Telangana: ఎల్‌ఆర్‌ఎస్‌పై సర్కారు మథనం

రాష్ట్రంలో పెండింగులో ఉన్న అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) చిక్కుముడులు విప్పేందుకు అధికారులు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇటు హైకోర్టులో, అటు సుప్రీంకోర్టులో వ్యాజ్యాలుండడంతో నాలుగేళ్లుగా ఈ వ్యవహారం అపరిష్కృతంగా ఉంది.

Updated : 23 Jun 2024 06:56 IST

కోర్టు వ్యాజ్యాల అంశం సీఎం దృష్టికి..
పరిష్కరించుకునే దిశగా కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌ రాష్ట్రంలో పెండింగులో ఉన్న అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) చిక్కుముడులు విప్పేందుకు అధికారులు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇటు హైకోర్టులో, అటు సుప్రీంకోర్టులో వ్యాజ్యాలుండడంతో నాలుగేళ్లుగా ఈ వ్యవహారం అపరిష్కృతంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిష్కరించి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఎల్‌ఆర్‌ఎస్‌ వ్యవహారాన్ని కొలిక్కి తెస్తామని ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క పలు సమీక్షల సందర్భంగా చెప్పారు. మున్సిపల్‌ వ్యవహారాలపై ముఖ్యమంత్రి త్వరలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారని.. అప్పటికి ఎల్‌ఆర్‌ఎస్‌ చిక్కులపై సీఎంకు నివేదిక అందించాలని అధికారులు సిద్ధమవుతున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రస్తుతం హైకోర్టులో స్టే ఉంది. సుప్రీంకోర్టులో కూడా వ్యాజ్యం దాఖలైనా.. అది ఇంతవరకు అడ్మిట్‌ కాలేదని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు స్టే ఎత్తివేత కోసం అఫిడవిట్‌ దాఖలుకు సీఎం నుంచి అనుమతి కోరాలని నిర్ణయించారు. హైకోర్టులోనే పరిష్కారాన్ని పొందటం ద్వారా లక్షల మంది దరఖాస్తుదారులకు వెసులుబాటు కల్పించినట్లవుతుందని ఓ అధికారి తెలిపారు.

25 లక్షల మంది నిరీక్షణ

క్రమబద్ధీకరణ కోసం 2020 నుంచి 25.44 లక్షల మంది దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. ప్లాట్ల యజమానుల్లో కొందరు ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టారు. మరికొంత మంది హైకోర్టు ఉత్తర్వుల మేరకు భవన నిర్మాణ అనుమతుల కోసం అదనపు ఫీజు చెల్లించి ఇళ్లు నిర్మించుకున్నారు. ఏళ్ల కిందట స్థలాలు కొనుక్కున్న వారు.. ఇప్పుడు వాటిని విక్రయించుకుని కుటుంబ అవసరాలకు వినియోగించుకోవాలనుకుంటున్నారు. క్రమబద్ధీకరణ కాకుండా విక్రయిస్తే వాటికి రిజిస్ట్రేషన్లు అయ్యే పరిస్థితి లేకపోవటంతో కొనుగోలుదారులు ముందుకు రావటం లేదని, వచ్చినా తక్కువ మొత్తానికి అడుగుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత డిసెంబరులో కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఈ ఏడాది మార్చి నెలలోనే ఎల్‌ఆర్‌ఎస్‌ దస్త్రాల పరిష్కారానికి ఉపక్రమించింది. దరఖాస్తుదారులకు స్థానిక అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. తర్వాత లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమలులోకి రావటంతో ప్రక్రియ ఆగింది. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని త్వరగా పరిష్కరించుకుంటే రాష్ట్ర ఖజానాకు కొంత ఉపయుక్తంగా ఉంటుందని సర్కారు భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని