gas cylinder explosion: గ్యాస్‌ సిలిండర్‌ పేలుడుకు పరిహారం చెల్లించాల్సిందే

గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీలో రక్షణ చర్యలు చేపట్టకపోవడం పంపిణీదారు, కంపెనీల సేవా లోపమేనని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ పేర్కొంది.

Published : 16 Jun 2024 06:21 IST

గ్యాస్‌ ఏజెన్సీ, కంపెనీ, బీమా సంస్థకు రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీలో రక్షణ చర్యలు చేపట్టకపోవడం పంపిణీదారు, కంపెనీల సేవా లోపమేనని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ పేర్కొంది. ప్రమాదం జరిగిన సందర్భాల్లో గ్యాస్‌ ఏజెన్సీ, బీమా కంపెనీలు పరిహారాన్ని తిరస్కరించడం తగదని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. మల్కాజిగిరికి చెందిన రమేశ్‌ బిందుశక్తి గ్యాస్‌ ఏజెన్సీ నుంచి 2014లో ఇండేన్‌ గ్యాస్‌ కనెక్షన్‌ను పొందారు. 2017 మార్చిలో గ్యాస్‌ లీక్‌ అయి సిలిండర్‌ పేలడంతో రమేశ్‌ కుమార్తె విజయలక్ష్మి, భార్య మాలతి తీవ్రంగా గాయపడ్డారు. వారిలో విజయలక్ష్మి 2018లో, మాలతి 2021లో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో పరిహారం చెల్లిస్తామని గ్యాస్‌ ఏజెన్సీ, బీమా కంపెనీ అధికారులు బాధితులకు హామీ ఇచ్చారు. తర్వాత పట్టించుకోకపోవడంతో బాధితులు  రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుపై కమిషన్‌ సభ్యులు కె.రంగారావు, ఆర్‌.ఎస్‌.రాజెశ్రీల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఫిర్యాదుదారుల స్వీయ తప్పిదాల వల్లనే ప్రమాదం జరిగిందని గ్యాస్‌ ఏజెన్సీ, ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ, బీమా కంపెనీలు వాదించాయి. వాదనలు విన్న ధర్మాసనం.. గ్యాస్‌ ఏజెన్సీ, ఆయిల్, బీమా కంపెనీల తీరును తప్పుబట్టింది. ప్రమాదానికి గ్యాస్‌ ఏజెన్సీ, కంపెనీల సేవా లోపమే కారణమని తేల్చిచెప్పింది. ప్రమాద పాలసీల ప్రకారం ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున బీమా చెల్లించాల్సి ఉంది. పిటిషనర్లు మాలతి కుమారుడు రాకేష్‌బాబుకు 2017 డిసెంబరు నుంచి 9 శాతం వడ్డీతో రూ.20 లక్షలు చెల్లించాలని బిందుశక్తి గ్యాస్‌ ఏజెన్సీ, ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ, న్యూ ఇండియా, ఐసీఐసీఐ లాంబార్డ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలను ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు