Dangerous Dog Breeds: విదేశీ జాతి కుక్కల దిగుమతుల నిషేధంపై హైకోర్టు స్టే

క్రూరమైన, ప్రమాదకరమైన 25 రకాల విదేశీ జాతి కుక్కల దిగుమతులు, పెంపకంపై నిషేధం విధిస్తూ కేంద్రం జారీచేసిన సర్క్యులర్‌ అమలును నిలిపివేస్తూ శుక్రవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 15 Jun 2024 04:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: క్రూరమైన, ప్రమాదకరమైన 25 రకాల విదేశీ జాతి కుక్కల దిగుమతులు, పెంపకంపై నిషేధం విధిస్తూ కేంద్రం జారీచేసిన సర్క్యులర్‌ అమలును నిలిపివేస్తూ శుక్రవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. ప్రమాదకరమైన, క్రూరమైన కుక్కలుగా పేర్కొంటూ 25 రకాల విదేశీ జాతి కుక్కల దిగుమతులు, బ్రీడింగ్, పెంపకం, విక్రయాలపై నిషేధం విధిస్తూ కేంద్ర పశుసంవర్ధకశాఖ మార్చి 12న జారీ చేసిన సర్క్యులర్‌ను సవాలు చేస్తూ ఫరీదున్నీసా హుమా, ఈస్తర్‌ చౌదరితో పాటు రెండు స్వచ్ఛంద సంస్థలు పిటిషన్‌ దాఖలుచేశాయి. దీనిపై శుక్రవారం జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పి.శ్రీరమ్య వాదనలు వినిపిస్తూ ఇది శునకాల యజమానుల, పెంపకందారుల హక్కులకు భంగం కలిగిస్తుందన్నారు. అంతేకాకుండా కుక్కల పెంపకంపై అనవసరమైన ఆందోళనలను కలిగిస్తుందని పేర్కొన్నారు. జంతు ప్రేమికులుగా శునకాలను పెంచుకుంటుంటారని, దీనివల్ల ఇతరులకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. పిటిషనర్లు జంతు పునరావాస కార్యక్రమాలు చేపడుతుంటారని, అంతేగాకుండా అమెరికన్‌ బుల్‌డాగ్‌ వంటి కుక్కల పెంపకాన్ని చేపడుతున్నారని, ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా కేంద్రం వాటిని నిషేధించిందన్నారు. ఏకపక్షంగా జారీ చేసిన సర్క్యులర్‌ను రద్దు చేయాలని కోరారు. ఇప్పటికే కర్ణాటక, మద్రాసు, దిల్లీ హైకోర్టులు సర్క్యులర్‌ అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశాయన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ కుక్క కాటువల్ల పలువురు మృతి చెందుతున్నారని, ఇక్కడివి కాకుండా ఇంకా విదేశీ శునకాలు అవసరమా అని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జులై 5కి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని