Ramchander: పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో రామ్‌చందర్‌ సస్పెన్షన్‌

పశు సంవర్ధకశాఖ మాజీ డైరెక్టర్‌; గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మాజీ ఎండీ, పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో సబావత్‌ రామ్‌చందర్‌ను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 12 Jun 2024 04:41 IST

అనిశా దర్యాప్తు నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులు

ఈనాడు,హైదరాబాద్‌: పశు సంవర్ధకశాఖ మాజీ డైరెక్టర్‌; గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మాజీ ఎండీ, పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో సబావత్‌ రామ్‌చందర్‌ను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గొర్రెలు, మేకల పంపిణీ పథకంలో అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ (అనిశా) అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌సిన్హా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మే నెల 31 తేదీ నుంచి సస్పెన్షన్‌ అమల్లోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో వెల్లడించారు. విచారణ కొనసాగుతున్నందున ముందస్తు అనుమతి లేకుండా హైదరాబాద్‌ విడిచి వెళ్లరాదని ఆయన్ను ఆదేశించారు. 

మూడు పోస్టులకు ఇన్‌ఛార్జుల నియామకం

రామ్‌చందర్‌ సస్పెన్షన్‌ నేపథ్యంలో పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో పోస్టుతో పాటు మరో రెండు పోస్టులకు ఇన్‌ఛార్జులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు సంచాలకురాలు సీహెచ్‌ మల్లేశ్వరిని పశుగణాభివృద్ధి సంస్థ ఇన్‌ఛార్జి సీఈవోగా నియమించింది. పశుసంవర్ధక శాఖ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌సిన్హాకు బాధ్యతలు అప్పగించింది. ఇటీవలే అదనపు సంచాలకునిగా పదోన్నతి పొందిన సుబ్బారాయుడిని పశు వైద్య మండలి రిజిస్ట్రార్‌గా నియమించింది. ఆయనకే రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఇన్‌ఛార్జి ఎండీ బాధ్యతలు అప్పగించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు అదనపు సంచాలకునిగా సుబ్బారాయుడికి 2016 ఆగస్టు మూడో తేదీ నుంచి పదోన్నతి వర్తింపజేస్తూ మరో ఉత్తర్వునిచ్చింది. శాఖలో అందరికంటే సీనియర్‌ అయిన తనకు పదోన్నతిలో జాప్యం జరిగిందంటూ సుబ్బారాయుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రభుత్వం డీపీసీ నిర్వహించి ఇటీవలే పదోన్నతి కల్పించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని