Updated : 18 Nov 2021 04:10 IST

KCR: ధాన్యం ఎంత కొంటారు?

కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పష్టతనివ్వాలి
ఎఫ్‌సీఐ తీరుతో గందరగోళం
లక్ష్యాలను ముందే నిర్ధరించాలి  
పరిమితి నిబంధనలను తొలగించాలి
తెలంగాణకూ పంజాబ్‌ తరహా విధానం  
ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణ రాష్ట్రంలోని ధాన్యం సేకరణ సమస్యలను కేంద్రం సత్వరమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరారు. పంజాబ్‌ తరహా విధానాన్ని ఇక్కడా చేపట్టాలన్నారు. వానాకాలంలో పండిన పంటలో 90 శాతం వరి ధాన్యాన్ని సేకరించాలని, వచ్చే యాసంగిలో రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటారో స్పష్టం చేయాలని అభ్యర్థించారు. గత యాసంగి సీజన్‌లో మిగిలిన 5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని తక్షణమే సేకరించాలన్నారు. 2021-22 ఖరీఫ్‌లో 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించడమనే పరిమితిని తొలగించి లక్ష్యాన్ని మరింతగా పెంచాలన్నారు. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) తీరుతో రాష్ట్రాల్లో గందరగోళం నెలకొందని.. తమ నుంచి సేకరించే మొత్తంపై స్పష్టత ఇవ్వట్లేదన్నారు. ఏటా దిగుబడి పెరుగుతోందని తెలిసినా ధాన్యాన్ని వేగవంతంగా సేకరించడం లేదన్నారు. ధాన్యం సేకరణ సమస్యలపై బుధవారం ఆయన ప్రధానికి లేఖ రాశారు.

వ్యవసాయంలో అద్భుత అభివృద్ధి

‘‘తెలంగాణ ఏర్పడిన 2014 నుంచి, వ్యవసాయరంగంలో అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. వినూత్న విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకాల వల్లే ఇది సాధ్యమైంది. 24 గంటలూ నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా అందిస్తూ, ఏడాదికి ఎకరానికి రూ.పదివేల పంట పెట్టుబడి ప్రోత్సాహకాన్ని అందిస్తున్నాం. వాటిని అన్నదాతలు అందిపుచ్చుకుంటూ గుణాత్మకంగా దిగుబడిని సాధిస్తున్నారు. తద్వారా దేశ ప్రగతికి దోహదం చేస్తున్నారు. రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన సాగునీటి లభ్యత ద్వారా.. తెలంగాణ తన అవసరాలను దాటుకుని ఆహార ధాన్యం దిగుబడిలో మిగులు రాష్ట్రంగా నిలిచింది.

ఎఫ్‌సీఐ అసంబద్ధ నిబంధనలతో...

సురక్షిత నిల్వలను కొనసాగిస్తూ, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం, గోధుమలు వంటి ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తూ.. దేశ ప్రజలకు  ఆహార భద్రతను కల్పించే బాధ్యతలను నెరవేర్చాల్సిన ఎఫ్‌సీఐ అసంబద్ధ విధానాలను అవలంబిస్తూ రైతులను, రాష్ట్ర ప్రభుత్వాలను అయోమయానికి గురిచేస్తోంది. 2021 వానాకాలం సీజన్‌లో తెలంగాణలో 55.75 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం దిగుబడి వచ్చింది. కానీ 32.66 లక్షల మెట్రిక్‌ టన్నులు (59 శాతం) మాత్రమే ఎఫ్‌సీఐ సేకరించింది. ఇది 2019-20 వానాకాలంలో సేకరించిన ధాన్యం కంటే 78 శాతం తక్కువ.  ధాన్యం సేకరణలో ఇటువంటి విపరీత తేడాలుంటే రాష్ట్రంలో హేతుబద్ధమైన పంట విధానాలను అమలు చేయడానికి ఇబ్బంది ఏర్పడుతుంది.

కేంద్రమంత్రిని కలిసినా స్పందన లేదు

కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను సెప్టెంబరు 25, 26 తేదీల్లో స్వయంగా వెళ్లి కలిశాను. ధాన్యం సేకరణలో అయోమయ పరిస్థితులను తొలగించి కచ్చితమైన లక్ష్యాన్ని నిర్ధారించాలని కోరాను. 50 రోజులు దాటిపోయినా ఎటువంటి సమాచారం లేదు. ఇంతవరకు ఎటువంటి విధాన నిర్ణయాన్ని తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఎఫ్‌సీఐకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం’’ అని సీఎం కేసీఆర్‌ తన లేఖలో పేర్కొన్నారు.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts