Crop Loan Waiver: 2 నెలలు.. రూ.30 వేల కోట్లు!

రైతు సంక్షేమ పథకాలకు ఇప్పటి నుంచి సరిగ్గా 2 నెలల్లో కనీసం రూ.30 వేల కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వ అంచనా. ఆగస్టు 15లోగా రైతుల రూ.2 లక్షల్లోపు పంట రుణాల మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇంతకుముందే ప్రకటించారు.

Published : 15 Jun 2024 06:11 IST

రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమాకు అవసరం
రుణాల సేకరణకు ఉన్న అన్ని మార్గాల అన్వేషణ
రిజర్వు బ్యాంకును సంప్రదిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ఈనాడు - హైదరాబాద్‌

రైతు సంక్షేమ పథకాలకు ఇప్పటి నుంచి సరిగ్గా 2 నెలల్లో కనీసం రూ.30 వేల కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వ అంచనా. ఆగస్టు 15లోగా రైతుల రూ.2 లక్షల్లోపు పంట రుణాల మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇంతకుముందే ప్రకటించారు. వానాకాలం(ఖరీఫ్‌) పంటల సాగు సీజన్‌ ప్రారంభమవడంతో రైతుభరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. ఆగస్టు 13లోగా 30 లక్షల మందికి పైగా కర్షకులకు జీవితబీమా కల్పించే రైతుబీమా పథకానికి రూ.1,500 కోట్లకు పైగా ప్రీమియం సొమ్మును ఎల్‌ఐసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. 

బాండ్ల ద్వారా ఒకేసారి భారీగా

ప్రతినెలా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ.14 వేల కోట్ల ఆదాయం వస్తుండగా దానికి మించిన ఖర్చులున్నాయి. ఆ ఆదాయం నుంచి ఈ పథకాలకు నిధులు సర్దుబాటు చేయడం సాధ్యపడదని ఆర్థికశాఖ అంచనా. వారానికోమారు రూ.వెయ్యి కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల దాకా రుణాలను బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది. కానీ ఇలా తక్కువ మొత్తంలో కాకుండా ఒకేసారి రూ.10 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల దాకా సొమ్మును బాండ్ల ద్వారా సేకరించి రుణమాఫీ పథకానికి చెల్లించవచ్చా అని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పరిశీలిస్తోంది. ‘ఆర్థిక బాధ్యత-బడ్జెట్‌ నిర్వహణ’(ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితులకు లోబడి మాత్రమే బాండ్ల విక్రయం ద్వారా రుణాల సేకరణకు రిజర్వు బ్యాంకు అనుమతిస్తుంది. గత ఆర్థిక సంవత్సరం(2023-24)లో రాష్ట్రం ఈ పరిమితి కింద రూ.49,589 కోట్ల రుణాలను తీసుకుంది. వాటిలో 2023 ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకూ ఐదు నెలల్లో గత ప్రభుత్వం రూ.26,158 కోట్లను సేకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో రూ.50 వేల కోట్లకు మించి రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి లోబడి సేకరించే అవకాశాలున్నాయి. వీటి నుంచి గతేడాది మాదిరిగానే ఆగస్టులోగా రూ.40 వేల కోట్లను తీసేసుకుంటే మూడు పథకాలకు సర్దుబాటు చేయడం సాధ్యమని అంచనా. 2024 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు రూ.8,246 కోట్లను బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్రం సేకరించింది. మరో రూ.2 వేల కోట్లు ఈ నెల 18న బాండ్ల విక్రయం ద్వారా రానున్నాయి. వీటితో కలిపితే ఈ ఏడాది కోటాలో రూ.10 వేల కోట్లు అవుతున్నందున మరో రూ.30 వేల కోట్లను ఆగస్టులోగా తీసుకోవడానికి ఆర్‌బీఐ అంగీకరిస్తుందా అనేది కీలక ప్రశ్నగా మారింది. ప్రత్యామ్నాయ మార్గాలనూ రాష్ట్ర ప్రభుత్వం అన్వేషిస్తోంది. 

కార్పొరేషన్‌ పేరుతో వచ్చేనా..

కొత్తగా ‘రైతు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌’ను ఏర్పాటు చేసి దాని తరఫున రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి ఒకేసారి రూ.35 వేల కోట్ల వరకూ రుణం తీసుకునే అవకాశం ఉంటుందా అనే చర్చ కూడా సాగుతోంది. కార్పొరేషన్‌కు ఇంత భారీగా రుణం ఇవ్వాలంటే దానిని అదే సంస్థ తిరిగి చెల్లిస్తుందని.. దానికి వచ్చే ఆదాయ మార్గాలను సైతం స్పష్టంగా చూపాల్సి ఉంటుంది. ఒక సంస్థ లేదా ఒక పథకం పేరుతో ఇచ్చే రుణం సొమ్మును దానికి మాత్రమే వినియోగించాలని, అలా చేయని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వడం చెల్లదని ఇటీవల రిజర్వుబ్యాంకు వర్కింగ్‌ గ్రూప్‌ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో వీటితోపాటు రుణసేకరణకు ఉన్న ఇతర అవకాశాలేమిటని ప్రభుత్వం ఉన్నతస్థాయిలో చర్చ జరుపుతోంది. 


ఆగస్టు 15లోగా దశలవారీగా.. 

రుణమాఫీ సొమ్మును జులై 15 నుంచి ఆగస్టు 15 వరకూ దశలవారీగా తొలుత రూ.50 వేల లోపు, ఆ తర్వాత నిధుల లభ్యతను బట్టి రూ.75 వేలు, రూ. లక్ష... ఇలా పెంచుతూ బ్యాంకులకు జమచేసే విధానాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. రైతుల్లో 70 శాతం మందికి రూ.లక్షలోపే బాకీ ఉన్నట్లు అంచనా. వీరికి తొలిదశలో మాఫీచేసి మిగిలిన వారికి విడతలవారీగా ఆగస్టు 15 లోగా జమచేస్తే ఎలా ఉంటుందనే చర్చ సాగుతోంది. నిధుల లభ్యతపై స్పష్టత వచ్చాక రుణమాఫీకి అర్హులైన రైతుల గుర్తింపు, వారి తరఫున బ్యాంకులకు ప్రభుత్వ చెల్లింపు విధానం ఖరారవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని