Telangana Police: గాడితప్పిన పోలీసు..

కేసుల విచారణలో.. సాంకేతికత వినియోగంలో తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది.

Published : 24 Jun 2024 05:16 IST

అవినీతి, వివాదాలతో శాఖ ప్రతిష్ఠకు భంగం
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పలువురు సీనియర్‌ అధికారుల అరెస్టు
ఎస్సై భవానీసేన్‌ అత్యాచార  వ్యవహారంతో తాజాగా కలకలం

ఈనాడు, హైదరాబాద్‌: కేసుల విచారణలో.. సాంకేతికత వినియోగంలో తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. కానీ కొందరి తీరుతో ఆ కీర్తి క్రమంగా మసకబారుతోంది. పోలీసుశాఖ పనితీరుపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నా.. బదిలీల విషయంలో వృత్తి నైపుణ్యానికే ప్రాధాన్యమిస్తున్నా కొందరు అధికారుల ప్రవర్తన మారడంలేదు. అవినీతి, భూ, ఆస్తి తగాదాల కేసుల్లో చిక్కుకొని తమతోపాటు శాఖ పరువునూ అభాసుపాలు చేస్తున్నారు. తాజాగా ఎస్సై భవానీసేన్‌ అత్యాచార వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  

నేతల అండతో... 

పోలీసుశాఖపై ఆరోపణలు కొత్తేమీ కాదు. భూవివాదాల్లో తలదూర్చడం, బెదిరింపులకు పాల్పడటం వంటివి మొదటి నుంచీ ఉన్నాయి. ప్రస్తుతం అవినీతి స్థాయి దాటిపోయి అత్యాచారాల వరకూ దిగజారింది. ఒకప్పుడు అక్రమాలకు పాల్పడ్డట్లు బయటపడితే శాఖాపరమైన చర్యలు తీసుకునేవారు. ఇందుకోసం పోలీసుశాఖలో ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవి. ముఖ్యంగా స్పెషల్‌ బ్రాంచి సిబ్బంది ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పిస్తూ ఉంటారు. వీటి ఆధారంగా ఎవరైనా అధికారి ప్రవర్తన శ్రుతి మించుతోందని గ్రహిస్తే వారిని బదిలీ చేయడం, కొంతకాలం పక్కనపెట్టడం, అంతర్గత విచారణ చేపట్టడం చేసేవారు. వీటితో తమను గమనిస్తున్నారన్న భయం ప్రతి సిబ్బందిలోనూ ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎస్పీ, కమిషనర్లను సైతం కిందిస్థాయి సిబ్బంది లెక్క చేయడం లేదు. దీనికి కారణం రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయన్న ధీమానే. ఉదాహరణకు ఒక విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారికి చెందిన స్థలాన్ని కబ్జా చేసిన వ్యవహారంలో ఎస్సై కృష్ణపై హైదరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు చేయాలని ఎంత ప్రయత్నించినా దొరకలేదు. నగర శివార్లలోని ఓ ఎమ్మెల్యే అతనికి ఆశ్రయం కల్పించారని, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులపై ఒత్తిడి చేశారని తేలింది. 

పట్టులేని ఉన్నతాధికారులు

ఈ మధ్యకాలంలో చాలామంది ఎస్పీ స్థాయి అధికారుల పనితీరు కూడా విమర్శలకు దారితీస్తోంది. నేతల అండతో కావలసిన చోట పోస్టింగ్‌ దక్కించుకొని విధుల నిర్వహణ గాలికొదిలేస్తున్నారనే ఆరోపణలకు కొదవలేదు. ఉదాహరణకు ఒక ఎస్పీ క్యాంప్‌ కార్యాలయానికే పరిమితమై.. కార్యాలయం మొహం కూడా చూడరని పోలీసుశాఖలో అందరికీ తెలుసు. అయినప్పటికీ ఆయన వరుసగా మూడు మంచి పోస్టింగులు దక్కించుకున్నారు. ఇక ఎస్సై భవానీసేన్‌పై గతంలోనూ లైంగిక వేధింపులకు సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా దీనిపై పెద్దఎత్తున చర్చ కూడా జరిగింది. స్పెషల్‌ బ్రాంచి నివేదికలను ఉన్నతాధికారులు పట్టించుకోలేదని వినికిడి. 

ప్రభుత్వం సీరియస్‌

పోలీసుశాఖలో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన బదిలీల్లో విధుల్లో అలసత్వం ప్రదర్శించే వారిని, స్థిరాస్తి వ్యాపారుల నుంచి మామూళ్లు దండుకుంటున్నారని పేరున్న ఒకరిద్దరు ఎస్పీలను అప్రాధాన్య పోస్టుల్లోకి మార్చింది. ఎస్సై భవానీసేన్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలంటూ ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితి తీవ్రతను గమనించి పోలీసుశాఖను చక్కదిద్దేందుకు ఉన్నతాధికారులు మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


లెక్కలేని వివాదాలు

  • నారాయణపేట జిల్లా ఊట్కూరు పోలీసుస్టేషన్‌ పరిధిలో భూవివాదం కారణంగా దాయాదుల మధ్య గొడవ మొదలైంది. ‘కొట్టి చంపుతున్నారు.. కాపాడండి’ అంటూ బాధితులు డయల్‌-100కు ఫోన్‌ చేశారు. ఎస్సై బిజ్జ శ్రీనివాసులు మాత్రం స్పందించలేదు. దాదాపు 4 గంటల తర్వాత ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోగా.. అప్పటికే ఓ వ్యక్తి మరణించారు. 
  • భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్సై భవానీసేన్‌ తుపాకీతో బెదిరించి మరీ మహిళా హెడ్‌కానిస్టేబుల్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. గతంలోనూ ఇలాంటి ఘటనలకు పాల్పడ్డ చరిత్ర ఆయనకు ఉంది. 
  • హైదరాబాద్‌ సీసీఎస్‌లో ఏసీపీగా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయ్యారు. గతంలోనూ ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోక పోగా.. కీలకమైన కేసుల బాధ్యతలు అప్పగించారు. ఇదే సీసీఎస్‌లో సీఐ సుధాకర్‌ రూ.3 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. 
  • ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం పోలీసుశాఖకు మాయని మచ్చలా మారింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు పోలీసు అధికారులు అరెస్టు కాగా.. విశ్రాంత ఐజీ స్థాయి అధికారి కీలక నిందితుడిగా ఉన్నారు. చివరకు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్‌ చేసినట్లు నిందితులు ఒప్పుకోవడం సంచలనంగా మారింది. ఎన్నికల సందర్భంగా ఒక ఎస్పీ స్థాయి అధికారే స్వయంగా డబ్బు తరలింపునకు ఎస్కార్ట్‌ ఏర్పాటు చేశారని దర్యాప్తులో వెల్లడైంది. 
  • విశ్రాంత ఐఏఎస్‌ అధికారి భన్వర్‌లాల్‌ ఇంటి కబ్జా కేసులో ఐపీఎస్‌ అధికారి నవీన్‌పై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సీసీఎస్‌ పోలీసులు ఆయన్ను విచారించి వాంగ్మూలం నమోదు చేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని