Vaccination: టీనేజర్లకు నేటి నుంచి కొవిడ్‌ టీకా

రాష్ట్రంలో 15-18 ఏళ్ల వయసు కలిగిన టీనేజీ పిల్లలకు సోమవారం నుంచి కొవిడ్‌ టీకాల పంపిణీని ప్రారంభించనున్నారు. పెద్దల మాదిరిగానే వీరికి కూడా ఒక్కో డోసులో 0.5 మి.లీ. మోతాదు చొప్పున ఇవ్వనున్నారు.

Updated : 03 Jan 2022 05:25 IST

4 వారాలకు రెండో డోసు
అందరికీ కొవాగ్జిన్‌
మార్గదర్శకాలు జారీ చేసిన డీహెచ్‌
ప్రైవేటులో ధరపై స్పష్టత కరవు

ఈనాడు, హైదరాబాద్‌; ఈనాడు, దిల్లీ: రాష్ట్రంలో 15-18 ఏళ్ల వయసు కలిగిన టీనేజీ పిల్లలకు సోమవారం నుంచి కొవిడ్‌ టీకాల పంపిణీని ప్రారంభించనున్నారు. పెద్దల మాదిరిగానే వీరికి కూడా ఒక్కో డోసులో 0.5 మి.లీ. మోతాదు చొప్పున ఇవ్వనున్నారు. ఈ వయసు టీనేజర్లందరికీ కొవాగ్జిన్‌ టీకాను మాత్రమే అందించనున్నారు. తొలిడోసు స్వీకరించిన 4 వారాల తర్వాత రెండో డోసును అందించనున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్‌) డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు. 15-18 ఏళ్ల మధ్యవయస్కులకు టీకాల అందజేతపై ఆదివారం ఆయన మార్గదర్శకాలను విడుదల చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఈ టీకాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నా.. ఒక్కో డోసుకు ఎంత ధర వసూలు చేయాలనే స్పష్టత మాత్రం ఇవ్వలేదు.

ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు

రాష్ట్రంలో 15-18 ఏళ్ల వయసువారు 22,78,683 మంది ఉంటారని అంచనా. జీహెచ్‌ఎంసీ, 12 మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధుల్లో లబ్ధిదారులకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుంటేనే టీకాలిస్తారు.మిగిలిన తెలంగాణ జిల్లాలకు చెందిన పిల్లలకు ఆఫ్‌లైన్‌లో అంటే నేరుగా వ్యాక్సిన్‌ కేంద్రానికి వచ్చి టీకా పొందొచ్చు. 2007 లేదా అంతకు ముందు పుట్టిన వారంతా అర్హులు. వీరికోసం ప్రభుత్వ వైద్యంలో గ్రామీణ, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్యకేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. వైద్యుడి పర్యవేక్షణలో తల్లిదండ్రుల సమక్షంలో వ్యాక్సిన్లు వేస్తారు. టీకా పొందాక అరగంట పాటు టీకా కేంద్రంలో ఉండాలి. ఈ సమయంలో ఎటువంటి దుష్ఫలితాలు ఎదురైనా సత్వరమే చికిత్స అందించేలా ప్రత్యేక ఔషధ కిట్లను సిద్ధం చేశారు.

10 నుంచి ముందస్తు నివారణ టీకా

ఈ నెల 10 నుంచి వైద్యసిబ్బంది,  ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు, 60 ఏళ్లు దాటిన దీర్ఘకాలిక రోగులకు  బూస్టర్‌ డోసు ఇవ్వాలని ఇప్పటికే కేంద్రం ఆదేశాలివ్వడంతో క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు తెలిపారు. అప్పట్లో తీసుకున్న టీకానే ఇప్పుడూ ఇవ్వనున్నారు. మూడోడోసుగా 0.5 ఎం.ఎల్‌. మోతాదునే అందించనున్నారు. మూడోడోసు తీసుకోనున్న 60ఏళ్ల పైబడినవారు  వైద్యుడి సిఫారసు ధ్రువపత్రాన్ని తప్పక సమర్పించాల్సి ఉంటుంది.

మౌలిక వసతులు పెంచుకోండి: కేంద్రం

దేశంలో 15-18ఏళ్ల పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభిస్తున్నందున..  జాగ్రత్తలన్నీ తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సూచించారు. ఇతర వయసుల వారికి వేసే టీకాలు ఇందులో కలిసిపోకుండా.. పిల్లల కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్‌ కేంద్రాలు పెట్టాలని స్పష్టంచేశారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేయాలని కోరారు.

* దేశవ్యాప్తంగా కొవిడ్‌ టీకాల కోసం ఆదివారం సాయంత్రం వరకు 6.35 లక్షల మంది 15-18 ఏళ్ల పిల్లలు కొవిన్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని