CM KCR: బియ్యం కాదు.. వడ్లే కొనాలి

కేంద్రం ధాన్యం సేకరణ విషయంలో కుంటి సాకులు చెబుతోంది. యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలి. పంజాబ్‌లో బియ్యానికి కాకుండా.. ధాన్యానికే కనీస మద్దతు ధర నిర్ణయించి, సేకరిస్తున్నారు. తెలంగాణలో కూడా అలాగే చేయాలి. మేం ధాన్యమే ఇస్తాం.. ఏ బియ్యం చేసుకుంటారో మీ ఇష్టం.

Updated : 22 Mar 2022 04:26 IST

లేని పక్షంలో ఎంతకైనా తెగిస్తాం

ఇండియా గేట్‌ ముందు ధాన్యం పారబోయడానికీ వెనుకాడబోం

తెలంగాణ ప్రజలతో పెట్టుకోవద్దని ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నా

సీఎం కేసీఆర్‌ 

ఈనాడు - హైదరాబాద్‌

కేంద్రం ధాన్యం సేకరణ విషయంలో కుంటి సాకులు చెబుతోంది. యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలి. పంజాబ్‌లో బియ్యానికి కాకుండా.. ధాన్యానికే కనీస మద్దతు ధర నిర్ణయించి, సేకరిస్తున్నారు. తెలంగాణలో కూడా అలాగే చేయాలి. మేం ధాన్యమే ఇస్తాం.. ఏ బియ్యం చేసుకుంటారో మీ ఇష్టం.

- సీఎం కేసీఆర్‌

కేంద్ర ప్రభుత్వం పంజాబ్‌ తరహాలో తెలంగాణలో పండించిన వరి ధాన్యం మొత్తం కొనాల్సిందేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. మొత్తం ధాన్యం సేకరించే వరకు ఉద్యమపంథాలో ఎంతటి పోరాటానికైనా సిద్ధమని తెలిపారు. మంగళవారం మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆహారశాఖ మంత్రిని కలిసి, మెమోరాండం అందజేస్తుందని, వాళ్లు సమ్మతిస్తే సరే, లేదంటే కేంద్రంతో యుద్ధానికి, పార్లమెంటు ముందు వడ్లు పారబోయడానికీ వెనుకాడబోమని పేర్కొన్నారు. పంజాబ్‌, హరియాణా మాదిరిగా దేశవ్యాప్తంగా ఒకే ధాన్యం సేకరణ విధానం ఉండాలన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో తెరాస పార్లమెంటరీ, శాసనసభ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘‘కేంద్రం మొండి వైఖరిని ముందే గుర్తించి, ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాం. దీంతో వరి 55 లక్షల ఎకరాల నుంచి 30 లక్షల ఎకరాలకు తగ్గింది. ధాన్యం మొత్తం కొనాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. ‘వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌’ అని చెబుతున్న కేంద్రం. ధాన్యం విషయంలో ఆ విధానం ఎందుకు అమలు చేయదు? వందశాతం సేకరణ విధానం వచ్చే వరకు పోరాటం చేస్తాం.

ఆషామాషీగా ఉండదు.. 

ఈసారి మా పోరాటం ఆషామాషీగా ఉండదు. యాక్షన్‌ ఓరియెంటెడ్‌గా ఉంటది. పెద్ద ఎత్తున ఉద్యమించడం తెరాసకు, తెలంగాణ ప్రజలకు వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణ ఉద్యమ స్థాయిలో పోరాటం చేస్తాం. ఉద్యమవీరులం మేం. తెలంగాణ ప్రజలతో పెట్టుకోవద్దని ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నా. కేంద్రం నిర్ణయం తీసుకునే వరకు విశ్రమించే ప్రశ్నే లేదు. తెరాస చేపట్టే రైతు ధర్నాకు అందరూ కలిసి రావాలి.

రిజర్వేషన్లపైనా నిలదీస్తాం 

ధాన్యం వద్దే ఆగిపోం. రిజర్వేషన్ల వ్యవహారంపైనా నిలదీస్తాం. రిజర్వేషన్లు 50 శాతం కంటే ఎక్కువ ఉండొద్దని రాజ్యాంగంలో లేదు. ప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతానికి మించవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. దీనిపై శాసనసభ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించింది. ఈ తీర్మానంపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసి పంపించినా అతీగతీ లేదు. బీసీల కులగణనను పట్టించుకోవడం లేదు.

ప్రజలు మార్పు కోరుతున్నారు

యూపీఏ కంటే భాజపా దుర్మార్గమైన పాలన చేస్తోంది. విద్వేషాలు సృష్టించి రాజకీయంగా ఉపయోగించుకునే దారుణం నెలకొని ఉంది. దీని వల్ల భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. దేశవ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. దేశం బాగుపడాలంటే భాజపాను గద్దె దించాలని భావిస్తున్నారు. ప్రగతిశీల విధానంలో పని చేసే ప్రభుత్వం రావాలి. కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్వహిస్తాం. భాజపా పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. యూపీలో భాజపా బలం తగ్గుతుందని గతంలోనే చెప్పాను. గతంలో 312కు గాను 255 స్థానాలకు భాజపా పరిమితమైంది. ఉత్తరాఖండ్‌లోనూ 10 సీట్లు తగ్గాయి. ఇది దేనికి సంకేతమో భాజపా ఆలోచించుకోవాలి. ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపులో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. విద్యార్థులను ముందే అప్రమత్తం చేయలేదు’’ అని సీఎం కేసీఆర్‌ ఆన్నారు.


‘‘ఎనిమిదేళ్లు దాటింది.. భాజపా చేసిందేమీ లేదు. ఏ రంగంలో చూసినా దేశం తిరోగమనంలోనే ఉంది. భాజపా ఇచ్చిన ఒక్క హామీనీ నిలబెట్టుకోలేదు. ఎన్నికలు వచ్చినప్పుడు మాయ చేయడం తప్ప ఏమీ లేదు. కేంద్రం చెప్పిన ఒక్క వాగ్దానం కూడా నెరవేరలేదు. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు.. ఇవ్వలేదు. కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమలు తీసుకురాలేదు. యువత, నిరుద్యోగ ఇండెక్స్‌లో సిరియా కంటే అధ్వానంగా ఉన్నాం.’’

‘‘11 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేస్తారు కానీ ధాన్యం కొనుగోళ్లకు 11 వేల కోట్లు లేవా? ఆహారభద్రత బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూస్తోంది. కరోనాలాంటిది వస్తుందని మనం ఊహించామా? వారం పాటు దేశానికి అన్నం పెట్టే అవకాశం ఉండొద్దా? అందుకే తగినంత నిల్వ పెట్టుకోవాలి. ఇది రైతుల జీవన్మరణ సమస్య. రైతాంగానికి రాజ్యాంగ రక్షణ లభించేలా కొత్త చట్టాలను తీసుకుని రావాలి. ఈ విషయంలో కేంద్రానికి సహకరిస్తాం.’’

-ముఖ్యమంత్రి కేసీఆర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని