Sheep Scam: ఇంతకీ.. గొర్రెలెన్ని? మేకలెన్ని?

రాష్ట్రంలో మొత్తం గొర్రెలు, మేకలు ఎన్నున్నాయో ప్రభుత్వం సమగ్ర సమాచారం సేకరించనుంది. దీనిపై జిల్లాల వారీగా సర్వే చేయాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో 2017 నుంచి గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం కింద రెండు విడతల్లో లబ్ధిదారులకు గొర్రెలు, మేకలు అందజేసింది.

Published : 23 Jun 2024 05:22 IST

మందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు అనుమానాలు!
వివరాల సేకరణకు ప్రభుత్వ నిర్ణయం
నెలాఖరు వరకు పక్కా సమాచారం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మొత్తం గొర్రెలు, మేకలు ఎన్నున్నాయో ప్రభుత్వం సమగ్ర సమాచారం సేకరించనుంది. దీనిపై జిల్లాల వారీగా సర్వే చేయాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో 2017 నుంచి గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం కింద రెండు విడతల్లో లబ్ధిదారులకు గొర్రెలు, మేకలు అందజేసింది. దాదాపు 90 లక్షల మేర పంపిణీ చేసినట్లు నాటి అధికారులు గణాంకాలు నమోదు చేశారు. ఈ పథకంలో అక్రమాలు జరిగాయని ప్రస్తుత ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖ(అనిశా)తో విచారణకు ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే 9 మంది అరెస్టయ్యారు. మరోవైపు ఈడీ విచారణ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని గొర్రెలు, మేకలు పంపిణీ చేశారు? వాటితో ఎంతమందికి లబ్ధి కలిగింది? తదితర వివరాలపై ప్రభుత్వం ఆరా తీసింది. అప్పట్లో నమోదు చేసిన గణాంకాలకు, వాస్తవ లెక్కలకు పొంతన లేదని, అసలు రాష్ట్రంలో ఎన్ని గొర్రెలు ఉన్నాయనే సమాచారం కూడా కరవైందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఎక్కువ జీవాల సంఖ్య చూపుతూ నట్టల నివారణ, టీకాలు ఇతర మందుల కొనుగోళ్ల పేరిట భారీగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో గ్రామాల వారీగా గొర్రెలు, మేకలు ఎన్ని ఉన్నాయి? వాటి యజమానులు, వారి తండ్రి పేరు ఏంటీ? యాదవ, కురుమలు కాకుండా ఇతర సామాజిక వర్గాల వారికి కూడా ఉన్నాయా? తదితర వివరాలు ఇవ్వాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులను గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీ సుబ్బరాయుడు వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. అందుకు ఈ నెలాఖరు వరకు గడువు విధించారు. సమాచారం పక్కాగా ఇవ్వాలని, పశు వైద్యులు, సిబ్బంది గొర్రెలు, మేకల కాపర్ల వద్దకు వెళ్లి వివరాలు తీసుకోవాలని సూచించారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు