Telangana News: ముందుమాట తెచ్చిన ముప్పు

ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు వాచకం పాఠ్య పుస్తకాలతోపాటు అభ్యాస దీపికల్లో ముద్రించిన ‘ముందుమాట’ వివాదాస్పదం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

Published : 15 Jun 2024 06:10 IST

ఎస్‌సీఈఆర్‌టీ సంచాలకురాలు రాధారెడ్డిపై బదిలీ వేటు
ముద్రణ విభాగం నుంచి సంచాలకుడు శ్రీనివాసాచారిని తప్పించిన సర్కారు
ఈనాడు - హైదరాబాద్‌

ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు వాచకం పాఠ్య పుస్తకాలతోపాటు అభ్యాస దీపికల్లో ముద్రించిన ‘ముందుమాట’ వివాదాస్పదం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) సంచాలకురాలు రాధారెడ్డిపై బదిలీ వేటు వేసింది. ఆమెను ప్రాధాన్యం లేని సమగ్ర శిక్ష సహాయ రాష్ట్ర ప్రాజెక్టు అధికారి(ఏఎస్‌పీడీ) పోస్టుకు బదిలీ చేసింది. ప్రస్తుతం సమగ్ర శిక్ష విభాగం ఏఎస్‌పీడీగా ఉన్న రమేశ్‌ను ఎస్‌సీఈఆర్‌టీ సంచాలకుడిగా నియమించింది. ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణ విభాగం సంచాలకుడిగా, మోడల్‌ స్కూల్స్‌ అదనపు సంచాలకుడిగా ఉన్న శ్రీనివాసాచారిపైనా చర్యలు తీసుకుంది. ఆయన్ను ముద్రణ విభాగం నుంచి తప్పించింది. ప్రస్తుతం రెసిడెన్షియల్‌ సొసైటీ కార్యదర్శిగా ఉన్న సీహెచ్‌.రమణ కుమార్‌కు ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణ విభాగం సంచాలకుడిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.   మరోవైపు తెలుగు పాఠ్య పుస్తకాల్లో ముందుమాట వివాదం రేపిన నేపథ్యంలో ఆ పేజీ కనిపించకుండా స్టిక్కర్‌ అతికించాలని తొలుత భావించిన విద్యాశాఖ తాజాగా తుది నిర్ణయాన్ని ప్రకటించింది. స్టిక్కర్‌ వేయడం కంటే ముందుమాట పేజీని చించి, ముఖచిత్రం తర్వాత పేజీలో క్యూఆర్‌ కోడ్‌ ఉన్న దానిపై అతికించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు