Congress Meeting: కాంగ్రెస్‌లో మాటల ‘ఈటెలు’

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఘోర పరాజయం కాంగ్రెస్‌లో కాక రేపింది. నేతలు మాటల ఈటెలు విసురుకున్నారు.  హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఓటమిపై పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కె.సి.వేణుగోపాల్‌ అధ్యక్షతన శనివారం ఇక్కడి

Updated : 27 Feb 2024 17:10 IST

భట్టిపై వేణుగోపాల్‌ ఆగ్రహం

ఉత్తమ్‌, పొన్నం పరస్పర విమర్శలు

సమావేశానికి హాజరైన బోసురాజు, రేవంత్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, పొన్నం ప్రభాకర్‌

ఈనాడు, దిల్లీ: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఘోర పరాజయం కాంగ్రెస్‌లో కాక రేపింది. నేతలు మాటల ఈటెలు విసురుకున్నారు.  హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఓటమిపై పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కె.సి.వేణుగోపాల్‌ అధ్యక్షతన శనివారం ఇక్కడి వార్‌రూంలో సమీక్ష నిర్వహించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, పీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వి.హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్‌ కృష్ణన్‌, మాజీ మంత్రులు దామోదర రాజనరసింహా, షబ్బీర్‌అలీ, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, మధుయాస్కీ, కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన బల్మూరి వెంకట్‌లు పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... హుజూరాబాద్‌ ఉప ఎన్నికలకు తెరాస, భాజపా అభ్యర్థులు ముందుగా సిద్ధమవడం, అభ్యర్థిలో ఎంపికలో ఆలస్యం, 1983 నుంచి కాంగ్రెస్‌ గెలవకపోవడం, ధన ప్రభావం, అన్నింటికి మించి ఈటల రాజేందర్‌ను పార్టీలోకి తీసుకువచ్చే విషయంలో సకాలంలో స్పందించకపోవడం వంటి కారణాలను రేవంత్‌రెడ్డి వివరించారు. ఈటలను పార్టీలో చేర్చుకోవడాన్ని కొందరు వ్యతిరేకించారంటూ భట్టి విక్రమార్క చెప్పబోతుండగా కె.సి.వేణుగోపాల్‌ అడ్డుకున్నారు. ఈటల చేరికను వ్యతిరేకిస్తూ మీరు నాతో మాట్లాడిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. మీరు తప్పు చేసి ఇతరులపై నెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈటలను చేర్చుకునే విషయంలో తాత్సారం, నిర్లక్ష్యం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని వేణుగోపాల్‌ వ్యాఖ్యానించారు. ఈ దశలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ జోక్యం చేసుకుని ‘హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఓటమిపై సమీక్ష నిర్వహించడం సరైందే.అయితే హుజూర్‌నగర్‌, దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, నాగార్జునసాగర్‌ ఫలితాలపై ఎందుకు సమీక్ష నిర్వహించలేద’ని ప్రశ్నించారు.ఈ ఉపఎన్నిక ఫలితాలకు, ప్రస్తుత రాష్ట్ర నాయకత్వానికి ఎటువంటి సంబంధం లేదని, ఏడేళ్లుగా నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిగా ఉన్న కౌశిక్‌రెడ్డికి నాటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ రాష్ట్రానికి వచ్చినప్పుడు సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు వేరే పార్టీలో ఉండడానికి కారకులెవరో అందరికీ తెలుసన్నారు. నాడు నియోజకవర్గంలో పరిస్థితిని తాను వివరించినా మౌనంగా ఉండాలని ఉత్తమ్‌ చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విమర్శలకు ఆగ్రహించిన ఉత్తమ్‌ పరుష పదజాలం ఉపయోగించడంతో పొన్నం అందుకు దీటుగా బదులిచ్చారు. ఫలితంగా ఒక్కసారిగా వార్‌ రూంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కె.సి.వేణుగోపాల్‌, మాణికం ఠాగూర్‌లు శాంతింపజేశారు. వార్‌ రూంలో ఉదయం నాయకులతో సమావేశమైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కె.సి.వేణుగోపాల్‌ సాయంత్రం రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులతో విడివిడిగా సమావేశమయ్యారు. అనంతరం నాయకులు విలేకరులతో మాట్లాడారు...

క్షేత్రస్థాయి నివేదిక తీసుకుంటాం: ఠాగూర్‌

తెలంగాణలో కాంగ్రెస్‌ను బలమైన శక్తిగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. 2023 ఎన్నికలకు సిద్ధమయ్యాం. హుజూరాబాద్‌ ఎన్నికలపై అందరి నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం. హుజూరాబాద్‌లో పని చేసిన ద్వితీయ శ్రేణి నేతల నుంచి సమాచారం తీసుకోవడానికి ఏఐసీసీ నుంచి పరిశీలకులను నియమించాం. వారి నుంచి క్షేత్రస్థాయి నివేదిక తీసుకుంటాం. తెరాస, భాజపాలది గల్లీలో కుస్తీ.. దిల్లీలో దోస్తీ. ఆ పార్టీల తీరును ఎండగడతాం. కాంగ్రెస్‌ ఎప్పటికీ భాజపాకు మద్దతు ఇవ్వదు

సోదరునిపై ధృతరాష్ట్ర ప్రేమతోనే: పొన్నం

పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన సోదరుడు కౌశిక్‌ రెడ్డిపై చూపిన ధృతరాష్ట్ర ప్రేమే హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి కారణం. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని ముందే వివరించినా ఉత్తమ్‌ పట్టించుకోలేదు. గతంలో పీసీసీ అధ్యక్షులుగా పని చేసిన కేశవరావు, డి.శ్రీనివాస్‌లు కోవర్టులుగా వ్యవహరించి రాజ్యసభ సభ్యులయ్యారు. గత పీసీసీ అధ్యక్షుని చలవతో ఆయన తమ్ముడు కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ అవుతున్నారు. ఈ అంశంపై అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశాను.

కలిసికట్టుగా పోరాడుతూ ప్రజలకు అండగా నిలుస్తాం: రేవంత్‌రెడ్డి

సీనియర్ల సహకారం, అనుభవం, ఆలోచనలు, సూచనలు తీసుకొని ప్రజా సమస్యలపై నేతలంతా కలిసికట్టుగా పోరాడేలా ఏఐసీసీ దిశానిర్దేశం చేసింది. రేపటి నుంచి క్షేత్ర స్థాయిలో కార్యాచరణకు దిగుతాం. భాజపా, తెరాస రాజకీయ ఎత్తుగడలు, ప్రజావ్యతిరేక చర్యలపై  రెట్టించిన ఉత్సాహంతో పోరాడతాం. ప్రజలకు అండగా నిలుస్తాం. హుజూరాబాద్‌ ఫలితాలను ఓ ఉప ఎన్నిక ఫలితాలుగా కాకుండా ఓ అధ్యయనంగా తీసుకుంటాం. ఆ ప్రాంత ప్రజల ఆలోచనాసరళికి భిన్నంగా ఫలితాలు ఉన్నాయి. ఈ అంశంతో పాటు పార్టీ కార్యకర్తల పనితనం, నాయకత్వం మమేకమయ్యే తీరుపై అధ్యయనం చేస్తాం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు