Integrated Gurukula Schools: పేదింటి పిల్లలకు నాణ్యమైన విద్య

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలను అధునాతనంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది.

Updated : 24 Jun 2024 06:39 IST

సమీకృత గురుకుల పాఠశాల నమూనాలు సిద్ధం
సీఎం రేవంత్‌కు అందజేసిన ఆర్కిటెక్ట్‌లు

నమూనాలు పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. 
చిత్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలను అధునాతనంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. దీనిపై ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒక సమీకృత గురుకుల పాఠశాల(ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌)ను నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒకే సువిశాల ప్రాంగణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేసి.. పేద బిడ్డలకు నాణ్యమైన విద్య, వసతి సౌకర్యం కల్పించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. తద్వారా పోటీతత్వం పెరుగుతుందని, కుల, మత వివక్ష తొలగిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ సమీకృత పాఠశాలలను నిర్మించనున్నారు. పైలట్‌ ప్రాజెక్ట్‌గా కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో వీటిని నిర్మించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇప్పటికే ఆ రెండు చోట్లా 20 ఎకరాల చొప్పున భూమిని సర్కారు సేకరించింది. ఈ అంశంపై ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్కిటెక్ట్‌లు తాము రూపొందించిన నమూనాల నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు. పలు నమూనాలను పరిశీలించారు. నాణ్యమైన విద్యా బోధనకు వీలుగా తరగతి గదులతోపాటు, విద్యార్థులకు అన్ని వసతులుండేలా భవనాలు నిర్మించాలని ఆయన సూచించారు. అందుబాటులో ఉన్న స్థలాలకు అనుగుణంగా నమూనాలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌కు దీటుగా నిర్మించాలన్నారు.  రాష్ట్రమంతటా స్థలాలు అందుబాటులో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో వెంటనే ఇంటిగ్రేటెడ్‌ క్యాంపస్‌ల నిర్మాణం చేపట్టాలని సీఎం నిర్ణయించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని