China: పాంగాంగ్‌ సరస్సుపై చైనా వంతెన

భారత్‌తో సరిహద్దుల్లో తన దూకుడును చైనా మరింత పెంచింది. తమ భూభాగంలో మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరుస్తోంది. ఇందులో భాగంగా తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సుపై ఓ కీలక వంతెనను

Updated : 04 Jan 2022 05:57 IST

సైనికులు, ఆయుధాల సత్వర తరలింపునకు వీలు
భారత బలగాలపై పైచేయి సాధించే ప్రయత్నం

ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌తో సరిహద్దుల్లో తన దూకుడును చైనా మరింత పెంచింది. తమ భూభాగంలో మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరుస్తోంది. ఇందులో భాగంగా తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సుపై ఓ కీలక వంతెనను ప్రస్తుతం నిర్మిస్తోంది. తాజాగా బయటికొచ్చిన ఉపగ్రహ చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. అత్యవసర సమయాల్లో సైనిక బలగాలు, ఆయుధ సామగ్రిని సరిహద్దులకు వేగంగా తరలించేందుకు వంతెన దోహదపడనుంది. దాని నిర్మాణం దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరితగతిన పూర్తిచేసేందుకుగాను దాని నిర్మాణంలో ఫాబ్రికేటెడ్‌ పద్ధతిని అనుసరిస్తున్నారు. 2020 జూన్‌ నాటి గల్వాన్‌ ఘర్షణల తర్వాత భారత సైన్యం పాంగాంగ్‌ సరస్సుకు దక్షిణం వైపు ఉన్న కీలక కైలాశ్‌ రేంజ్‌ పర్వత శిఖరాలను ఆక్రమించింది. అక్కడికి భారీగా బలగాలను తరలించింది. తద్వారా ఆ ప్రాంతంలో చైనా బలగాలపై పైచేయి సాధించింది. అప్పటి నుంచి అక్కడ పట్టు కోసం చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ ప్రణాళికల్లో భాగంగానే తాజాగా వంతెన నిర్మాణాన్ని తలపెట్టింది. డ్రాగన్‌ భూభాగంలోనే కుర్నాక్‌ ప్రాంతంలో పాంగాంగ్‌ సరస్సుసై దాన్ని నిర్మిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే.. భారత సరిహద్దుల్లోని రుడోక్‌ వరకూ బలగాల తరలింపు సులువవుతుంది. సమీపంలోని సైనిక శిబిరాల నుంచి డ్రాగన్‌ బలగాలను తరలించడానికి ఇప్పుడు 180 కిలోమీటర్ల దూరం తిరిగి రావాల్సి వస్తోంది. కొత్త వంతెన నిర్మాణంతో ఆ దూరం 50 కిలోమీటర్లకే పరిమితమవుతుంది. భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా కొన్నాళ్లుగా దూకుడుగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో అత్యాధునిక గ్రామాలు నిర్మిస్తోంది. భారత సరిహద్దుకు చేరువలో ఇటీవల అనేక ఫార్వర్డ్‌ ఆపరేషనల్‌ బేస్‌ల నిర్మాణం చేపట్టింది. వీటిలో క్షిపణి ప్రయోగ వేదికలు, హెలిపాడ్లు కూడా ఉంటాయి. మరోవైపు- డ్రాగన్‌ ప్రయత్నాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామని భారత సైనిక అధికారులు చెబుతున్నారు.

ఆధిపత్యం కోసమే..

లద్దాఖ్‌ ప్రాంతంలో ఆధిపత్యం ప్రదర్శించాలన్న ఉద్దేశంతోనే చైనా హడావుడిగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించిందని భారత సైనిక అధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. ఇప్పటికే పశ్చిమ హిమాలయాల ప్రాంతంలో శరవేగంగా కొన్ని వందల కిలోమీటర్ల మేర ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ను డ్రాగన్‌ ఏర్పాటుచేసినట్లు చెప్పారు. సైనిక శిబిరాల మధ్య సమాచార వ్యవస్థ నాణ్యంగా, పకడ్బందీగా ఉండేందుకు అది దోహదపడుతుందని తెలిపారు. సంప్రదాయ సమాచార వ్యవస్థలోకి ప్రత్యర్థి దేశాలు చొరబడే అవకాశం ఉంటుందన్న సంగతిని గుర్తుచేశారు. అందుకు తావులేని విధంగా కేబుల్‌ ద్వారా సైనిక శిబిరాలను అనుసంధానం చేయడం వ్యూహాత్మక చర్యేనని ఆయన వివరించారు. ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను నిర్మించడమే లక్ష్యంగా చైనా ఇటీవల కాలంలో తన భూభాగంలో అనే నిర్మాణాలు చేపట్టిందని పేర్కొన్నారు. కొత్త రహదారులతో పాటు సొరంగాలు, వంతెనల నిర్మాణంపై ఆ దేశం దృష్టి సారించిందని చెప్పారు.


గల్వాన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చైనా

దిల్లీ: కొత్త ఏడాది తొలి రోజునే గల్వాన్‌ లోయలో చైనా సైనికులు తమ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తద్వారా ఆ లోయ తమదేనని వారు ప్రకటించినట్లయింది. సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే- ఇరు దేశాల మధ్య నిస్సైనీకరణ జోన్‌ను చైనా అతిక్రమించలేదని భారత సైనిక వర్గాలు స్పష్టం చేశాయి. ఆ దేశ సైనికులు వారి భూభాగంలోనే జాతీయ పతాకాన్ని ఎగరేశారని తెలిపాయి.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని