TG News: వైద్య విధాన పరిషత్‌ రద్దు!

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్య, ఆరోగ్య శాఖలో కీలక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.

Published : 11 Jul 2024 03:35 IST

ఆ స్థానంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ ఏర్పాటు
రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు
ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో మెరుగైన వైద్య సదుపాయం లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు 

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్య, ఆరోగ్య శాఖలో కీలక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో మాధ్యమిక వైద్యసేవల్లో కీలకంగా ఉన్న వైద్య విధాన పరిషత్‌ రద్దుకు రంగం సిద్ధం చేసింది. ఆ స్థానంలో మాధ్యమిక వైద్య, ఆరోగ్య వ్యవస్థగా డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీహెల్త్‌ను ఏర్పాటు చేయనుంది. సుమారు 38 ఏళ్లుగా ఉన్న వైద్య విధానపరిషత్‌ను ప్రభుత్వ ఆరోగ్య విభాగాల్లో ఒకటిగా మార్చనుంది. త్వరలో జరగనున్న మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనుంది. వచ్చే శాసనసభ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు అవసరమైన ప్రక్రియను వైద్య, ఆరోగ్యశాఖ పూర్తి చేస్తోంది. దీంతో వైద్యవిధాన పరిషత్‌ కమిషనరేట్‌ స్థానంలో డైరెక్టరేట్‌ ఏర్పాటు కానుంది. 

వనరుల సమర్థ వినియోగం..

ప్రస్తుతం ప్రాథమిక వైద్య సేవల కోసం ప్రజారోగ్యశాఖ(డైరెక్టరేట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌) ఉండగా అత్యున్నత వైద్యసేవలకు రాష్ట్రంలో బోధనాసుపత్రులు కీలకంగా ఉన్నాయి. మాధ్యమిక వైద్యసేవల్లో భాగంగా విధాన పరిషత్‌ పరిధిలో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా, జిల్లా ఆసుపత్రులు మొత్తం 175 దాకా ఉండగా వీటిలో 11 వేలకుపైగా పడకలు ఉన్నాయి. మొత్తం 4,300 మంది వైద్యులు సహా 12 వేలమంది ఇతర ఉద్యోగులు ఉన్నారు. ఏటా సుమారు కోటిన్నర మంది వైద్య సేవల కోసం వస్తున్న వైద్య విధాన పరిషత్‌ను ప్రభుత్వ వైద్య, ఆరోగ్యశాఖలో పూర్తిగా అంతర్భాగం చేయడం ద్వారా మరింత సమర్థంగా సేవలు అందించవచ్చని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న మానవ వనరులు, మౌలిక సదుపాయాలను సమర్థంగా వినియోగించుకుంటే మండలం, నియోజకవర్గ స్థాయిలోనే పటిష్ఠ వైద్యసేవలకు సానుకూలత ఏర్పడుతుందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో ప్రజలకు చేరువగా కీలక వైద్య వసతి ఉండాలని భావిస్తోంది. ఆ లక్ష్యం నెరవేరాలంటే వైద్య విధానపరిషత్‌ ఆసుపత్రులను, బోధనాసుపత్రులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం ద్వారానే సాధ్యమవుతుందని అధికారులు వివరిస్తున్నారు. 

ఏళ్లుగా గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులతోనే..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1987 మార్చి ఒకటో తేదీన ప్రత్యేక చట్టం ద్వారా వైద్య విధాన పరిషత్‌ ఏర్పాటైంది. ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధుల ద్వారా ఇది పనిచేస్తోంది. సొంతంగా ఆర్థిక వనరులను సమకూర్చుకుని నిర్వహించుకునే లక్ష్యంతో ఏర్పాటైనా తర్వాత పూర్తిగా ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులపైనే ఆధారపడి కొనసాగుతోంది. వైద్య, ఆరోగ్య సేవల్లో కీలకంగా ఉంటున్నా నిధులు మాత్రం ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ లేదా ప్రజారోగ్య శాఖ ద్వారా అందాల్సి ఉంటోంది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ ఏర్పాటుతో నేరుగా నిధులను పొందేందుకు మార్గం సుగమం అవుతుంది. వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగులకు వేతనాలు సహా అన్ని చెల్లింపులకు ప్రతిసారీ ఆర్థికశాఖ ధ్రువీకరించాల్సి ఉంటోంది. ప్రస్తుతం ఆ విభాగానికి కమిషనర్‌ ఉండగా మార్పుల్లో భాగంగా డైరెక్టర్‌ ప్రధాన బాధ్యులుగా ఉంటారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని