Rythu Bharosa: పటిష్ఠ విధానాలతో రైతుభరోసా

గత భారాస ప్రభుత్వం సాగులో లేని భూములకు కూడా రైతుబంధు వర్తింపజేసి 12 విడతల్లో దాదాపు రూ.25,670 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిందని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు.

Updated : 26 Jun 2024 07:04 IST

భారాస హయాంలో రైతుబంధు ద్వారా రూ.25,670 కోట్ల ప్రజాధనం వృథా
రుణమాఫీపై త్వరలో ఉత్తర్వులు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల. చిత్రంలో కోదండరెడ్డి, చిన్నారెడ్డి, అన్వేష్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: గత భారాస ప్రభుత్వం సాగులో లేని భూములకు కూడా రైతుబంధు వర్తింపజేసి 12 విడతల్లో దాదాపు రూ.25,670 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిందని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. రైతుబంధు తరహాలో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా.. రైతుభరోసాకు పటిష్ఠ విధానాలను తమ ప్రభుత్వం రూపొందిస్తోందని తెలిపారు. ఆలస్యమైనా.. అర్హులకు మాత్రమే అందేలా రూపకల్పన చేస్తామని వివరించారు. రైతునేస్తం కార్యక్రమం కింద మంగళవారం 110 గ్రామీణ నియోజకవర్గాల్లోని రైతు వేదికల్లో వ్యవసాయశాఖ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా రైతుభరోసాపై రైతుల అభిప్రాయాలను తెలుసుకొన్నారు.

సాగులో ఉన్న భూములకే ఇవ్వాలి.. 

ఈ సందర్భంగా పలువురు రైతులు సూచనలు చేశారు. ‘‘సాగు చేసేవారికి, సాగులో ఉన్న భూములకే రైతుభరోసా అందించాలి. స్థిరాస్తి భూములను మినహాయించాలి. గరిష్ఠ పరిమితి విధించాలి. వానాకాలం సీజన్‌కు ఈ నెలలోనే సాయం అందించాలి. యాసంగికి నవంబరులో ఇవ్వాలి’’ అని కోరారు. పదెకరాలు ఉన్నవారికీ సాయం అందించాలని.. అలాంటివారిలో ఎక్కువ మంది ఆదర్శ రైతులున్నారని కొందరు తెలిపారు. ఆదాయపు పన్ను చెల్లించేవారికి చెల్లించవద్దని కొందరు కోరగా... ట్రాక్టర్ల రుణాలకు ఐటీ రిటర్నులు తప్పనిసరి చేసిన నేపథ్యంలో వారికీ ‘రైతుభరోసా’ వర్తింపజేయాలని మరికొందరు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు; ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, కార్పొరేషన్ల ఛైర్‌పర్సన్లను మినహాయించాలని సూచించారు. 2018 డిసెంబరు 12 కంటే ముందు రుణ బకాయిలున్న వారికీ మాఫీ వర్తింపజేయాలని కొందరు కోరారు. దీనిపై మరోసారి మాట్లాడతామని మంత్రి చెప్పారు. కౌలు రైతులకు, రైతు కూలీలకూ రైతుభరోసా అందిస్తామని, రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. రైతునేస్తంలో వచ్చిన సూచనలన్నింటినీ క్రోడీకరించి.. నివేదిక రూపొందించాలని వ్యవసాయ సంచాలకుడు గోపిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌రావు, అఖిల భారత కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


భారాస హయాంలోనే చేనేత సంక్షోభం 

భారాస పాలనలో చేనేత రంగం సంక్షోభానికి గురైందని, నేతన్నలకు డబ్బులు చెల్లించకుండా గత ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులపాలు చేసిందని మంత్రి తుమ్మల విమర్శించారు. మంగళవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘గత పదేళ్లలో చేనేత రంగాన్ని అన్ని స్థాయుల్లో అస్తవ్యస్తం చేశారు. సొంత లాభాలకు వాడుకున్నారు. ఇప్పుడు లేఖ పేరిట కేటీఆర్‌ రాజకీయం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టాన్ని కొత్త ప్రభుత్వంపై రుద్దాలని చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి.. చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమంపై సమీక్ష చేశారు. ఆయన ఆదేశాల మేరకు కార్మికుల స్వయం సమృద్ధికి నూతన పథకం రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గత ప్రభుత్వం నేతన్న బీమా పథకాన్ని ప్రకటించి నామమాత్రంగా రూ.5 కోట్లు విడుదల చేసింది. ఇంకా రూ.16 కోట్ల బకాయిలున్నాయి. కాంగ్రెస్‌ హయాంలో అమలైన 50 శాతం పవర్‌ సబ్సిడీ పథకాన్ని గత భారాస ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. 2016 నుంచి రూ.59 కోట్ల బకాయిలున్నాయి. 2024 జనవరి నుంచి సిరిసిల్లలో జరిగిన ఆరుగురు చేనేత కార్మికుల ఆత్మహత్యలపై విచారణ జరిపి.. అర్హులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు చర్యలు చేపట్టాం’’ అని తుమ్మల పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని