Updated : 02 Jan 2022 05:23 IST

Cyber Crime: రూ.వందకు రెండొందలు..

రెండ్రోజుల్లో ఇస్తామంటూ సైబర్‌ నేరగాళ్ల మాయాజాలం

కరోనా వైద్యపరికరాల తయారీ అంటూ మోసం

3 నెలల్లో రూ.300 కోట్లు కొల్లగొట్టిన వైనం

ఈనాడు - హైదరాబాద్‌

* మెహిదీపట్నంలో నివాసముంటున్న అనితా ఘోష్‌కు ఆమె స్నేహితులు రెండు నెలల క్రితం ఓ విషయం చెప్పారు. లవ్‌లైఫ్‌ నేచర్‌ హెల్త్‌కేర్‌ సంస్థ కరోనా వైరస్‌ను తగ్గించే వైద్యపరికరాలు తయారు చేస్తోంది. అందులో రూ.100 మదుపు చేస్తే.. రెండు రోజుల్లో రూ.200 ఇస్తున్నారని వివరించారు. దీంతో ఆమె ఆ సంస్థ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని అందులో రోజుకు రూ.100, రూ.200 మదుపు చేయడం ప్రారంభించారు. లాభం కూడా క్రమం తప్పకుండా రావడంతో విషయాన్ని ఆమె తన భర్తకు వివరించారు. దీంతో ఆయన నెల రోజుల్లో రూ.4.50 లక్షలు మదుపు చేశారు. ఈసారి లాభం రాకపోగా వారి చరవాణుల్లో లవ్‌లైఫ్‌ నేచర్‌ యాప్‌ స్తంభించిపోయింది.

* పాతబస్తీలోని మీర్‌చౌక్‌లో ఉంటున్న వ్యాపారి చరవాణికి ఎఫ్‌క్యూ మార్కెట్స్‌ పేరుతో ఒక లింక్‌ వచ్చింది. తమ కంపెనీలో మదుపు చేస్తే రూ.లక్షకు రోజుకు రూ.5వేల నుంచి రూ.10 వేల వరకూ లాభం వస్తుందని అందులో ఉంది. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న వ్యాపారి తొలుత రూ.1.50 లక్షలు మదుపు చేశారు. రెండురోజుల తర్వాత మీకు రూ.15 వేల లాభం వచ్చిందని ప్రకటించారు. దీంతో ఆ వ్యాపారి పెద్దమొత్తంలో  మదుపు చేస్తూ వెళ్లారు. రూ.36 లక్షలు పెట్టాక ఆయన ఖాతాలో రూ.5కోట్ల మొత్తం ఉందని సైబర్‌ నేరస్థుడు చెప్పాడు. విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా.. యాప్‌ పనిచేయడం ఆగిపోయింది.

ఇదంతా సైబర్‌ నేరగాళ్లు చేస్తున్న మాయ. తెలుగు రాష్ట్రాలతోపాటు మెట్రో నగరాల్లోనూ వేర్వేరు ప్రకటనలు, లింకులతో ప్రచారం నిర్వహిస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. మొబైల్‌ యాప్‌ ద్వారా రూ.లక్ష మదుపు చేస్తే.. ఇరవై రోజుల్లో మరో లక్ష రూపాయలు వస్తాయంటూ చెబుతున్నారు. వరుసగా నాలుగైదుసార్లు లాభాలు చూపించాక, పెద్ద ఎత్తున నగదు బదిలీ చేయించుకుని మొబైల్‌ యాప్స్‌ను చరవాణుల్లోంచి తొలగిస్తున్నారు.

లవ్‌లైఫ్‌ హెల్త్‌కేర్‌ ఉత్పత్తుల పేరుతో యాప్‌

ఇలాంటి మోసాలు ఎక్కువగా దిల్లీ కేంద్రంగా జరుగుతున్నాయి. డిజిటల్‌ మోసాలకు పాల్పడుతున్నవారు సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ కంపెనీల పొరుగుసేవల విభాగాల నుంచి మెట్రో నగరాల్లో ఉంటున్న వారి ఫోన్‌ నంబర్లను గంపగుత్తగా కొంటున్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాల్లో నివసిస్తున్న వ్యక్తుల వివరాలను పరిశీలించి జాబితాను తయారు చేసుకుంటున్నారు. వారికి లైఫ్‌లైన్‌ ఎఫ్‌క్యూ మార్కెట్స్‌ లిమిటెడ్‌, యాక్సన్‌, మాల్‌ 008 యాప్‌ల పేర్లతో వాట్సప్‌ నంబర్లకు లింకులు పంపుతున్నారు. వాటిని క్లిక్‌ చేయగానే బాధితులతో ఛాటింగ్‌ ప్రారంభించి వారికి డీమ్యాట్‌ తరహాలో ప్రత్యేకంగా ఓ డిజిటల్‌ ఖాతాను ప్రారంభిస్తున్నారు. ఆ ఖాతాలో నగదు విత్‌డ్రా మాత్రం సైబర్‌ నేరస్థుల చేతుల్లో ఉంటోంది. ఇలా రెండు నెలల్లో రూ.300 కోట్ల వరకు స్వాహా చేసుంటారని సమాచారం.


తెరవెనుక చైనా కంపెనీలు!

హైదరాబాద్‌తో పాటు, విజయవాడలో కూడా దీనిపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు... బాధితులు తెలిపిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి, లవ్‌లైఫ్‌ నేచర్‌ కంపెనీపై దృష్టి కేంద్రీకరించారు.  ఈ వెబ్‌సైట్‌ను అమెరికాలోని అరిజోనాలో మూడు నెలల క్రితం సృష్టించినట్టు తెలుసుకున్నారు. దీని వెనక చైనా కంపెనీలున్నట్టు అనుమానిస్తున్నారు. దిల్లీలో ఓ కార్యాలయాన్ని ప్రారంభించి పది మందిని నియమించుకున్నారని సమాచారం. అనసూయ, సందీప్‌, శుభి పేర్లతో బాధితులకు ఫోన్లు వచ్చినట్టు తెలుసుకున్న పోలీసులు.. నగదు లావాదేవీలను పరిశీలించారు. కేసును పూర్తి స్థాయిలో విచారిస్తున్నామని సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ వెల్లడించారు.

కేవీఎం ప్రసాద్‌ ఏసీపీ సైబర్‌క్రైమ్స్‌


Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని