Telangana Cabinet: త్వరలో మంత్రివర్గ విస్తరణ!

లోక్‌సభ ఎన్నికలు ముగిసి పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు తెలిసింది. దీనిపై ఏఐసీసీ ముఖ్య నాయకులతో ఇప్పటికే చర్చించినట్లు సమాచారం.

Updated : 20 Jun 2024 07:09 IST

నలుగురికి చోటుదక్కే అవకాశం
మరో 2 స్థానాలపై తర్వాత నిర్ణయం
ఇప్పటికే అధిష్ఠానంతో చర్చించిన సీఎం రేవంత్‌రెడ్డి!

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలు ముగిసి పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు తెలిసింది. దీనిపై ఏఐసీసీ ముఖ్య నాయకులతో ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. ఈ నెలాఖరుకు లేదంటే జులై మొదటి వారంలో విస్తరణ ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కాకుండా మరో 11 మంది మంత్రివర్గంలో ఉన్నారు. సీనియర్‌ నాయకులు, ముఖ్యులు, శాసనసభ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారికిచ్చిన హామీలను పరిగణనలోకి తీసుకోవడంతో కొన్ని జిల్లాలకు ఎక్కువ ప్రాతినిధ్యం దక్కగా, కొన్ని జిల్లాలకు అసలు చోటే లభించలేదు. మరోవైపు భారాస నుంచి ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు వచ్చి చేరగా, మరికొందరు చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా మరో ఆరుగురిని కొత్తగా మంత్రివర్గంలోకి చేర్చుకోవచ్చు. ప్రస్తుతం నలుగురికి అవకాశం ఉండొచ్చని విశ్వసనీయవర్గాల సమాచారం. 

  • లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముదిరాజ్‌లకు ప్రాతినిధ్యం కల్పించేందుకు మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని మంత్రిగా చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. విస్తరణలో శ్రీహరికి ఎక్కువ అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 
  • గతంలో కాంగ్రెస్‌లో ఉండి తర్వాత భాజపాలో చేరి... ఎన్నికలకు ముందు మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చి ఎమ్మెల్యేలుగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, గడ్డం వివేక్‌ల పేర్లు సైతం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రివర్గంలో ఉన్నా... రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేటప్పుడు ఇచ్చిన హామీ, ఆయన ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి ఇన్‌ఛార్జిగా వ్యవహరించడం లాంటివన్నీ పరిగణనలోకి తీసుకోవడంతోపాటు, ఏఐసీసీ ఇచ్చిన హామీ మేరకు మంత్రివర్గంలో చోటు లభించవచ్చనే ప్రచారం జరుగుతోంది. 
  • చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ పేరు సైతం వినిపిస్తోంది. పార్టీలో చేరేముందు ఆయనకు హామీ ఇచ్చారనే ప్రచారం ఉంది. వివేక్‌ కుమారుడు వంశీకృష్ణ పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. వివేక్‌ సోదరుడు గడ్డం వినోద్‌ సైతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్న ప్రేమసాగర్‌రావు పేరు కూడా బలంగా వినిపిస్తోంది. వివేక్‌ లేదా ప్రేమసాగర్‌రావులలో ఒకరికి అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. 
  • ఉమ్మడి నిజామాబాద్‌ నుంచి సీనియర్‌ నాయకుడు, బోధన్‌ ఎమ్మెల్యే పి.సుదర్శన్‌రెడ్డి పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఆయనకు ప్రభుత్వం ఏర్పాటు సమయంలోనే అవకాశం ఉంటుందని భావించినా సామాజిక సమీకరణాల్లో చోటు లభించలేదు. 
  • ప్రస్తుత మంత్రివర్గంలో మైనార్టీల నుంచి సైతం ఎవరూ లేరు. దాంతో ఆ వర్గం నుంచి ఒకరికి అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. ఎస్టీల నుంచి ఒకరికి అవకాశం ఉండొచ్చని సమాచారం. 
  • ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కూడా ఒకరికి అవకాశం కల్పించవచ్చని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తం మీద తాజా విస్తరణలో నలుగురికి అవకాశం ఉంటుందని, రెండు స్థానాలను ఖాళీగా పెట్టి కొంతకాలం తర్వాత భర్తీ చేయవచ్చని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని