Indiramma houses: ఇందిరమ్మ ఇళ్లపై కసరత్తు

ఎన్నికల కోడ్‌ ముగియడంతో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

Published : 14 Jun 2024 05:46 IST

కోడ్‌ ముగియడంతో దరఖాస్తుల పరిశీలనపై దృష్టి
మూడు నెలల్లో పూర్తిచేసేందుకు కార్యాచరణ
వివిధ రాష్ట్రాల్లో గృహ నిర్మాణ పథకాలపై అధ్యయనానికి నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల కోడ్‌ ముగియడంతో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. మరోవైపు ఇళ్ల నిర్మాణానికి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రెండు పడక గదుల ఇళ్ల స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.7,740 కోట్లు కేటాయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. లబ్ధిదారులు అధికారుల పర్యవేక్షణలో ఇళ్ల నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుందని,  ఆ నిధులను నాలుగు దశల్లో ప్రభుత్వం విడుదల చేస్తుందని పేర్కొంది. పథకాన్ని ఈ ఏడాది మార్చి 11వ తేదీన భద్రాచలంలో సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఇళ్ల నమూనాలనూ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించటంతో హడ్కో సుమారు రూ.1,000 కోట్లు రుణంగా మంజూరు చేసింది. పట్టణ ప్రాంతాల ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత మొత్తం అందుతుంది. ఆయా లెక్కలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.

లబ్ధిదారుల ఎంపికే సవాల్‌

సంవత్సరానికి 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన అయిదేళ్లలో 22.50 లక్షల ఇళ్లు నిర్మించేందుకు అవకాశం ఉంది. వచ్చిన దరఖాస్తులు 82.82 లక్షలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వడపోత సవాల్‌గా మారింది. ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకున్న మీదటే ముందడుగు వేయాలని అధికారులు భావిస్తున్నారు.

అధ్యయనానికి బృందాలు

పేదల సొంత ఇంటి కలను సాకారం చేసే క్రమంలో ఇతర రాష్ట్రాలు అమలుచేస్తున్న గృహ నిర్మాణ పథకాల విధివిధానాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ విషయమై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పథకం అమలులో ఆయా రాష్ట్రాల అనుభవాలనూ పరిగణనలోకి తీసుకోవటం ద్వారా రాష్ట్రంలో పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అవకాశం ఉంటుందని నిర్దేశించారు. ఈ క్రమంలో అధ్యయనం చేసేందుకు అధికారుల బృందాలు వేర్వేరు రాష్ట్రాల్లో పర్యటించనున్నాయి.

లాటరీ విధానంలో ఎంపిక!

ఏడాదికి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు కేటాయించాలని సర్కారు నిర్ణయించింది. మిగిలిన 33,500 ఇళ్లను రిజర్వు కోటా కింద ఉంచాలనేది యోచన. దరఖాస్తులతో పోలిస్తే మంజూరుచేసే ఇళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ‘గతంలో సిద్ధమైన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లలో కొన్నింటిని లాటరీ విధానంలోనే లబ్ధిదారులకు కేటాయించారు. అదే విధానాన్ని అనుసరిస్తే వివాదాలకు దూరంగా ఉండవచ్చు అని భావిస్తున్నాం. ప్రభుత్వానికి ఇదే ప్రతిపాదించామని’ ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు. ‘వడపోతలో భాగంగా ప్రాథమికంగా అర్హత పొందిన అన్ని దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఆ పరిశీలనను మూడు నెలల్లో పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాం. మూడు నెలల లక్ష్యాన్ని పెట్టుకున్నప్పటికీ సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని భావిస్తున్నాం. ఆ తరవాత లబ్ధిదారులు ఎంపిక కసరత్తు చేపడతాం’ అని ఆయన వివరించారు.


82.82 లక్షల దరఖాస్తులు

వివిధ పథకాల కింద లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం నిర్వహించిన ప్రజావాణిలో ఇళ్ల కోసం 82,82,332 దరఖాస్తులు అందాయి. వాటిలో ఒకే కుటుంబం నుంచి వచ్చిన దరఖాస్తులను వేరుచేసే ప్రక్రియను గతంలో చేపట్టినప్పటికీ పూర్తి కాలేదు. ఒకే ఇంటి నంబరుతో వచ్చిన దరఖాస్తులను మాత్రమే వేరు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ దశలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావటం, అధికారులు ఎన్నికల కార్యకలాపాల్లో నిమగ్నమవడంతో ఈ ప్రక్రియ తాత్కాలికంగా ఆగింది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని