cyber crime: సైబర్‌ వలతో విలవిల.. మాతృభూమికి రప్పించడం ఎలా?

ఉద్యోగాలపై ఆశతో కంబోడియా వెళ్లి.. అక్కడి సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని నరకం చూస్తున్న తెలంగాణ యువత రక్షణపై అధికారులు దృష్టి సారించారు.

Updated : 17 Jun 2024 07:40 IST

కంబోడియాలో నేరస్థుల చెరలో తెలంగాణ యువత
వారి రక్షణపై అధికారుల దృష్టి
సాధ్యాసాధ్యాలపై ఆరా

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగాలపై ఆశతో కంబోడియా వెళ్లి.. అక్కడి సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని నరకం చూస్తున్న తెలంగాణ యువత రక్షణపై అధికారులు దృష్టి సారించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 24 మందిని ఆ రాష్ట్ర పోలీసులు సైబర్‌ నేరస్థుల చెరనుంచి విడిపించి వెనక్కి రప్పించారు. తెలంగాణకు చెందిన యువకులకు కూడా విముక్తి కల్పించాలని ఇక్కడి అధికారులు నిర్ణయానికి వచ్చారు. అందుకు గల అవకాశాలపై అన్వేషణ సాగిస్తున్నారు. ఉపాధి వేటలో ఉన్న యువతకు అంతర్జాతీయ సైబర్‌ నేరగాళ్లు గాలం వేస్తూ వారిని తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. అనంతరం వారికి నరకం చూపిస్తున్న విషయం తెలిసిందే. మొదట సైబర్‌ నేరస్థులు.. సింగపూర్‌తోపాటు ఇతర ఆగ్నేయాసియా దేశాల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఉన్నాయని నిరుద్యోగ యువతను ముగ్గులోకి దింపుతున్నారు. ఇలా చిక్కిన యువకులను కంబోడియా, మయన్మార్‌ వంటి దేశాలకు తరలిస్తూ వారితో సైబర్‌ నేరాలు చేయిస్తున్నారు. బయటకు వెళ్లేందుకు అవకాశం లేకుండా వారి పాస్‌పోర్టులు, ఇతర ధ్రువీకరణ పత్రాలను లాక్కుంటున్నారు. పారిపోయేందుకు ప్రయత్నిస్తే చిత్రహింసలు పెడుతున్నారు. ఇరుకిరుకు గదుల్లో ఉంచుతూ వారితో ప్రతిరోజూ 15 గంటలకు పైగా నేరాలు చేయిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఉండే అమ్మాయిల ఫొటోలు డౌన్‌లోడ్‌ చేయడం, వాటి ఆధారంగా తప్పుడు ప్రొఫైల్స్‌ సృష్టించడం, అనంతరం వారికి వలపు వల విసరడం, ఇందులో చిక్కుకున్న వారిని రకరకాలుగా వేధిస్తూ ఖాతాలు ఖాళీ చేయించడం.. తదితర పనులను ఆ యువకులకు అప్పగిస్తున్నారు. కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు. ఎదురుతిరిగిన వారిని చీకటి గదుల్లో బంధిస్తున్నారు. బ్యాట్లు, ఇనుప రాడ్లతో కొడుతున్నారు. తిండి పెట్టకుండా కడుపులు మాడ్చుతున్నారు. చుట్టూ ఎత్తైన ప్రహరీలు, పటిష్ఠ భద్రతావ్యవస్థ వల్ల అసలు తప్పించుకునే అవకాశమే ఉండదని వారి వలలో చిక్కి, తిరిగివచ్చిన బాధితులు చెబుతున్నారు.

నిరసనతో కదలిక..

సైబర్‌ నేరస్థుల ఉచ్చులో చిక్కుకున్న దాదాపు 300 మంది భారతీయులు ఇటీవల కంబోడియాలోని జునైబ్‌ కాంపౌండ్, శిహనౌక్‌విల్లే వంటి ప్రాంతాల్లో నిరసనకు దిగారు. దీంతో అక్కడి యంత్రాంగంలో కదలిక వచ్చింది. అక్కడి భారత ఎంబసీ జోక్యం చేసుకోవడంతో వారందరినీ తిరిగి భారతదేశానికి పంపింది. అందులో ఏపీలోని విశాఖపట్నానికి చెందిన 24 మంది యువకులు ఉన్నారు. వారంతా తిరిగి వైజాగ్‌కు వచ్చారు. ఇది జరిగిన కొన్ని రోజులకే మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలానికి చెందిన ఓ యువకుడు కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి.. తాను కంబోడియాలో ఉన్నానని, ఇక్కడ తనను వేధిస్తున్నారంటూ ఆవేదన వెలిబుచ్చారు. కానీ, దీనిపై ఎక్కడా కేసు నమోదు కాలేదు. తెలంగాణకు చెందిన ఇలాంటి బాధిత యువకులు అనేక మంది కంబోడియాలో ఉన్నారని, బయటపడే అవకాశం లేకపోవడంతో అక్కడే మగ్గిపోతున్నారని అధికారులు భావిస్తున్నారు. బాధితులు, వారి బంధువుల నుంచి ఇప్పటివరకు 8 మంది యువకుల వివరాలు వచ్చాయని, ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి సైబర్‌ నేరస్థుల ఉచ్చు నుంచి తప్పించి తెలంగాణకు రప్పించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే కంబోడియాలో చిక్కుకున్న తెలంగాణ యువతకు విముక్తి లభించే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని