KTR: రాష్ట్రవ్యాప్తంగా పదో తేదీ వరకు రైతుబంధు సంబురాలు

రాష్ట్ర రైతుల ఖాతాల్లోకి రైతుబంధు పథకం ద్వారా జమ అవుతున్న సొమ్ము రూ. 50 వేల కోట్లకు చేరుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి పదో తేదీ వరకు తెరాస ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలను

Updated : 03 Jan 2022 05:27 IST

ఇళ్ల ముందు ముగ్గులు.. ఊరేగింపులు
తెరాస శ్రేణులకు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పిలుపు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర రైతుల ఖాతాల్లోకి రైతుబంధు పథకం ద్వారా జమ అవుతున్న సొమ్ము రూ. 50 వేల కోట్లకు చేరుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి పదో తేదీ వరకు తెరాస ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలను భారీఎత్తున నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిలతో కలిసి ఆయన ఆదివారం తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్‌పర్సన్‌లు, రైతుబంధు అధ్యక్షులు, డీసీఎంఎస్‌లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ ఆలోచించని రీతిలో రైతుల గురించి కేసీఆర్‌ ఆలోచించి ప్రవేశపెట్టిన గొప్ప పథకం రైతుబంధు. రైతుల ఖాతాల్లోకి చేరుతున్న సొమ్ము ఈనెల 10 నాటికి రూ.50వేల కోట్లు కాబోతున్నాయి. ఇది అద్భుతం. సందర్భాన్ని ఘనంగా జరుపుకోవాలి.

ఇవీ కార్యక్రమాలు

ప్రతి గ్రామంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ఊరేగింపులతో మొదలుపెట్టి రాష్ట్రంలోని 2,600కు పైగా రైతువేదికల వద్ద, సంక్రాంతి సందర్భంగా ప్రతి ఇంటి ముందు మహిళలు రైతుబంధు సంబంధిత ముగ్గులను వేసేలా కార్యక్రమాలు నిర్వహించాలి. విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించాలి. మాధ్యమాల్లో విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి రైతులు సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఒక గొప్ప ఊతంగా మారింది. సీఎం రైతన్నల ఆత్మబంధువు. ప్రపంచంలోనే అతిపెద్ద నీటిపారుదల పథకమైన కాళేశ్వరం నుంచి చెరువులను బలోపేతం చేశారు. రైతుబంధు, రైతు బీమా నుంచి రైతువేదికలను అమలుచేశారు. కరోనా నేపథ్యంలో నిబంధనలను విధిగా పాటించాలి’’ అని కేటీఆర్‌ సూచించారు.

మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయరంగ పటిష్ఠానికి సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో రైతుబంధు చేపట్టారని తెలిపారు. ‘ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు అవసరమైన సమాచారాన్ని వ్యవసాయశాఖ ద్వారా అందిస్తాం. 63 లక్షలమంది రైతులకు సాయపడిన సందర్భం ఏదేశంలోనూ లేదు.నవ తరాన్ని సాగువైపు మళ్లించేలా యోచించే ప్రతి ప్రభుత్వానికి రైతుబంధు స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని