Crop Loan Waiver Scheme: ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ

గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో విడతల వారీగా రెండుసార్లు రుణమాఫీ కోసం రూ.28 వేల కోట్లు ఖర్చు చేయగా.. కాంగ్రెస్‌ సర్కారు ఏకధాటిగా రుణమాఫీ చేసేందుకు రూ.31 వేల కోట్లు ఖర్చు చేయనుంది.

Updated : 22 Jun 2024 07:08 IST

2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9 వరకు కటాఫ్‌
ఆగస్టు 15 లోగా చెల్లింపుల ప్రక్రియ పూర్తికి ఏర్పాట్లు
రూ.31 వేల కోట్లు వెచ్చించనున్న రాష్ట్ర ప్రభుత్వం
రైతు భరోసా విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం
అందరితో చర్చించి జులై 15 లోగా నివేదిక
మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించిన సీఎం రేవంత్‌రెడ్డి

గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో విడతల వారీగా రెండుసార్లు రుణమాఫీ కోసం రూ.28 వేల కోట్లు ఖర్చు చేయగా.. కాంగ్రెస్‌ సర్కారు ఏకధాటిగా రుణమాఫీ చేసేందుకు రూ.31 వేల కోట్లు ఖర్చు చేయనుంది. పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు.. రుణమాఫీ అమలును మంత్రిమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది.

సీఎం రేవంత్‌రెడ్డి


ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రైతులందరికీ గడువులోగా ఏక కాలంలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9 వరకు ఐదేళ్ల కాలంలో రైతులు తీసుకున్న రూ.2 లక్షల లోపు రుణాలన్నీ మాఫీ చేయనున్నట్లు తెలిపారు. గతంలోనే ప్రకటించినట్లుగా ఆగస్టు 15వ తేదీ లోగానే రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని స్పష్టం చేశారు. సచివాలయంలో శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రైతు రుణమాఫీ, రైతుభరోసాపై మంత్రిమండలి సమావేశం జరిగింది. రుణమాఫీ విధివిధానాలను పూర్తిస్థాయిలో చర్చించిన తరువాత మంత్రివర్గం ఆమోదించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయి. రైతుభరోసా విధివిధానాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఈ కమిటీ రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు, ప్రతిపక్షాలు తదితరులతో చర్చించి జులై 15 నాటికి నివేదిక ఇవ్వనుంది. మంత్రిమండలి సమావేశం వివరాలను సీఎం రేవంత్‌రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర్‌ రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, విప్‌ ఆది శ్రీనివాస్‌ తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే..

మాట ఇస్తే మడమతిప్పం

‘ఆరు నెలల్లో మేం వంద రోజుల పరిపాలనే చేశాం. దాదాపు రెండున్నర నెలలు ఎన్నికల కోడ్‌లో పోయింది. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు మీ ముందుకు వచ్చాం. 2022 మే 6న వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌ను రాహుల్‌గాంధీ ప్రకటించారు. ఈ డిక్లరేషన్‌పై విధానపరమైన నిర్ణయాలు తీసుకుని.. రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయం దండగ కాదు.. పండగ చేయాలన్న లక్ష్యంతో రైతు రుణమాఫీ అమలు చేస్తున్నాం. సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ మాట ఇస్తే మడమ తిప్పని నాయకులు. 2004లో కరీంనగర్‌ గడ్డ సాక్షిగా.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని హామీ ఇచ్చిన సోనియాగాంధీ.. రాజకీయ సంక్షోభం, పార్టీ విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నా.. ఆ మాట నిలబెట్టుకున్నారు. సోనియాగాంధీ ఏమైనా చెబితే.. అది శిలాశాసనమే. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొని నిలబడతారు. అలాంటి నాయకత్వం నుంచి వచ్చిన రాహల్‌ గాంధీ ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయడానికి  సిద్ధమవుతున్నాం. 

విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర్‌ రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క

గత ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలకు కారణమైంది

గత ప్రభుత్వం రెండుసార్లు రుణమాఫీ చేసింది. తొలిసారి 2014 మార్చి 31ని కటాఫ్‌గా తీసుకుని రూ.16 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసింది. రెండోసారి 2018 డిసెంబరు 11ని కటాఫ్‌గా తీసుకుని రైతుల ఖాతాల్లో వేసిన నిధులు రూ.12 వేల కోట్లు. గత పదేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం రెండుసార్లు రుణమాఫీ కోసం చెల్లించిన నిధులు రూ.28 వేల కోట్లు. గత ప్రభుత్వం 2018 డిసెంబరు 11 కటాఫ్‌గా తీసుకుంటే.. మా సర్కారు 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9 వరకు కటాఫ్‌గా తీసుకుంది. ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో రైతులు తీసుకున్న రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం దాదాపు రూ.31 వేల కోట్లు అవసరం. గత ప్రభుత్వం నాలుగు విడతల్లో చేస్తామని, వడ్డీ చెల్లిస్తామని, నిర్ణయాలను వాయిదా వేస్తూ.. రైతులను సంక్షోభంలోకి నెట్టి.. వారి ఆత్మహత్యలకు కారణమైంది. 

రైతు భరోసా విధివిధానాలపై ఉపసంఘం 

గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధుపై ఎన్నో ఆరోపణలున్నాయి. జాతీయ రహదారులుగా మారిపోయిన భూములకు, అపర కుబేరులకు.. చివరకు గజ్వేల్‌లో కేసీఆర్‌ భూములకు కూడా రైతుబంధు నిధులిచ్చారన్న విమర్శలున్నాయి. మేం నాలుగు గోడల మధ్య నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం లేదు. అందరితో చర్చించి.. సూచనలు, సలహాలు తీసుకుని రైతు భరోసా పథకాన్ని పారదర్శకంగా అర్హులకు అందేలా అమలు చేస్తాం. రైతులు, రైతుకూలీ సంఘాలు, ప్రజా సంఘాలతో చర్చించి.. విధివిధానాలను రూపొందించేందుకు ఆర్థికశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాం. ఇందులో తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ జులై 15లోగా నివేదిక ఇస్తుంది. దాన్ని బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టి, అర్హులైన వారికి అమలు చేస్తాం. 

శ్రీధర్‌బాబు, పొంగులేటి ఇచ్చిన సమాచారమే అధికారికం

కొన్ని పత్రికలు, టీవీలు, రాజకీయపార్టీల సొంత మీడియా సంస్థలు ప్రభుత్వ పరిపాలనపై చర్చల పేరిట రాద్ధాంతాలు చేస్తున్నాయి. ప్రభుత్వం మీద అపోహలు కల్పించేందుకు లేని విషయాలను ప్రశ్నల రూపంలో అడిగి, ఏదో సమాధానం తీసుకుని.. దానికి ప్రచారం కల్పించి సర్కారు ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వం తరఫున మీడియాకు సమాచారం ఇచ్చే బాధ్యతలను శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకుంటారు. ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు, వివరాలపై వారిద్దరూ చెప్పేదే అధికారిక సమాచారం. రాజకీయాలకు సంబంధించిన విషయాలపై అందరూ మాట్లాడతారు. కానీ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి వీరిద్దరే స్పందిస్తారు. వివిధ శాఖల సమాచారం, వివరాలను ఆయా శాఖల మంత్రులు యథావిధిగా తెలియజేస్తారు’’ అని సీఎం రేవంత్‌ వివరించారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి తీరుతామని, విధివిధానాలు, నిధుల సేకరణ తదితర అంశాలపై సమాచారం కావాలంటే ఆర్థిక మంత్రిని సంప్రదించాలని, మార్గదర్శకాలపై త్వరలోనే జీవో ఇస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా సీఎం చెప్పారు. 

తుమ్మల ధన్యవాదాలు

రైతు రుణమాఫీపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వాగ్దానాలు అమలు చేస్తున్న ప్రభుత్వానికి, మంత్రిమండలికి రైతుల పక్షాన ఆయన ధన్యవాదాలు చెప్పారు.


రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
నా జీవితంలో ఈ రోజు చరిత్రాత్మకం: సీఎం

ఈనాడు, హైదరాబాద్‌: రుణమాఫీపై రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌’లో తెలిపారు. ‘నా జీవితంలో ఈ రోజు చరిత్రాత్మకం. 2022 మే 6న వరంగల్‌ వేదికగా లక్షలాది మంది తెలంగాణ రైతులకు రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ.. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ. నా సారథ్యంలో మంత్రివర్గం ఆ మాటను నిలబెట్టుకుంది. ఏకకాలంలో రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది’ అని ఆయన పేర్కొన్నారు.


మూడు, నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు 

రైతు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు మూడు, నాలుగు రోజుల్లో వెల్లడి కానున్నట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడడానికి కొంత సమయం పడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎలాంటి సందిగ్ధత లేకుండా స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని అధికారులకు మంత్రివర్గం స్పష్టం చేసినట్లు తెలిసింది. శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో కేవలం రుణమాఫీ, రైతు భరోసా గురించి మాత్రమే చర్చించినట్లు సమాచారం. ఈ రెండూ అత్యంత ప్రాధాన్యమైనవి, మొత్తం రైతాంగానికి సంబంధించినవి కాబట్టి ఇతర అంశాలేవీ ఎజెండాలో లేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. పీఎం కిసాన్‌ యోజన  మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని రుణమాఫీని అమలు చేయనున్నారు. అయితే అందులో ఉన్న మార్గదర్శకాలు పూర్తిగా కాకుండా, ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం కలిగేలా రాష్ట్రంలో రుణమాఫీ అమలుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మార్గదర్శకాలు సోమవారం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని