యుదీకరణ సంస్థల నుంచి రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు రుణాలు తీసుకున్నాయి. ఈ బకాయిల కిస్తీ చెల్లింపులకు బడ్జెట్‌లో రూ.1,574 కోట్లు కేటాయించింది. రాయితీ పద్దు కింద రూ.10,928 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని డిస్కంలు గతంలో అంచనా వేశాయి. బడ్జెట్‌లో రూ.10,500 కోట్లే కేటాయించడంతో ప్రభుత్వాన్ని మళ్లీ అడిగే అవకాశం ఉంది. ఏటా బడ్జెట్‌ కేటాయింపులను మించి ప్రభుత్వం అదనంగా సర్దుబాటు చేస్తోంది. ఈ సారీ అలాగే జరిగే అవకాశముందని విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు.


పల్లె ప్రగతికి రూ.3,330 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలకు కలిపి బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.29,271 కోట్లు కేటాయించింది. పల్లెప్రగతి కోసం రూ.3,330 కోట్లు ఇచ్చింది. మండల పరిషత్‌లకు రూ.500 కోట్ల గ్రాంట్లు, గ్రామపంచాయతీలకు నెలకు రూ.227.50 కోట్లు చొప్పున ఇచ్చేలా నిధులు పేర్కొంది. పంచాయతీలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి రూ.1,054.07 కోట్లు ఇచ్చింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల బడ్జెట్‌లో అత్యధికంగా ఆసరా పింఛన్ల కోసం ప్రభుత్వం రూ.11,728 కోట్లు కేటాయించింది. 

* గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలోని స్వయం సహాయక బృందాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు కేటాయించే నిధుల్ని తగ్గించింది. 2021-22లో రూ.2,500 కోట్లు కేటాయించగా, వచ్చే ఏడాదికి రూ.1,250 కోట్లకు పరిమితం చేసింది.

* ఉపాధి హామీ పథకానికి రూ.1,460 కోట్లు కేటాయించింది. ‘పీఎంకేఎస్‌వై’కి రూ.100 కోట్లు ఇచ్చింది. రూర్బన్‌ పథకానికి రూ.10 కోట్లు ఇవ్వగా, గ్రామీణ జీవనోపాధి మిషన్‌కు రూ.210 కోట్లు పేర్కొంది.  దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజనకు రూ.150 కోట్లు వచ్చింది. స్వచ్ఛభారత్‌ గ్రామీణ మిషన్‌కు రూ.350 కోట్లు పేర్కొంది.


పురపాలనకు రూ.10,590 కోట్లు

రాష్ట్రంలో నగరాలు, పట్టణాలకు గత ఏడాదితో పోల్చితే తాజా బడ్జెట్‌లో రూ.1,276 కోట్ల మేర నిధులు తగ్గాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.10,590.91 కోట్లు కేటాయించారు. మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు ప్రత్యేక సాయాన్ని తగ్గించారు. మున్సిపాలిటీల్లో వడ్డీలేని రుణాల కోసం రూ.375 కోట్లు ఇచ్చారు. ఆర్థిక సంఘం నిధుల కింద రూ.750 కోట్లు పేర్కొన్నారు. హెచ్‌ఎండీఏకు రూ.200 కోట్లు, జలమండలి పరిధిలో ఉచిత తాగునీటి పథకానికి రూ.300 కోట్లు ప్రతిపాదించారు.


ఆర్టీసీకి రూ.1500 కోట్లు

ఆర్టీసీకి బడ్జెట్‌లో భారీ ఉపశమనం లభిస్తుందని సంస్థ వర్గాలు భావించినప్పటికీ ఆ మేరకు ఊరట లభించలేదు. 2022-23కు సంబంధించి ప్రభుత్వం రూ.1500 కోట్లను కేటాయించింది. బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఆశించినప్పటికీ అలా జరగలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ రూ.1,500 కోట్లు కేటాయించగా.. ఫిబ్రవరి వరకు రూ.1,125 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మరో రూ.1,500 కోట్లు పూచీకత్తుపై రుణంగా తీసుకునేందుకు అవకాశం కల్పించింది. కానీ, తాజా బడ్జెట్‌లో ‘పూచీకత్తు’ వెసులుబాటు కూడా లేదు.


గీత కార్మికులకు రూ.100 కోట్లు

గీత కార్మికుల సంక్షేమానికి గతంలో లేని రీతిలో తాజా బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో త్వరలో ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ సమావేశంలో ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకొంది. తాటిచెట్ల పైనుంచి పడి మరణించిన లేదా అంగవైకల్యం పొందిన గీత కార్మికుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు ఈ నిధులు కేటాయిస్తారా? మరేదైనా కొత్త పథకం అమలు చేస్తారా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.


ఐటీ శాఖకు రూ.360 కోట్లు

ఐటీ శాఖకు 2022-23 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.360 కోట్లు కేటాయించింది. గత ఏడాదితో పోల్చితే నిధుల్లో పెరుగుదల లేదు. ఐటీ మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.150 కోట్లు ఇచ్చింది. నైపుణ్య శిక్షణ కోసం టాస్క్‌కు రూ.16 కోట్లు, సాఫ్ట్‌నెట్‌కు రూ.18.5 కోట్లు కేటాయించింది. విహబ్‌కు రూ.7 కోట్లు ఇచ్చింది. టీఫైబర్‌ ప్రాజెక్టు నిర్వహణ కోసం నిధుల్ని రూ.7 కోట్లకు పరిమితం చేసింది. టీ-హబ్‌ ఫౌండేషన్‌కు రూ.2 కోట్లు చూపించింది.

పచ్చదనానికి పెరిగిన నిధులు

అటవీశాఖకు రూ.1,410.34 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం రూ.1,271.92 కోట్లతో పోలిస్తే ఈసారి రూ.138.42 కోట్ల నిధులు పెరిగాయి. రూ.130.22 కోట్లు ప్రగతి పద్దు కాగా, రూ.1,280.12 కోట్లు నిర్వహణ పద్దు కింద చూపారు. హరితహారం, అగ్నిప్రమాదాల నివారణ, అటవీకరణ, అటవీ విశ్వవిద్యాలయం వంటి వాటికి నిధులు ఇందులో ఉన్నాయి. అత్యధికంగా హరితహారానికి రూ.932 కోట్లు ప్రతిపాదించారు. అటవీశాఖ రూ.1,352.92 కోట్ల ప్రతిపాదనలు పంపితే రూ.57.42 కోట్లు అదనంగా కేటాయించారు.


విపత్తు నిర్వహణకు విత్తం పెంపు

రాష్ట్ర విపత్తు నిర్వహణ అగ్నిమాపక శాఖకు గత బడ్జెట్‌ కంటే ఎక్కువగా కేటాయించారు. ఈ బడ్జెట్‌లో రూ.16.12 కోట్లు (క్రితంసారి రూ.7.5 కోట్లు) ఇచ్చారు. కొత్త ఫైర్‌ స్టేషన్ల నిర్మాణాలు, శకటాల కొనుగోలుకు రూ.2 కోట్ల చొప్పున ఇచ్చారు. అయితే రూ.కోట్ల విలువైన అత్యాధునిక శకటాలు కొనుగోలు చేయాలని భావించిన ఆ శాఖకు ఈసారీ నిరీక్షణ తప్పేలా లేదు.
* జైళ్ల శాఖకు గతేడాది (రూ.18.51 కోట్లు) కంటే ఈసారి కేటాయింపులు స్వల్పంగా (రూ.18.13 కోట్లు) తగ్గాయి.


పర్యాటక, సాంస్కృతిక శాఖలకు రూ.1,026.41 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర బడ్జెట్‌లో పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన శాఖలకు కలిపి ఈసారి రూ.1,026.41 కోట్లు కేటాయించింది. గతేడాది రూ.726 కోట్లతో పోలిస్తే ఈసారి కేటాయింపులు రూ.మూడొందల కోట్లు అధికం. కాళేశ్వరం సర్క్యూట్‌ టూరిజం అభివృద్ధికి రూ.1,500 కోట్లు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రకటించారు. తాజా బడ్జెట్‌లో పర్యాటకశాఖకు కేటాయించిన రూ.760 కోట్ల నిధుల్లో రూ.750 కోట్లు ‘కాళేశ్వరం’కే కేటాయించారు.


బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.177 కోట్లు

బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.177 కోట్లు కేటాయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ధూప దీప నైవేద్యం పథకం కింద మరో 1,736 ఆలయాలను చేర్చనుంది. అర్చకులు, ఇతర సిబ్బందికి ప్రతి నెలా నిర్దేశిత తేదీలోగా జీతాలు చెల్లించేందుకు రూ.138 కోట్లు గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌ రూపంలో అందజేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని