Electricity Theft: కరెంటు కొట్టేస్తున్నారు

హైదరాబాద్‌ పాతనగరంలోని ఛత్రినాక ప్రాంతంలో ఒక ఇంటి మీటరుకు బైపాస్‌ పద్ధతిలో మరో వైరు కలిపి నేరుగా కరెంటు తీసుకుంటున్న దర్జా వ్యవహారమిది. ఇలా తీసుకునే కరెంటు.. మీటరులో నమోదు కాదు.. బిల్లు రాదని విద్యుత్‌

Updated : 07 Jan 2022 05:04 IST

యథేచ్ఛగా చౌర్యం  
జాబితాలో నేతలు, ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు
భూగర్భ కేబుళ్లు.. మీటరుకు బైపాస్‌ కనెక్షన్లు  
గత ఏడాది పట్టుబడినవి 81,000
ఈనాడు - హైదరాబాద్‌

హైదరాబాద్‌ పాతనగరంలోని ఛత్రినాక ప్రాంతంలో ఒక ఇంటి మీటరుకు బైపాస్‌ పద్ధతిలో మరో వైరు కలిపి నేరుగా కరెంటు తీసుకుంటున్న దర్జా వ్యవహారమిది. ఇలా తీసుకునే కరెంటు.. మీటరులో నమోదు కాదు.. బిల్లు రాదని విద్యుత్‌ సిబ్బంది తనిఖీల్లో గుర్తించారు.

రాష్ట్రంలో భారీగా విద్యుత్‌ చౌర్యం జరుగుతోంది. ఇదంతా ఏదో పూట గడవని పేదలు చేస్తున్నారనుకుంటే పొరపాటే. సమాజంలో గుర్తింపు గల పదవుల్లో ఉన్నవారు, ఉద్యోగాలు చేస్తున్నవారు, పరిశ్రమలు నడుపుతున్నవారు, రాజకీయ నేతలమంటూ తిరిగేవారూ కొందరు కరెంటు కాజేస్తున్నారు. దొంగ కనెక్షన్లతో కరెంటు కొట్టేస్తున్న వారిని వేలమందిని పట్టుకుంటున్నా చౌర్యం ఆగడం లేదు. వీరికి జరిమానాలు వేస్తున్నా చౌర్యం వల్ల జరిగిన నష్టం పూడటం లేదు. గత ఏడాదికాలంలో రెండు డిస్కంల పరిధిలో ఏకంగా 81 వేల దొంగ కనెక్షన్లను విజిలెన్స్‌ సిబ్బంది పట్టుకున్నారు. దాదాపు రూ. 48 కోట్ల విలువైన కరెంటును అక్రమంగా వాడుకున్నట్లు తేల్చారు. రాష్ట్రంలో రెండు విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఉన్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా గల దక్షిణ తెలంగాణ డిస్కం పరిధిలో 2020 డిసెంబరు నుంచి 2021 నవంబరు వరకూ విజిలెన్స్‌ సిబ్బంది జరిపిన దాడుల్లో 59,522 దొంగ కనెక్షన్లను పట్టుకున్నారు. వీటి ద్వారా ఏడాదిలో చౌర్యం చేసిన కరెంటు విలువ రూ. 42.24 కోట్లుగా లెక్కతేల్చారు. ఇలాగే వరంగల్‌ కేంద్రంగా గల ఉత్తర తెలంగాణ డిస్కం పరిధిలో గత ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకూ 17,099 దొంగ కనెక్షన్లను పట్టుకున్నారు. ఈ కరెంటు దొంగలకు రూ. 5.46 కోట్ల జరిమానా వేశారు. 2020-21లో ఇదే ఉత్తర డిస్కం పరిధిలో మొత్తం 30,978 దొంగ కనెక్షన్లు పట్టుకుని రూ. 6.68 కోట్ల జరిమానా విధించారు.  


హైదరాబాద్‌ నడిబొడ్డున..

ల్లెల్లో కంటే పట్టణాలు, నగరాల్లోనే ఇళ్లు, పరిశ్రమలకు రూ.లక్షల విలువైన కరెంటు అక్రమంగా వాడేసుకుంటున్నారు. హైదరాబాద్‌ నగరంలోని ఓ ఇంటిని తనిఖీ చేస్తే అక్కడ జరుగుతున్న విద్యుత్‌ చౌర్యం చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. ఆ ఇంటికి ఉన్న మీటరు సీలును మార్చేసి లోపల బైపాస్‌ పద్ధతిలో రీడింగు నమోదు కాకుండా మరో తీగ నుంచి కరెంటు తీసుకుని వాడుకుంటున్నారు.


భూగర్భ కేబుల్‌ వ్యవస్థ!  

సాధారణంగా కరెంటు కనెక్షన్‌ అంటే స్తంభం నుంచి తీగను మన ఇంటి దగ్గరకు లాగి మీటరుకు కలుపుతారనే అందరికీ తెలుసు. కానీ కరెంటు దొంగల రూటే వేరు. హైదరాబాద్‌ శివారు గంధంగూడలోని ఓ చిన్న పరిశ్రమకు ప్రతి నెలా తక్కువ బిల్లే వస్తుండటంతో అధికారులకు అనుమానమొచ్చి లోతుగా పరిశీలిస్తే అసలు బండారం బయటపడింది. మీటరు దగ్గర నుంచి మరో తీగను భూమి లోపలి నుంచి లాగి దర్జాగా కరెంటు వాడుకుంటున్నట్లు వెల్లడైంది. అందుకే సదరు పరిశ్రమకు బిల్లు చాలా తక్కువగా వస్తున్నట్లు తేలింది. ఆ పరిశ్రమ యజమానికి రూ. 6.10 లక్షల జరిమానా విధించారు.


ఫ్యూజులు తీసేసినా కరెంటుందే!

మ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో చిన్నస్థాయి పదవిలో ఉన్న ఓ నాయకుడు ఇంటికి దొంగ కనెక్షన్‌ ద్వారా కరెంటు వాడుకుంటున్నారు. ఆయనను ఎలాగైనా పట్టుకోవాలని విజిలెన్స్‌ సిబ్బంది తనిఖీకి వెళ్లే ముందు ఇంటి ఆవరణలోని మెయిన్‌ బోర్డు దగ్గరున్న ఫ్యూజులు తీసేసి లోపలకు వెళ్లారు. సదరు నేత అధికారులకు మర్యాద చేయాలని ఏసీ, లైట్లు వేసి కూర్చోమన్నాడు. వారు తమ చేతిలోని ఫ్యూజులు చూపించి.. ఇవి తీసేసినా కరెంటు ఎలా వస్తోందని గద్దించి అడిగితే తన కొడుకు, స్థానిక విద్యుత్‌ లైన్‌మెన్‌ సహకారంతో దొంగ కనెక్షన్‌ తీసుకున్నట్లు అంగీకరించాడు.


రాష్ట్రంలో విద్యుత్‌ నష్టాల తీరు (కోట్ల యూనిట్లలో..)

* రాష్ట్రంలో గతేడాది (2020-21)లో రెండు డిస్కంలు కలిపి మొత్తం 6,310.30 కోట్ల యూనిట్ల కరెంటును సరఫరా చేయగా 5,704.50 కోట్ల యూనిట్లకే బిల్లు వసూలు వసూలైనట్లు డిస్కంలు ఈఆర్‌సీకి ఇచ్చిన నివేదికలో తెలిపాయి. మిగిలిన 605.40 కోట్ల యూనిట్లు పంపిణీ, సరఫరాలో నష్టాలు (లైన్‌ లాసెస్‌), విద్యుత్‌ చౌర్యం వల్ల నష్టపోయినట్లు అంచనా.

* ఒక్కో యూనిట్‌ కరెంటు సగటు సరఫరా వ్యయం రూ. 7.14 అవుతోంది. ఈ లెక్కన మొత్తం నష్టపోయిన 605.40 కోట్ల యూనిట్లపై రూ. 4,322.55 కోట్ల ఆదాయాన్ని డిస్కంలు కోల్పోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని