TG News: రూ.40 వేల కోట్ల రుణసేకరణ!

రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా పథకాల అమలు కోసం భారీగా రుణాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.

Published : 06 Jul 2024 03:24 IST

రుణమాఫీకి రూ.31 వేల కోట్లు, రైతుభరోసాకు రూ.5 వేల కోట్లు అవసరమని అంచనా
ఆగస్టులోగా తీసుకునేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు
బాండ్ల విక్రయం, భూముల తాకట్టుకు యోచన

ఈనాడు, హైదరాబాద్‌: రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా పథకాల అమలు కోసం భారీగా రుణాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. వచ్చే నెల 15లోగా రూ.2 లక్షలలోపు పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనికి రూ.31 వేల కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేసింది. మరోవైపు ప్రస్తుత వానాకాలం(ఖరీఫ్‌) పంటల సాగు సీజన్‌ ప్రారంభమై ఇప్పటికే నెల గడిచింది. సెప్టెంబరుకల్లా ముగిసే ఈ సీజన్‌లో రైతుభరోసా(గతంలో రైతుబంధు) పథకం కింద ఎకరానికి రూ.7,500 చొప్పున రైతు బ్యాంకు ఖాతాలో జమచేయాల్సి ఉంది. ఈ పథకానికి కనీసం రూ.5 వేల కోట్లయినా తక్షణం అవసరమని అంచనా. ఇంకోవైపు 18 నుంచి 59 ఏళ్లలోపు వయసుగల రైతులకు జీవిత బీమా కల్పించే పథకానికి మరో రూ.1500 కోట్ల ప్రీమియంను ఎల్‌ఐసీకి వచ్చే నెల 15లోగా రాష్ట్రప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. 

బాండ్ల ద్వారా రూ.15 వేల కోట్లకుపైగా..

ప్రతి నెలా రూ.ఐదారు వేల కోట్లను బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వుబ్యాంకు నుంచి రుణం తీసుకుంటోంది. జులై, ఆగస్టు నెలల్లో బాండ్ల విక్రయంపై రూ.15 వేల కోట్ల నుంచి 18 వేల కోట్ల వరకూ తీసుకునేందుకు అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదికాకుండా ప్రభుత్వ భూములను ‘తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ’(టీజీఐఐసీ) ద్వారా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లకు పైగా రుణాలను సేకరించేందుకు అవకాశాలున్నాయా అని ప్రభుత్వం అధ్యయనం చేయిస్తోంది. అవసరమైతే భూముల తనఖా ద్వారా నిధుల కోసం ప్రత్యేకంగా రైతు సంక్షేమ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రుణం తీసుకోవడంపైనా యోచిస్తోంది. బాండ్ల విక్రయం, భూముల తాకట్టుపై ఎంత వరకూ వస్తాయనేది కొద్దిరోజుల్లో పూర్తి స్పష్టత రానుంది. ఇది తేలిన తరవాత మిగిలిన సొమ్మును ఎలా సేకరించాలనేదానిపై ప్రభుత్వం దృష్టి పెట్టనుందని సమాచారం. 

మంత్రుల కమిటీ నివేదిక ఆధారంగా.. 

ఆగస్టు ఆరంభం నుంచి రుణమాఫీ అమలు ప్రారంభమయ్యే సూచనలున్నాయి. మొదట రూ.50 వేలు, ఆ తరవాత రూ.లక్ష.. ఇలా పెంచుతూ ఒక్కో రైతు రుణాన్ని చెల్లించేందుకు గల అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. మొత్తం 40 లక్షల మంది రైతుల్లో 70 శాతమ మందికిపైగా రూ.లక్షలోపే రుణం ఉన్నట్లు అంచనా. రైతుభరోసా కింద పెట్టుబడి సాయం ఎవరికి ఇవ్వాలి అనేది అన్ని పక్షాలతో చర్చించేందుకు మంత్రుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పది ఉమ్మడి జిల్లాల్లో అన్ని పక్షాలతో ఈ పథకంపై కమిటీ చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ‘ఈనాడు’కు తెలిపారు. నిజమైన రైతులందరికీ సాయం చేయాలనేది ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నందున వ్యవసాయశాఖకు ఈ నెలాఖరులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో భారీగా నిధుల కేటాయింపు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. వీటిలో అత్యధిక శాతం సొమ్మును రుణాల ద్వారా సేకరించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని