TG News: అసంపూర్తి ప్రాజెక్టులపై సీఎం నజర్‌

అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా వేగంగా ఆయకట్టుకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంకల్పించారు.

Published : 08 Jul 2024 03:36 IST

ఆ ‘ఆరు’ త్వరగా పూర్తి చేయాలని రేవంత్‌రెడ్డి ఆదేశం
రూ.241 కోట్లు వెచ్చిస్తే 48 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం
ఈనాడు - హైదరాబాద్‌

హైదరాబాద్‌ అబిడ్స్‌లోని ఇస్కాన్‌ దేవాలయం ఆధ్వర్యంలో చేపట్టిన జగన్నాథ రథయాత్ర ప్రారంభానికి హాజరైన సందర్భంగా అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా వేగంగా ఆయకట్టుకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంకల్పించారు. రూ.241 కోట్లు ఖర్చు చేయడం ద్వారా 48వేల ఎకరాలకు వేగంగా సాగునీరు అందించే ఆరు ప్రాజెక్టులపై ఆయన దృష్టిసారించారు. తక్కువ ఖర్చుతో అసంపూర్తిగా ఉన్నవి పూర్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి పరీవాహకాల్లో అర్ధాంతరంగా పనులు నిలిచిపోయిన ప్రాజెక్టుల వివరాలను నీటిపారుదల శాఖ ఇంజినీర్ల నుంచి తెప్పించుకుని సీఎం పరిశీలించారు. రైతులకు సాగునీరు అందించాలంటే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఇటీవల పలు దఫాలుగా ఆరు ప్రాజెక్టులపై చర్చించిన ముఖ్యమంత్రి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులు, వీలైనంత తొందరగా సాగునీటిని అందించేందుకు వీలున్న వాటిని చేపడితే రైతులకు మేలు జరుగుతుందని.. అందుకు అవసరమైన అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా గోదావరి పరీవాహకంలోని నీల్వాయి ప్రాజెక్టు, పింప్రి ప్రాజెక్టు, పాలెం వాగు, మత్తడి వాగు, ఎస్సారెస్పీ స్టేజీ 2, సదర్మట్‌ ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించారు. నీల్వాయి ద్వారా మంచిర్యాల జిల్లా, పింప్రి ఎత్తిపోతల పథకం కింద నిర్మల్‌ జిల్లా, పాలెం వాగుతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా, మత్తడివాగుతో ఆదిలాబాద్‌ జిల్లా, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు రెండో దశతో వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జనగామ, సూర్యాపేట జిల్లాలకు, సదర్మట్‌ ప్రాజెక్టుతో నిర్మల్‌ జిల్లాలోని రైతులకు సాగునీరు అందుతుంది. వీటికి సంబంధించి పనులు పూర్తి చేసేందుకు దాదాపు రూ.241 కోట్లు ఖర్చవుతుందని నీటిపారుదల శాఖ అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది. వచ్చే ఏడాది 2025 మార్చి నాటికి వందకు వంద శాతం ఈ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని, అప్పటికల్లా ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు