Junior doctors protest: రాష్ట్రవ్యాప్తంగా జూనియర్‌ డాక్టర్ల సమ్మె

రాష్ట్రవ్యాప్తంగా జూనియర్‌ డాక్టర్లు సోమవారం సమ్మెలో పాల్గొన్నారు. గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా ప్రతినెలా   స్టైపెండ్‌ చెల్లింపు సహా ఎనిమిది ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జూనియర్‌ డాక్టర్లు(జూడాలు).. సోమవారం విధులు బహిష్కరించారు.

Published : 25 Jun 2024 06:11 IST

ఓపీ సేవలు, తరగతుల బహిష్కరణ
మంత్రితో అసంపూర్తిగా ముగిసిన చర్చలు

గాంధీ ఆసుపత్రి వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్న జూనియర్‌ వైద్యులు

ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే, గాంధీ ఆసుపత్రి, సుల్తాన్‌బజార్‌: రాష్ట్రవ్యాప్తంగా జూనియర్‌ డాక్టర్లు సోమవారం సమ్మెలో పాల్గొన్నారు. గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా ప్రతినెలా   స్టైపెండ్‌ చెల్లింపు సహా ఎనిమిది ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జూనియర్‌ డాక్టర్లు(జూడాలు).. సోమవారం విధులు బహిష్కరించారు. వైద్య కళాశాలల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, వరంగల్‌ కేఎంసీ సహా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో జూనియర్‌ డాక్టర్లు తరగతులను బహిష్కరించి.. సమ్మెలో పాల్గొన్నారు. గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా వైద్య కళాశాల భవనం ఎదుట బైఠాయించి.. సమస్యలను పరిష్కరించాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. సమ్మెలో భాగంగా ఓపీ సేవలను పూర్తిగా బహిష్కరించగా.. అత్యవసర వైద్య సేవలను మాత్రం కొనసాగించారు. 

మంత్రితో చర్చలు..

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహతో సచివాలయంలో జూడాల ప్రతినిధులు సమావేశమై తమ డిమాండ్లపై చర్చించారు. వాటిపై వివిధ విభాగాలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. దీంతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సోమవారం రాత్రి వైద్యవిద్య డైరెక్టర్‌(డీఎంఈ) ఎన్‌.వాణితో జూడాల ప్రతినిధులు జరిపిన చర్చలూ విఫలం కావడంతో సమ్మె కొనసాగుతుందని ప్రకటించారు. 

ప్రతినెలా స్టైపెండ్‌ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని జూడాలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్‌ ఛానెల్‌ ఏర్పాటు చేసి ప్రతినెలా స్టైపెండ్‌ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఏళ్లుగా కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. పెరుగుతున్న మెడిసిన్‌ సీట్లకు అనుగుణంగా హాస్టళ్ల వసతి పెరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించకపోవడంతో భయం భయంగా వైద్యసేవలు అందించాల్సి వస్తోందని తెలిపారు. కాకతీయ వైద్య కళాశాలలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు. వైద్య కళాశాలల్లో జూడాలకు కనీస సదుపాయాలు లేవన్నారు. మంత్రితో భేటీ అనంతరం జూనియర్‌ డాక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీహర్ష మాట్లాడుతూ స్టైపెండ్, విధుల్లో భద్రత, కేఎంసీలో రోడ్ల మెరుగు సహా వివిధ అంశాలపై చర్చల్లో స్పష్టత రాలేదని పేర్కొన్నారు.

సేవలకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు

జూడాల సమ్మె నేపథ్యంలో ఆసుపత్రుల్లో వైద్యసేవలకు అంతరాయం కలగకుండా వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వైద్యుల సెలవులను రద్దు చేసింది.  ఓపీ సేవలకు అంతరాయం కలగకుండా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు ఏర్పాట్లు చేశారు. సోమవారాల్లో ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో అవుట్‌పేషెంట్ల సంఖ్య భారీగా ఉంటున్న నేపథ్యంలో.. వైద్యులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి సేవలందించారు.  సెలవుల్లో వెళ్లిన వైద్యులందరినీ వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించినట్లు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎం.రాజారావు వెల్లడించారు. కోఠిలోని ప్రభుత్వ ఈఎన్‌టీ, సుల్తాన్‌బజార్‌ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల్లో వైద్యసేవల్లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు సూపరింటెండెంట్లు డా.శంకర్, డా.రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. కాగా, జూడాల సమ్మెకు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) మద్దతు ప్రకటించింది. వారి సమస్యలను పరిష్కరించాలని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డా.కాళీప్రసాద్‌రావు ప్రభుత్వాన్ని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని