JP Nadda: దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమిది

తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజల కోసం భాజపా పోరాటం చేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా స్పష్టం చేశారు. తమ ధర్మపోరాటానికి వారంతా మద్దతు ఇవ్వాలని కోరారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి మంగళవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు.

Updated : 05 Jan 2022 05:18 IST

కాళేశ్వరాన్ని ఏటీఎంలా మార్చుకున్న కేసీఆర్‌
హుజూరాబాద్‌ ఫలితాన్ని రాష్ట్రమంతా చూపిస్తాం
భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా  

కారులోంచి కార్యకర్తలకు అభివాదం చేస్తున్న జె.పి.నడ్డా. పక్కన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి


కేసీఆర్‌ సర్కార్‌ తీరు చూస్తుంటే తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? అనే సందేహం కలుగుతోంది. ఈ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. ముఖ్యమంత్రి మెంటల్‌ బ్యాలెన్స్‌ కోల్పోయారు. ఇది ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం. అవినీతి, అప్రజాస్వామిక, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భాజపా ధర్మయుద్ధం చేస్తోంది. వీరిని గద్దె దించేవరకు మా పోరాటం కొనసాగుతుంది

- భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా


ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజల కోసం భాజపా పోరాటం చేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా స్పష్టం చేశారు. తమ ధర్మపోరాటానికి వారంతా మద్దతు ఇవ్వాలని కోరారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి మంగళవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా, రాష్ట్ర ప్రభుత్వంపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. హుజూరాబాద్‌ ఫలితం రుచిని రాష్ట్రవ్యాప్తంగా చూపిస్తాం.. అంటూ తెరాసను హెచ్చరించారు. ఉద్యోగులకు మద్దతు ఇచ్చేందుకే రాష్ట్రానికి వచ్చానని తెలిపారు. ‘రాష్ట్రంలో మంత్రులు అనేక ర్యాలీలు నిర్వహించారు. వారికి కరోనా నిబంధనలు అమలుకావా? భాజపాకే అడ్డు వస్తాయా? ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యపై బండి సంజయ్‌ శాంతియుతంగా దీక్ష చేపడితే ఆయన కార్యాలయంలోకి పోలీసులు బలవంతంగా వెళ్లారు. సంజయ్‌పై భౌతికదాడి చేయడంతో పాటు కార్యకర్తలపై లాఠీఛార్జి చేశారు. దుబ్బాక, హుజూరాబాద్‌లలో ఓటముల్ని తెరాస జీర్ణించుకోలేకపోతోంది. కరోనా సాకుతో ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం అణచివేస్తోంది. 317 జీఓ విషయంలో తన వైఖరి మార్చుకోవాలి.

సీఎం కనుసన్నల్లోనే అంతా..  
రాష్ట్రంలో ఉన్నది దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం. సీఎం కనుసన్నల్లోనే అవినీతి జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అసలు అంచనా వ్యయం రూ. 36 వేల కోట్లు అయితే రూ.1.20 లక్షల కోట్లకు పెంచారు. దాన్ని కేసీఆర్‌ ఏటీఎంలాగా మార్చుకున్నారు. ఆ నీళ్లు ఆయన ఫాంహౌస్‌కే వెళ్తున్నాయి. పాలమురు-రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి, మిషన్‌ భగీరథ నుంచి చుక్క నీరు ఇచ్చారా? రాష్ట్రాన్ని తానీషాలా పాలిస్తున్నారు. కొడుకు, కూతురు, అల్లుడు.. కుటుంబ పాలన ఇది. కేసీఆర్‌ అవినీతిని, నియంతృత్వ విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళతాం. బండి సంజయ్‌ అరెస్టు అప్రజాస్వామికం. ‘వినాశకాలే  విపరీత బుద్ధిః’ అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. భాజపా సైద్ధాంతిక పార్టీ. మమ్మల్ని ఆపలేరు. కేసీఆర్‌ ముసుగు తొలగిస్తాం. అవినీతి, నియంతృత్వ ప్రభుత్వంపై పోరాటం చేస్తాం. రోజూ ధర్నాలు చేస్తాం.

కాంగ్రెస్‌ పోరాడదు..
‘భాజపా, తెరాసలవి దిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ. తెరాసపై ఆరోపణలు చేస్తున్న భాజపా విచారణ చేయిస్తుందా?’ అంటూ కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శల గురించి విలేకరులు ప్రస్తావించగా, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వంపై భాజపా మాత్రమే పోరాటం చేస్తుందని.. అందులో సఫలీకృతం అవుతుందని నడ్డా స్పష్టంచేశారు. కాంగ్రెస్‌ పోరాటం చేయదు. చేయనివ్వదు.. మాకో విధానం ఉంది. పోరాటం చేస్తాం.. అని పేర్కొన్నారు. ‘బండి సంజయ్‌ విషయాన్ని భాజపా జాతీయ మానవ హక్కుల సంఘానికి నివేదిస్తుంది. సంజయ్‌ ఫిర్యాదుపై లోక్‌సభ స్పీకర్‌ రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తారు’ అని బదులిచ్చారు. ‘కరోనా తెలంగాణలోకి రాలేదు.. ఒక్కరమైనా మాస్క్‌ పెట్టుకున్నామా?’ అంటూ అసెంబ్లీలో కరోనా తొలి వేవ్‌ ప్రారంభంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యల వీడియోను నడ్డా ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ సమావేశంలో భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌, ముఖ్యనేతలు డీకే అరుణ, విజయశాంతి, కె.లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, జితేందర్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని