crop Loan Waiver scheme: దశలవారీగా రుణమాఫీ?

వచ్చే నెల మొదటి వారం నుంచి రైతు రుణమాఫీని దశలవారీగా అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అమలుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు, నిధుల సమీకరణ తదితర అంశాలపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

Updated : 20 Jun 2024 15:23 IST

మొదట రూ.లక్ష... తర్వాత రూ.లక్షన్నర వరకు
రూ.రెండు లక్షల వరకు అప్పు ఉన్న వారికి తదుపరి రెండు విడతల్లో...
జులై మొదటి వారం నుంచి పంద్రాగస్టు వరకు అమలు చేసే యోచన
ఒక రైతుకు.. ఐదు ఎకరాలకు మాత్రమే రైతుభరోసా!
ఈనాడు - హైదరాబాద్‌

వచ్చే నెల మొదటి వారం నుంచి రైతు రుణమాఫీని దశలవారీగా అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అమలుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు, నిధుల సమీకరణ తదితర అంశాలపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆగస్టు 15 కల్లా రుణమాఫీని అమలు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, గత కొన్ని రోజులుగా ఆర్థిక శాఖ అధికారులతోనూ, మంత్రివర్గ సహచరులతోనూ దీనిపై విస్తృతంగా చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేంద్రం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకానికి రూపొందించిన మార్గదర్శకాలను కూడా అధ్యయనం చేసిన ప్రభుత్వం, రుణమాఫీ అమలులో కేంద్ర మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీని ప్రకారం.. సంస్థలకు ఉన్న భూములకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి, ప్రస్తుత, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత కేటగిరీల్లోని ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, చార్టర్డ్‌ ఎకౌంటెంట్లు.. ఇలా పలు రంగాలకు చెందిన వారు భూములపై తీసుకొన్న రుణానికి మాఫీ ఉండదు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొన్న తర్వాత సుమారు 26 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ అమలు చేయాల్సి రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెల 21న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాలన్నింటిపైనా చర్చించి ప్రభుత్వం తుది నిర్ణయానికి రానుంది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం జులై మొదటి వారం నుంచి దశలవారీగా అమలు చేసే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. మొదట రూ.లక్ష వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేయనున్నట్లు తెలిసింది. దీనికి సుమారు రూ.ఆరు వేల కోట్లు అవసరమని సమాచారం. తర్వాత రూ.లక్షన్నర వరకు అమలు చేసే అవకాశం ఉంది. దీనికి మరో రూ.6,500 కోట్లు అవసరమని సమాచారం. ఈ రెండు దశల్లో సుమారు 16 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ అమలవుతుందని తెలిసింది. రూ.రెండు లక్షల వరకు ఉన్న వారికి తర్వాత రెండు దశల్లో అమలు చేయనున్నట్లు సమాచారం. జులైలో కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, మిగిలిన రుణ మాఫీ అమలుకు నిధులను సమీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సాగు చేసే రైతుకు మాత్రమే రైతుభరోసా 

రైతుభరోసా అమలుకు సంబంధించిన మార్గదర్శకాలపైనా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గుట్టలు, కొండలు, రియల్‌ ఎస్టేట్‌ లేఅవుట్ల లాంటివన్నీ మినహాయించనున్నారు. సాగు చేసే రైతుకు మాత్రమే రైతుభరోసా దక్కాలనేది ప్రభుత్వ ఉద్దేశమని, దీనికి తగ్గట్లుగానే మార్గదర్శకాలుంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్ని ఎకరాల భూమి ఉన్నా, ఒక రైతుకు ఐదు ఎకరాలకు మాత్రమే రైతుభరోసాను పరిమితం చేయనున్నట్లు తెలిసింది. 


రైతు రుణమాఫీకి అర్హత నిర్ధారణే ప్రధాన ఎజెండా

రేపు మంత్రివర్గ సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: రైతు రుణమాఫీకి అర్హత నిర్ధారణే ప్రధాన ఎజెండాగా సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 21(శుక్రవారం)న సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆగస్టు 15లోగా రైతు పంట రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. ప్రధానంగా ఇదే అంశంపై మంత్రివర్గంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీకి సుమారు రూ.30వేల కోట్లు అవసరమని ఆర్థిక శాఖ ప్రతిపాదించడంతో.. అందుకు అవసరమైన నిధుల సేకరణ, విధి విధానాల రూపకల్పనపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఆదాయపు పన్ను చెల్లించే వారికి రుణమాఫీ వర్తింపజేయలా? లేదా? అనే కోణంలోనూ చర్చించనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని