Ecotourism: ప్రకృతి పర్యాటకానికి ప్రత్యేక విధానం

రాష్ట్రంలో ప్రకృతి పర్యాటకంపై అధికారులు  కసరత్తు ప్రారంభించారు. ప్రత్యేకంగా ‘ప్రకృతి పర్యాటక విధానం’ రూపకల్పన ప్రక్రియ మొదలైంది.

Published : 13 Jun 2024 05:35 IST

కర్ణాటకతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అధ్యయనం
కార్పొరేషన్‌ ఏర్పాటుచేసే అవకాశం 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రకృతి పర్యాటకంపై అధికారులు  కసరత్తు ప్రారంభించారు. ప్రత్యేకంగా ‘ప్రకృతి పర్యాటక విధానం’ రూపకల్పన ప్రక్రియ మొదలైంది. సీఎం రేవంత్‌రెడ్డి సూచనల నేపథ్యంలో ఈ విధానాన్ని భారీగా అమలుచేస్తున్న కర్ణాటకతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని అధికారులు నిర్ణయించారు. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్న ఐఎఫ్‌ఎస్‌ అధికారి రంజిత్‌ నాయక్‌తో పాటు ఎఫ్‌ఆర్వో శ్రీనివాస్‌ 4 రోజుల అధ్యయనానికి కర్ణాటక వెళ్లారు. ఆ తర్వాత ఒడిశా సహా ఒకట్రెండు రాష్ట్రాల్లో అధ్యయనం చేయనున్నట్లు సమాచారం. జూన్‌ నెలాఖరు వరకు ముసాయిదా విధానాన్ని సిద్ధం చేసే అవకాశాలున్నాయి. 

రాష్ట్రం భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 24 శాతం అటవీ ప్రాంతాలే.. హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలోనూ లక్ష పైచిలుకు ఎకరాల్లో అటవీ భూములు ఉన్నాయి. తెలంగాణలో దట్టమైన అడవులు, అందులో వన్యప్రాణులు, జలపాతాలు అనేకం ఉన్నాయి. అక్కడి అటవీ ప్రాంతాల్లో బస చేసేందుకు వసతి సదుపాయాల్లేవు. దీంతో తెలంగాణ నుంచి అనేకమంది పర్యాటకులు ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారు. తెలంగాణలో అటవీ, పర్యాటక శాఖలు కలిసి ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి మార్చిలో అటవీశాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారుల్ని ఆదేశించారు. ఈడీ రంజిత్‌ నాయక్‌కి ఎకోటూరిజం విధానం అధ్యయనం బాధ్యతలను అప్పగించారు. అయితే నిధుల సమస్య లేకుండా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేసే అవకాశాలున్నట్లు అటవీశాఖ వర్గాల సమాచారం. కర్ణాటకలో ప్రైవేటు భాగస్వామ్యంతో ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి ఐఎఫ్‌ఎస్‌ అధికారిని ఎండీగా నియమించారు. దీన్నికూడా రాష్ట్ర అధికారులు పరిశీలిస్తున్నారు. 

ప్రాధాన్యం ఎక్కడెక్కడ? 

ప్రకృతి పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రధానంగా పచ్చదనం ఎక్కువ ఉన్న అటవీ ప్రాంతాలకు.. వన్యప్రాణులు, వలసవచ్చే పక్షులు సంచరించే ప్రాంతాలు, జీవవైవిధ్యం ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉత్తర తెలంగాణలో కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు, దక్షిణ తెలంగాణలో అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులపై అటవీశాఖ దృష్టి సారిస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని