New Revenue Law: భూసమస్యల పరిష్కారానికి ఏకీకృత చట్టం

రాష్ట్రంలో భూ సమస్యలకు సమగ్ర పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సరికొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ముసాయిదా(డ్రాఫ్ట్‌) రూపకల్పన చివరి దశకు చేరుకుంది.

Published : 25 Jun 2024 06:11 IST

తుది దశకు చేరిన ముసాయిదా రూపకల్పన
రాష్ట్రంలోని 122 చట్టాలన్నీ క్రోడీకరించాలని భావిస్తున్న ప్రభుత్వం
డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో ల్యాండ్‌ ట్రైబ్యునళ్లు
ధరణి పోర్టల్‌నూ మార్చే అవకాశం
ఈనాడు - హైదరాబాద్‌

రామయ్య అనే రైతుకు ఒక సర్వే సబ్‌ డివిజన్‌ నంబరులో ఎకరా పట్టా భూమి ఉంది. అదే మూల సర్వే నంబరులో ఇనాం భూములు కూడా ఉన్నాయి. మూల సర్వే నంబరును నిషేధిత జాబితాలోకి చేర్చడంతో రామయ్య భూమి కూడా అదే జాబితాలో చేరింది. ఆ భూమిని విక్రయించడానికి ఆయనకు వీలు లేకుండా పోయింది. రాష్ట్రంలో చాలామంది రైతులది ఇదే పరిస్థితి.

పొరుగు రాష్ట్రాల్లో గరిష్ఠంగా 15 ఏళ్లకు పైగా సాగులో ఉన్న ఎసైన్డ్‌ భూములకు పట్టాలు జారీ చేస్తున్నారు. తెలంగాణలో నలభై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ఇనాం భూములపై హక్కులు లేక అనేక మంది రైతులు అవస్థలు పడుతున్నారు.

తెలంగాణ రెవెన్యూశాఖలో 122 చట్టాలు అమల్లో ఉండటం.. సమస్యల పరిష్కారానికి ప్రతిబంధకంగా మారింది.

రిజిస్ట్రేషన్లు-మ్యుటేషన్ల సేవల కోసం అమల్లోకి తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో మాత్రమే యాజమాన్య హక్కుల కల్పనకు అవకాశం ఉండటంతో భూయజమానులు ఇబ్బందులు పడుతున్నారు.

ఏదైనా భూ సమస్యపై ఫిర్యాదు చేసేందుకు సరైన వేదిక లేదు. ఆర్వోఆర్‌-2020 చట్టం కారణంగా తహసీల్దారు నుంచి సీసీఎల్‌ఏ వరకు ఎవరికీ సమస్యలను పరిష్కరించే అధికారం లేకుండాపోయింది.

రాష్ట్రంలో భూ సమస్యలకు సమగ్ర పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సరికొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ముసాయిదా(డ్రాఫ్ట్‌) రూపకల్పన చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న తెలంగాణ పాసుపుస్తకాలు- భూ దస్త్రాల యాజమాన్య హక్కుల చట్టం-2020 (ఆర్వోఆర్‌) ద్వారా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ సమస్యలకు కేంద్రబిందువుగా మారిందన్న అభిప్రాయానికి సర్కారు వచ్చింది. భూ యజమానులందరికీ సులువుగా, అనువుగా ఉండేలా సరికొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. డ్రాఫ్ట్‌ రూపకల్పనపై ధరణి కమిటీ, భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ కార్యాలయ అధికారులు దృష్టి సారించారు.

కొత్త చట్టం ఎందుకంటే...

2020 అక్టోబరు 29న గత ప్రభుత్వం ఆర్వోఆర్‌ చట్టం తీసుకొచ్చింది. దాని వల్ల పెద్దఎత్తున భూ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ప్రస్తుత సర్కారు గుర్తించింది. వాటిపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన ధరణి కమిటీ అందించిన నివేదిక మేరకు.. పలు కీలక సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. దీంతో కొత్త చట్టం తీసుకురావడంపై రెవెన్యూశాఖ కసరత్తు చేస్తోంది. భూ సమస్యలకు ఆస్కారం లేకుండా.. సులువుగా సేవలు అందేందుకు వీలుగా కొత్త చట్టం తీసుకొస్తామని ఇటీవలే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రకటించారు. 

18 రాష్ట్రాల చట్టాలను అధ్యయనం చేసి..

నిజాం రాజ్యంలో తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రెవెన్యూ చట్టాలు అమల్లో ఉండేవి. అనంతరం హైదరాబాద్‌ రాష్ట్రం ఏర్పడగా.. అవే చట్టాలు కొన్ని మార్పులతో కొనసాగాయి. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూ బోర్డు, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ విభాగాలు ఏర్పాటయ్యాయి. ఒక్కో దశలో కొన్ని చట్టాలు అమల్లోకి వచ్చాయి. మొత్తంగా రాష్ట్రంలో ప్రస్తుతం 122 రెవెన్యూ చట్టాలు ఉన్నాయి. వీటన్నింటినీ క్రోడీకరించి ఏకీకృత చట్టంగా రూపొందించాలని.. ప్రజలకు సులువుగా సేవలందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా ధరణి కమిటీ సభ్యులు దేశంలో రెవెన్యూ చట్టాలు విజయవంతంగా అమలవుతున్న రాష్ట్రాలపై దృష్టి పెట్టారు. 18 రాష్ట్రాల్లో అమల్లో ఉన్న చట్టాల నుంచి సారాంశం గ్రహిస్తున్నారు. రెవెన్యూ కోడ్, టైట్లింగ్‌ యాక్ట్‌ తదితరాలను అధ్యయనం చేస్తున్నారు. అయితే, సమగ్ర భూ సర్వే అనంతరమే హక్కులకు సాధికారత లభిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పోర్టల్‌ కన్నా సులువుగా, వేగవంతంగా సేవలు అందించేలా కొత్త వెబ్‌సైట్‌ను తీసుకురానున్నారు.

సమస్యలకు వివిధ దశల్లో పరిష్కార కేంద్రాలు 

రాష్ట్రంలో భూ సమస్యలకు పరిష్కార వేదికలు లేకపోవడం యజమానులకు ఇబ్బందికరంగా మారింది. ఆర్వోఆర్‌-2020 ద్వారా అంతకుముందు అమల్లో ఉన్న రెవెన్యూ కోర్టులను తొలగించారు. కనీసం సీసీఎల్‌ఏ స్థాయిలోనూ సమస్యల పరిష్కారానికి వీలు కల్పించలేదు. దీంతో పేరు మార్పులకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చట్టాల్లో మార్గదర్శకాలు లేక పార్ట్‌-బీలో చేర్చిన 11 లక్షల ఎకరాలకు పరిష్కారం లభించడం లేదు. సాదాబైనామా కింద 12 లక్షల ఎకరాలకు హక్కుల కల్పన సాధ్యం కావడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో ప్రత్యేకంగా ల్యాండ్‌ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు 

రానున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో కొత్త రెవెన్యూ బిల్లు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. 2020 ఆర్వోఆర్‌ చట్టానికి సవరణ కన్నా కొత్త చట్టం తీసుకురావడమే మేలని సర్కారు భావిస్తోంది. ధరణి పోర్టల్‌ మార్పుపైనా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. మా భూమి, భూ భారతి, భూమాత తదితర పేర్లను భూ చట్టాల నిపుణులు, ధరణి కమిటీ సభ్యులు సూచిస్తున్నట్లు సమాచారం.


ప్రభుత్వం దృష్టికి వచ్చిన కీలక సమస్యలు..

  • ఆర్వోఆర్‌-2020 చట్టం అమల్లోకి వచ్చాక భూ సమస్యలకు పరిష్కారం చూపే అథారిటీ లేకుండా పోయింది. 1971 చట్టం ప్రకారం తహసీల్దారు, ఆర్డీవో, జిల్లా కలెక్టర్, సీసీఎల్‌ఏ స్థాయిలో దరఖాస్తు చేసుకుని సమస్యకు పరిష్కారం పొందడానికి వీలుండేది. 
  • ప్రస్తుతం ఏ భూ సమస్యపై అయినా న్యాయం జరగాలంటే సివిల్‌ కోర్టును ఆశ్రయించక తప్పని పరిస్థితి. చిన్న, సన్నకారు రైతులు, గిరిజనులు, చిన్న చిన్న సమస్యలు తలెత్తినవారు కోర్టులను ఆశ్రయించలేకపోతున్నారు.
  • ధరణి పోర్టల్లో నాలుగు రకాల డీడ్స్‌ చేయడానికి మాత్రమే తొలుత అనుమతించారు. ఇప్పుడు అన్ని రకాల డీడ్స్‌ అమలు చేస్తున్నారు.
  • ధరణిలోని భూముల వివరాలకు, అటవీ, దేవాదాయ, వక్ఫ్‌ శాఖల వద్ద ఉన్న ప్రభుత్వ భూముల వివరాలకు పొంతన లేదు. నిషేధిత జాబితా(22-ఏ)లో ఉన్న ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్‌ చెల్లదు. అయితే, ధరణిలోని పలు మాడ్యూళ్లలో వచ్చే దరఖాస్తులకు పరిష్కారం పేరుతో నిషేధిత జాబితా నుంచి ప్రభుత్వ భూములను తొలగిస్తున్నారు. 
  • ధరణి రిజిస్ట్రేషన్‌ల అనంతరం లింక్‌ డాక్యుమెంట్ల వివరాలు కనిపించడం లేదు. భూముల వివరాలన్నీ పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్‌ పూర్తవుతోంది. దీనివల్ల రైతులు మరణించకున్నా మరణించినట్లు ధ్రువీకరణ పత్రాలు తెచ్చినవారికీ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని