Ts High Court: న్యాయమూర్తికే నోటీసు ఇస్తారా? ఇదేం ప్రవర్తన?.. న్యాయవాదిపై హైకోర్టు ఆగ్రహం

ఒక కేసు విచారణ సందర్భంగా న్యాయవాది అభ్యంతరకరంగా ప్రవర్తించడంతోపాటు ఏకంగా న్యాయమూర్తికే నోటీసులు జారీ చేయడంపై శుక్రవారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated : 04 Feb 2023 07:26 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఒక కేసు విచారణ సందర్భంగా న్యాయవాది అభ్యంతరకరంగా ప్రవర్తించడంతోపాటు ఏకంగా న్యాయమూర్తికే నోటీసులు జారీ చేయడంపై శుక్రవారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యాటక శాఖకు చెందిన కేసులో విచారణ సందర్భంగా జస్టిస్‌ మాధవిదేవి చేసిన సూచనలపై న్యాయవాది బాలముకుంద్‌రావు న్యాయమూర్తితో వాగ్వివాదానికి దిగడంతోపాటు కోర్టు హాలు నుంచి బయటికి వెళ్లిపోయారు. దీనిపై హైకోర్టు సుమోటో కోర్టు ధిక్కరణగా పరిగణనలోకి తీసుకుంది. ఈ పిటిషన్‌పై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. నోటీసును ఉపసంహరించుకుని చేసిన చర్య తప్పని అఫిడవిట్‌ దాఖలు చేయకుండా తన చర్యను సమర్థించుకోవడానికి ప్రయత్నించిన న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవాద వృత్తి నుంచి బహిష్కరించడంతోపాటు క్రిమినల్‌ కోర్టు ధిక్కరణ కింద జైలుకు పంపుతామని హెచ్చరించింది. కోర్టు ధిక్కరణ కింద శిక్ష 6 నెలలుగానే పరిగణనలోకి తీసుకోబోమని, అంతకుమించి జైలుశిక్ష విధిస్తామని పేర్కొంది. 40 ఏళ్ల సీనియారిటీ ఉన్న న్యాయవాదిగా ఈ వృత్తిలోకి వచ్చే న్యాయ విద్యార్థులకు ఏం సందేశమిస్తారని నిలదీసింది. న్యాయమూర్తికి నోటీసు ఇచ్చి.. సమాధానం ఇవ్వకపోతే చర్య తీసుకుంటానంటూ నోటీసు ఇవ్వడం చరిత్రలో చూడలేదంది. ఈ దశలో అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ జోక్యం చేసుకుంటూ గతంలో కూడా కోర్టులో అనుచితంగా ప్రవర్తించిన సందర్భాల్లో కోర్టు ధిక్కరణ కేసులు దాఖలైనట్లు చెప్పారు. మధ్యలో న్యాయవాది వివరణ ఇవ్వబోగా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తిగా వినకుండా అడ్డుపడుతూ చేసిన తప్పును సమర్థించుకోవడానికి చూస్తున్నారని ఆక్షేపించింది. ఒక్క అవకాశం ఇస్తున్నామని, బేషరతుగా క్షమాపణ కోరుతూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని, లేని పక్షంలో కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ విచారణను వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని