Telangana Govt: నైపుణ్యాభివృద్ధికి శ్రీకారం

‘‘సాంకేతిక నైపుణ్యం, అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంటర్‌ స్థాయిలోనే విద్యార్థులకు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటీఐలను రూ.2,324 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నాం.

Published : 19 Jun 2024 06:10 IST

రూ.2,324 కోట్లతో 65 ఐటీఐలకు కొత్తరూపు
ఉపాధికి గల్ఫ్‌ దేశాలకు వెళ్లాలనుకునే వారికీ ఇక్కడ శిక్షణ ఇస్తాం
మన చదువులు అవుటాఫ్‌ సిలబస్‌గా మారిపోయాయి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నాలుగు అడ్వాన్స్‌డ్‌ టెక్నికల్‌ సెంటర్లకు శంకుస్థాపన
ఈనాడు - హైదరాబాద్‌

లాక్‌హీడ్‌-మార్టిన్‌ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,
మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి

‘‘సాంకేతిక నైపుణ్యం, అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంటర్‌ స్థాయిలోనే విద్యార్థులకు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటీఐలను రూ.2,324 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నాం. పదో తరగతి చదివి ఉపాధి కోసం గల్ఫ్‌దేశాలకు వెళ్లాలనుకునే వారినీ ఐటీఐల్లో చేర్పించుకుని.. అక్కడ ఏయే సంస్థలు, రంగాల్లో ఉపాధి అవకాశాలున్నాయో తెలుసుకుని వాటిల్లో శిక్షణ ఇవ్వనున్నాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐటీఐలను అధునాతన సాంకేతిక కేంద్రాలు(అడ్వాన్స్‌డ్‌ టెక్నికల్‌ సెంటర్స్‌)గా రూపొందిస్తున్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని మల్లేపల్లి ఐటీఐలో నిర్వహించిన నాలుగు కేంద్రాల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అక్కడ వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా దౌత్యపరంగా సంప్రదింపులు నిర్వహించి న్యాయం చేస్తుంది. ప్రస్తుతం పదోతరగతి చదవకుండానే ఉపాధి కోసం ఏజెంట్ల ద్వారా గల్ఫ్‌ దేశాలకు వెళ్లి అక్కడ కష్టాలు పడుతున్నారు. ఈ పరిస్థితి భవిష్యత్తులో ఎవరూ ఎదుర్కోకుండా మేం జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం, ఉపాధి లభించాలంటే పట్టా ఉంటే సరిపోదు.. సాంకేతిక నైపుణ్యం ఉండాలి. విశ్వవ్యాప్తంగా విద్యాబోధనలో అత్యాధునిక మార్పులుసంతరించుకుంటుంటే.. మనం మాత్రం 40, 50 ఏళ్ల క్రితం ఉన్న విధానాలు అనుసరిస్తూ అప్పటి విద్యను బోధిస్తున్నాం. దీంతో మన చదువులు అవుటాఫ్‌ సిలబస్‌గా మారిపోయాయి. ఇంటర్‌ చదవలేనివారు ఐటీఐలో చేరితే కొంతైనా విజ్ఞానం వస్తుందన్న భావనతో కొందరు తల్లిదండ్రులు పిల్లలను ఇందులో చేర్పిస్తున్నారు. ఐటీఐలను      అధునాతన విజ్ఞాన కేంద్రాలుగా మార్చాక వాటిల్లో చేరేందుకు విద్యార్థులు పోటీపడతారు’’ అని సీఎం చెప్పారు. 

ఇంజినీర్‌కు రూ.15 వేలు.. మేస్త్రీకి రూ.60 వేలు.. 

‘‘చదువున్నా సాంకేతిక నైపుణ్యం, అనుభవం లేకపోతే డిగ్రీ సర్టిఫికెట్ల ఉపయోగం అంతంత మాత్రమే. ఎందుకంటే నేను ఇల్లు కట్టించేప్పుడు సైట్‌ సూపర్‌వైజర్‌గా ఇద్దరిని నియమించుకుందామని అనుకున్నా. సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన నలుగురైదుగురు విద్యార్థులు వచ్చారు. నెలకు రూ.15వేలు జీతం ఇస్తే పనిచేస్తామన్నారు. అనుభవజ్ఞుల కోసం వాకబు చేస్తే ఒక మేస్త్రీ వచ్చాడు. నెలకు రూ.60వేలు ఇస్తే పనిచేస్తానన్నాడు. ఇది నా స్వీయ అనుభవం. సివిల్‌ ఇంజినీర్లు అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొంటే వారికి రూ.లక్షల్లో జీతాలొస్తాయి’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరించారు.

అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్ల అభివృద్ధిలో భాగస్వామి అయినందుకు టాటా టెక్నాలజీస్‌ ప్రతినిధి
సుశీల్‌ కుమార్‌కు జ్ఞాపిక బహూకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు

ఐటీఐలలో వర్చువల్‌ రియాల్టీ ప్రయోగశాలలు..: మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటీఐలలో వర్చువల్‌ రియాల్టీ ప్రయోగశాలలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ప్రభుత్వ ఐటీఐలలో వీటిని ఏర్పాటు చేయడం ద్వారా విద్యా, విజ్ఞాన కేంద్రాలుగా మారనున్నాయని ఇందుకోసం టాటా టెక్నాలజీస్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. రోబోటిక్స్, కృత్రిమ మేధ, వర్చువల్‌ రియాల్టీ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు నేర్పించనున్నామని వివరించారు. యువతకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా త్వరలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. టాటా టెక్నాలజీస్‌ ప్రతినిధి సుశీల్‌ కుమార్, కార్మికశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రాణికుముదిని, కార్మికశాఖ సంచాలకులు కృష్ణ ఆదిత్య, జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్, నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్‌ హుస్సేన్, ఎమ్మెల్సీ రహమత్‌ బేగ్, కాంగ్రెస్‌ నేత ఫిరోజ్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని